Saturday, May 30, 2026
E-PAPER
Homeకవితమానవత్వపు పరిమళాల్ని వెదజల్లే 'సహానుభూతి'

మానవత్వపు పరిమళాల్ని వెదజల్లే ‘సహానుభూతి’

- Advertisement -

కవులు రకరకాల సమస్యల్ని, సంఘటనల్ని అర్థం చేసుకోవడానికి వారి వారి పరిధుల్లో ఆయా సమస్యల, సంఘటనల పట్ల ‘సహానుభూతి’ ని వ్యక్తపరచడం ద్వారా వాటి తీవ్రతను అంచనా వేయగలుగుతరు. మానవత్వపు పరిమళాల్ని వెదజల్లే ‘సహానుభూతి’ సమాజాన్ని మరింత దగ్గరిగా చూపిస్తది. బాధిత స్వరాల వేదనకు అక్షర రూపం కల్పించడానికి కవులే బాధితులుగా ఊహించుకుంటూ బాధను, నొప్పిని మానసికంగా అనుభవిస్తూ కవిత్వరూపాన్ని పొందిస్తరు. ఈతరం యువకవుల్లో ‘చిక్కొండ్ర రవి’ కవిత్వంలో -సహానుభూతి’ని వ్యక్తపరిచే తీరు సమస్త, సబ్బండ జాతుల జనాల్ని ఆలోచింపజేస్తది. మూలాల్లోకి వెళ్లి నిజానిజాల గుట్టును తెలుసుకునేలా ప్రేరేపిస్తది.

కవిగా ‘వీరనాగు’ శతకంతో సాహిత్యం వైపు వేసిన తొలి అడుగుల్ని పదిల పర్చుకుంటున్నడు. అమ్మ నాగమ్మ, నాయిన శ్రీశైలం తలెత్తుకునేలా తన వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని తీర్చిదిద్దుకుంటున్నడు. పాత పాలమూరు, నేటి వనపర్తి జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన కవి తనదైన ముద్రను సాహిత్యంలో నిలిపి వుంచేలా సాధన చేస్తున్నడు.
రవి తీసుకునే, ఎంపిక చేసుకునే వస్తువులు వైవిధ్యతను కల్గి వున్నా, లేకున్నా వ్యక్తీకరణ భిన్నంగా వుండేలా జాగ్రత్త తీసుకోవడం గమనిస్తాం. సామాజిక రుగ్మతల్ని ‘సహానుభూతి’తో పరిష్కరించడానికి, ఒక మార్గాన్ని ఏర్పర్చడం స్వాగతించవచ్చు. చరిత్రను, పురాణాల్ని వాస్తవ సంసంటనలకు, పరిస్థితులకు అన్వయిస్తూ ‘కవిత’ను నిర్మించడం సాహసోపేతమైన చర్యగా భావిస్తే, లక్ష్యం ఏమిటనే ప్రశ్న పాఠకుల మనసుల్లో బలంగా నాటుకు పోయేలా కవి తాపత్రయపడడం గమనిస్తాం. శీర్షిక ద్వారా కుతూహలాన్ని కల్గించడం ఒకెత్తు అయితే ‘ఎత్తుగడ’ ముగింపు వైపుకు లాక్కెళ్లడం మరో ఎత్తు. ‘నువ్వు, నేను, నెలవంకలు’ వంటి భావనల్ని నెమ్మదిగా అర్థం చేసుకునేలా ‘కవిత్వ నడక’ ను రూపొందిస్తడు.

పలు సందర్భాల్ని ప్రస్తావిస్తూ వాటి పరిణామాల ఆధారంగా నెలవంకల్ని గుర్తుచేస్తూ ‘ఆకలి పేగుకొమ్మకు పూసిన పువ్వులు’ గా ప్రతీకరిస్తడు. ‘ఈ నేల మూలవాసులు’ ఎట్లెట్ల అయితరో జీవిత శకలాల్ని కదిలిస్తూ శ్రమైక జీవనంలోని అలుపెరుగని, జమిలీగా కొనసాగిన ప్రయాణాల్ని గుర్తు చేస్తడు. ఎవరీ మూలవాసులు? ఎందుకింతగా కవి మథనపడుతున్నడు? మనిషిని మనిషి పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే వారి బాధల్ని, కష్టాల్ని, సుఖాల్ని తమవిగా భావించడం, సహానుభూతిని వ్యక్తపర్చడం ఒక్కటే దగ్గరి దారి. ముస్లింలుగా వారి వారి వత్తుల్ని ఆధారంగా చేసుకుని మారిన బహుజనుల పట్ల కవికున్న పాయిరం మామూలుది కాదు. ‘శివుని నెత్తిన నెలవంక’ అనే ఊహ మతసామరస్యాన్ని బోధిస్తది. ఎన్నడూ ఘర్షణ పడని, మతమనే ప్రసక్తి, ప్రస్తావనే లేకుండా కలిసి బతుకుతున్న మనుషుల మధ్య చిచ్చు రాజేసిన ‘నువ్వు’ గురించి, తన రాజకీయ ప్రయోజనాల గురించి పరోక్షంగా గుర్తు చేసే ప్రయత్నం కనిపిస్తది.

కవిలోని సునిశిత పరిశీలన, ఊహాశక్తి, పరిశోధనాత్మక దష్టికోణం తనలోని సజనకారుని సామర్థ్యాన్ని తెలుసుకునేలా పురిగొల్పుతయి. సానుభూతి సుత కరువైన రోజుల్లో ఒక మనిషి అస్తిత్వాన్ని ఈ నేల లోతుల్లోంచి తవ్వి చూపించాల్సి వస్తున్న దుస్థితిని కవి పటంగట్టి చూపడం మెచ్చదగింది. అమ్మీలు, అబ్బాలు, భయ్యాలు, దీదీలు, ఆశన్నలు, ఊషన్నలు, అమ్మా భీం ఫాతిమాలు, చాంద్‌ పాషాలు, అజీమ్‌ భారులు అక్రరులు, గౌస్‌లు, బందగీ కొమురయ్యలు, మైసమ్మలు, మహమ్మదమ్మలు కవిత్వంలో ఒదిగిన తీరుగా తమ బతుకుల్లో కుదురుకోని నిజాల్ని కవి బైట పెడుతూ ‘ఆకుపచ్చగా ఈ నేల నవ్వుతుంటే భరించలేని బద్మాష్‌ గానివి’ అని కాసింత కటువుగా మాట్లాడినా పచ్చగా బతికితే ఒర్వలేని గుణపోల్లని; ఆకుపచ్చదనం ఎవరిని ప్రతీకగా సంబోధిస్తదో వారి నవ్వును భరించలేని మానసికత ముందు ఏమంత ప్రమాదకర వాక్యపు పదాలుగా తోచవు. లౌకికతకు ప్రాణం పోయడానికి, మానవత్వాన్ని నిలిపి వుంచడానికి ఒక పార్శ్వపు, సగం సరళరేఖ మార్గాన్నే గాక; ‘నువ్వు’, ‘వాళ్లు’ తద్విరుద్ధంగా ప్రవర్తించినా అంతే నిబద్ధతను ప్రదర్శించగలిగే నేర్పున్న కవికి సలామ్‌లు.

శివుని నెత్తిన నెలవంక
నువ్వెప్పుడూ ఇంతే
రంగురంగుల పూల తోటల్ని పెంచనియ్యవ్‌
మురిపెంగా బతుకమ్మలను పేర్చనియ్యవ్‌
ఆకుపచ్చగా ఈ నేల నవ్వుతుంటే
భరించలేని బద్మాష్‌ గానివి
నువ్వూ నా నేల మీదికొచ్చినప్పుడే
నన్ను అంటరాన్ని వాన్ని చేసి
ఊరవతలికి తరిమేసావ్‌
ఇప్పుడేమో, అచ్చం నాలాగే నాతోనే
నాకు తోడుగున్న నెలవంకలకు
ఈ నేలతోనే సంబంధం లేదని
పదేపదే అదే మొండి మాట మాట్లాడుతున్నవ్‌
నీతోన ఏగేది ఎట్లా?
మాటకు ముందు మాటకు వెనుక
వాళ్ళువాళ్ళని వేరు చేసి
వొల్లని ఆటాలాడుతున్నవ్‌ కానీ,
వాళ్ళు మాతోనే మాతో పాటే
చేండ్లల్ల, చెలకలల్ల
పదును తేరిన కొడవండ్లైన అమ్మీలు
అడువులల్ల, గుట్టలల్ల
ఆవుల, గొర్రెల కాసిన అబ్బాలు
మాలాగే ఆకలి పేగుకొమ్మకు పూసిన పువ్వులు.
మా తూగుల బువ్వను, మాలిద ముద్దలను
మనసారా కలుపుక తిన్న భయ్యాలు
దూద్‌ సెమీయాలాను దూపతీరగ
పోసిన దీదీలు
ఆశన్నలు, ఊషన్నలు అమ్మా భీం పాతిమాలు.
వాళ్ళు వీరనాగుకు
గొడుగు పట్టిన చాంద్‌ పాషాలు
దట్టీలు కట్టిన అజీమ్‌ బారులు
అక్రమ్‌లు, గౌస్‌లు నా ఆత్మీయులు
మాది బందగీ కొమురయ్యల
బతుకుపోరు బంధం
మేం మైసమ్మకు, మహమ్మదమ్మకు
ఒకే సారి ఊదుపొగల దూపమేసి
దాపుకోరుకున్నోళ్ళం, దారి చూపుతున్నోళ్ళం.
మా నొసళ్ళకు చెమట బొట్లు
మా నెత్తుల చుట్టూ ఉత్పత్తి టోపీలు
మేం హిందు కే వీర్‌,
ధన్గర్‌ కే బీర్‌,
ముసల్మాన్‌ కే పీర్‌ అనుకుంటా
ఒంటి నిండా గంధాలు పూసుకున్నం,
మనసు నిండా మల్లెపువ్వులు పరుసుకున్నం.
మాది సూఫీ పరిమళం
కందూర్ల సాక్షిగా
అందరూ ఒక్కటేనని ఒగ్గు డోలు కొట్టినోళ్ళం.
మళ్ళా… వాళ్ళెవరని నన్నడుగుతావేమో
ఈ సారి శివుని నెత్తిన నెలవంకను చూపిస్తా!
ఈ నేల మూలవాసులని చాటింపు వేస్తా!!


– బండారి రాజ్‌ కుమార్‌, 8919556560

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -