Sunday, May 31, 2026
E-PAPER
Homeదర్వాజకటిక చీకట్లను చీల్చుకుని వెలువడ్డ శేషేంద్ర మహాకావ్యం 'గొర్రిల్లా'

కటిక చీకట్లను చీల్చుకుని వెలువడ్డ శేషేంద్ర మహాకావ్యం ‘గొర్రిల్లా’

- Advertisement -

భారతదేశంలో ఇందిరాగాంధీ 25 జూన్, 1975 అర్థరాత్రి ఎమర్జెన్సీ’ని విధించి (అత్యయికస్థితి) 21 నెలలు అంటే 21 మార్చ్ 1977 వరకు చీకటి కాలాన్ని సృష్టించిన కాలంలో మేధోమతులైన బుద్ధిజీవులు ఆ అరాచకాన్ని ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా జైళ్ళను నింపి తిరుగబడ్డారు. ఐనా.. ఉదార స్వభావులైన కొందరు ప్రభుత్వ కవులు ‘చక్కబడ్డది జాతి/ చిక్కబడ్డది నీతి/ నడిరేయి వెలిగింది / నవచేతనా జ్యోతి వంటి భజన కవిత్వంతో బాకాలు ఊదారు. కాని గుంటూరు శేషేంద్రశర్మ అప్పటికే తన కొత్త పదపరిమళంతో, శతఘ్నుల్లా ప్రళయించే భావ విస్ఫోటనాలతో, వినూత్న భాషతో, విభిన్న రూపకాలూ, రూపాలతో, ఉపమానాలూ ఉత్ప్రేక్షలతో, అలంకార నిరలంకార సౌందర్యంతో.. 1974లో అప్పటికే ఉన్న సూర్యునికి తోడుగా (సూర్యుడు మండడం మరచిపోతున్నాడేమో అని తలచి మనిషినే మరో సూర్యునిగా రూపొందించే మహా కాంక్షతో ‘మండే సూర్యుడు’ కావ్యాన్ని అందించాడు కవితా ప్రేమికులకు.) ఎప్పుడూ అక్షరాల సముద్రాలను వర్షించే శేషేంద్ర చేతులు ఆ సందిగ్ధ సంక్లిష్ట సందర్భంలో తన కావ్యతూణీరం నుండి (1976 లో అప్పటికీ తీవ్రమైన ఎమర్జెన్సీ ఉంది) దూసుకొచ్చిన ఘనకావ్యం ‘గొర్రిల్లా’.

శివాంశసంభూతుడూ, మహాకాయుడూ, మహాబలుడూ, శుద్ధజంతు జాతికి చెందిన కల్మశమే ఎరుగని హృదయ శుభ్రుడూ ఐన కాలపురుషుడు ‘గొర్రిల్లా’ ఒక రహస్య యుద్ధనీతితో అప్పటి కొత్త యువతరానికి సరికొత్త మార్గదర్శనం చేసేందుకు హరోం హరహర భీకర నినాదంతో దిక్కులు పిక్కటిల్లే మహోగ్రతతో ఆవిర్భవిస్తున్న ప్రళయదృశ్య బీభత్స సుందరాన్ని శేషేంద్ర ఈ మహాకావ్యంలో కవితాప్రియులకు దర్శింపచేశాడు. మానవజాతికి ఒక ‘మండే సూర్యుడు’ ను దానంచేసి రెండు ఖాళీ హస్తాలను దాచి కొత్త కావ్యసముద్రాన్ని ఆవాహన చేస్తూ తపస్పిస్తున్న శేషేంద్ర 1976 లో ఈ ‘ గొర్రిల్లా’ ను తెలుగు స్వర్ణధాత్రిపైకి అవ్యక్త భవిష్యద్విపినాంతరాల్లో అదిగో లేస్తోంది భయంకర ఆకారరేఖ- గొర్రిల్లా ‘ అని కాంతిచ్చటలతో ప్రకాశించే ధర్మాతుడైన అటవిక మహాపురుషుణ్ణి పరిచయం చేస్తాడు కవి. అగ్నిని ప్రతిష్టిస్తున్నట్టు ఒక కొత్త కావ్య ఆవిష్కరణను చేశాడు శేషేంద్ర. అది పుట్టి 50 ఏళ్ళయింది. ఇది ‘ గొర్రిల్లా’ కు స్వర్ణోత్సవ సంవత్సరం. విస్తృతంగా అనేకానేక ప్రక్రియలుగా వెలువడ్డ శేషేంద్ర సాహిత్యం సందర్భాన్నిబట్టి తెలుగులో, ఇతర భాషల్లోకి అనువాదమౌతూ పుంఖాను పుంఖాల గ్రంథాలుగా వెలువడి ఆయనకు అత్యంత అభిమానులైనవాళ్ళ మన్ననలను పొందుతూ దశాబ్దాల పర్యంతం ఎప్పటికప్పుడు నిజమైన సాహిత్య జీవధాతువును ఆస్వాదించగలిగినవాళ్ళు అప్పుడూ ఇప్పుడూ ఆయన పుస్తకాలకు రక్షకులుగా ఉంటూ వస్తూనే ఉన్నారు.

ఆ క్రమంలో ప్రస్తుతం ప్రసిద్ధ సినీహీరోగా వెలిగిపోతున్న పవన్ కళ్యాణ్ 2016 లో ఆయనకు ఎక్కువగా నచ్చిన శేషేంద్ర కవితా పుస్తకాలను మేలు ప్రతులుగా ‘ఆధునిక మహా భారతం’ పేర 12 పర్వాలుగా వెలువరించారు. అందులో ఇప్పుడు మనం చర్చిస్తున్న’ గొర్రిల్లా కవిత్వ సంపుటి 5వ పర్వముగా (పశుపర్వము పేర )అందుబాటులో ఉంది. శేషేంద్ర అన్ని రచనల్లోనూ రెండు విశేషాలు ఉంటాయి. ఒకటి… ఆ ప్రక్రియలో అతను ఎన్నుకున్న విలక్షణమైన వస్తువు. రెండు.. ఆ వస్తువును ఒక ప్రత్యేకమైన శైలిలో పాఠకునిలో ప్రతిష్టిస్తూండడం. ఎప్పుడైనా వస్తువు పాఠకుణ్ణి వెంటాడడం, ఉన్నతీకరించడం.. శైలి చదువరిని చకితుణ్ణి చేయడం.. ఇవే ఎవరైనా కోరుకునేవి. గొర్రిల్లా పుస్తకంలో.. వస్తువు గురించి ప్రతీకాత్మకంగా, నైరూప్యంగా.. సూచ్యంగా కూడా కవి చెబుతున్నపుడు.. గొర్రిల్లా అంటే సాధారణ మనిషికి స్ఫురించే ఒక మహాకాయుడైన, బలాఢ్యుడైన, శుద్ధుడైన, నిస్వార్థుడైన, ధర్మాధర్మ విచక్షణా, వివేకమూ కలిగిన ఒక శక్తి సంపన్నుడు. భ్రష్టులైపోతూ నానాటికీ నీతీ, నియమాలూ, మానవీయ విలువలూ, నైతికతా, బాధ్యతా, ధర్మమూ, హక్కూ, ఆత్మ… ఇవేవీ తెలియని, తెలుసుకోవాలన్న జిజ్ఞాసి లేని, ఇప్పటి అరాచక జనం.. ‘ కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు’ తరహా యువతరాన్ని ఉద్దేశ్యించి వాళ్ళకు దిశానిర్దేశం చేయడం.. తద్వారా మనిషిలో’ సోయి’ ని కలిగించి నిజమైన మనిషిని నిర్మించే ఒక గొప్ప సామాజిక సంస్కరణను సాధించడం. అంతే.

వచనాన్ని ఎట్లా కవిత్వీకరించాలో, అక్షరాన్ని రసాత్మతో పొదిగి దాన్ని పరిపుష్టం చేస్తూనే హృదయాన్ని తాకగల ప్రాణధాతువుగా ఎట్లా శిల్పీకరించాలో నేర్పడం.. వెరసి ఒక మహానుభూతిని లాభంగా పాఠకుడు పొంది పదిలపర్చుకోగల అంతిమ ప్రయోజనంగా స్పృహించడం.. శైలి పరమావధి. సరియైన శైలి చదువరిని సంలీనపరుస్తుంది. ఈ కింది కొన్ని శేషేంద్ర విలక్షణ, విభిన్నమైన వ్యక్తీకరణలను ఇప్పుడు అనుశీలిద్దాం. ”సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు/ తుఫాన్ గొంతు చిత్తం అనడం ఎరగదు/ పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు/ నేనింతా ఒక పిడికెడు మట్టి కావచ్చు/ కాని కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.“ రాత్రి నిద్ర కోల్పోయి ఇళ్ళ కప్పులమీద మొరుగుతోంది. కాలం శిశువులా నిద్రిస్తోంది ఊగుతున్న పెండ్యులం ఉయ్యాలలో, ఇళ్ళన్నీ కళ్ళు మూసుకున్నాయి. గీతికి రెక్కలు రాగానే ఎగిరిపోయింది. నా దేహం అందమైన పక్షి ఎగిరిపోయిన గోరీలా నిలిచిపోయింది. నక్షత్రాల్ని బీడీలుగా కాలుస్తోంది కుత్ పీడిత రాత్రి; వెన్నెల మంటలు ఒంటిమీద రేగుతూండగా ఒక చంద్రుడు ఫ్యాక్టరీ మీదికి ఎగబ్రాకుతున్నాడు.. నా చేతిలో పుస్తకం శిశువై నా వక్షస్థలం మీద ఆడుకుంటోంది. అదుగో వస్తున్నాడు గట్లమీద తిరుగుతూ పిల్లకాలువలకు పాటలు నేర్పేవాడు. ఆ పాటలు తిని కిశోరజలాలు గర్జిస్తూ దూకుతున్నాయి అరణ్యాల్లోకి తల వంచిన వాడికి నక్షత్రాలు కనబడవు వాడి వక్షస్సు వృద్ధి చెందదు. వాడి మెదడులో ఎప్పటికీ సూర్యుడు ఉదయించడు.

వసంతం అనుకుని ఈ దేశపు గుమ్మం ఎక్కి బిక్ష అడిగితే పిడికెడు పూలకు బదులు ఒక అశ్రువు వేస్తుంది ఆమె. ఇక్కడ మన దినం రెండుగా కోసి పళ్ళెంలో ఇచ్చిన మామిడి పండు కాదు.
నా కండలు విప్లవపల్లవి ఆలాపన చేస్తున్నాయ్. నా చేతులు శత్రు కంఠాన్ని తడిసిన తుండుగుడ్డల్లా పిండెయ్యడానికి లేస్తున్నాయి. ఒక్క మబ్బుక్కూడా వర్షం కురిసే ధైర్యం లేదు. ఈ భయంకర బంజరు భూమి మీద తుఫానులు ఆకాశాన్ని తువ్వాళ్ళలా తుడుస్తున్నాయి మేఘాలు- పాపం పొలాల కోరిక ఏమిటి? పంటలు పండి మీ ఆకలి తీరాలనేగదా. రాజమార్గం నడుం విరిగింది. ఆ వెధవ రాజుల్ని మోసీ మోసీ ఎల్లకాలం కోకిల పాడుతూనే ఉంటే ఎలా అదీ ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని కనాలి.. ఈ పాడే వ్యాధి ఏమిటో తెలుసుకోవాలి. గంగా నది మొదట ఒక దేవత, తర్వాత పడవల రస్తా, ఆ తర్వాత మన పొలాల్లోకి పారే ఒక పంట కాలువ! చూశావా కాలం చేతుల్లో దేవతల రూపాలు కూడా మారిపోతాయి. బాబూ నదిలో ఇవాళ మనమంతా మునిగిపోతే పోవచ్చు కాని నదే సముద్రంలో మునిగిపోయే రోజుకూడా రాకపోదు. ఓ గొర్రిల్లాలే గొర్రిల్లా మనిషిలో నిద్రిస్తున్న ఓ క్రియా శక్తి, ఓ క్రియాశక్తీ ఓ మహాత్మా ఓ గొర్రిల్లా నిద్రలే! సూర్యచంద్రుల్ని మొదట చూచిన ఓ పితామహాలే అసహాయయై మానవత ఆక్రందిస్తోందిలే. నీవు కట్టిన సౌదాలు కూలిపోయాయిలే. నీవు నిర్మించిన మనిషి శిథిలమైపోయాడులే. గొర్రిల్లా ఇది నీవు నిదురించడానికి వేళ కాదు. నీ మహాద్వారం దగ్గర నిల్చుని ఈ పాటలల్లుతున్నా. ఈ పాటల జన్మ నిన్ను మేల్కొల్పడానికే ఈ యుగంలో నీ జాగృతికోసం రాయని పాట ఒక ఘోరఘోరం. నీ సుషుప్తికోసం రాసే జోలపాట ఒక మహానేరం. ఓ క్రియాశక్తీ నీవంటేనే నాకు భక్తి. మమ్మల్ని ఆవహించు ఓ గొర్రిల్లా, నిజాలకు మా భుజాలు జోడించు మమ్మల్ని పవిత్ర హింసా సీమలకు మోసుకుపో. నీ రోమరోమాల్లోంచి పుట్టాలి కోట్లానుకోట్ల కర్మవీరులు త్యాగవీరులు పతనమౌతున్న ధరిత్రిని పైకెత్తి ప్రాణప్రతిష్ట చెయ్యాలి.

గొర్రిల్లా పుస్తకంలో.. వస్తువు గురించి ప్రతీకాత్మకంగా, నైరూప్యంగా.. సూచ్యంగాకూడా కవి చెబుతూన్నపుడు.. గొర్రిల్లా అంటే సాధారణ మనిషికి స్ఫురించే ఒక మహాకాయుడైన, బలాఢ్యుడైన, శుద్ధుడైన, నిస్వార్థుడైన, ధర్మాధర్మ విచక్షణా, వివేకమూ కలిగిన ఒక శక్తి సంపన్నుడు. భ్రష్టులైపోతూ నానాటికీ నీతీ, నియమాలూ, మానవీయ విలువలూ, నైతికతా, బాధ్యతా, ధర్మమూ, హక్కూ, ఆత్మ… ఇవేవీ తెలియని, తెలుసుకోవాలన్న జిజ్ఞాసి లేని, ఇప్పటి అరాచక జనం.. ‘

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -