Monday, July 20, 2026
E-PAPER
Homeకవితవిజయానికి వెనుక చెమట చుక్కలు

విజయానికి వెనుక చెమట చుక్కలు

- Advertisement -

పేరు–ప్రఖ్యాతలు ఒట్టిగానే రావు,
ప్రతి విజయానికి వెనుక
కోట్ల చెమట చుక్కల కథ ఉంటుంది.

ఒక్కటికి రెండు సార్లు కాదు,
అవసరమైతే వందసార్లు ప్రయత్నించాలి.
పడిపోతే లేవాలి, లేస్తే మళ్లీ నడవాలి,
నడిస్తే గమ్యం చేరే వరకు ఆగకూడదు.

ఓర్పు ఉండాలి…
సహనం ఉండాలి…
కాలం పరీక్షించినా కదలని గుండె ఉండాలి.
ఎదురుగాలులు ఎంత బలంగా వీచినా
వేర్లు బలంగా ఉంటే వృక్షం నేలకొరగదు.

వెంటబడి వేటాడాలి కలలను,
విజయం మన వెంట వచ్చే వరకు కాదు,
మనమే విజయాన్ని వెంబడించే వరకు
ప్రయాణం ఆగకూడదు.

గెలుపు కోసం పోరాడాలి,
కష్టంతో చేతులు గట్టిపడాలి,
పరాజయాలతో మనసు రాటుదేలాలి.
అవమానాలను అడుగులుగా మార్చుకొని,
అనుభవాలను ఆయుధాలుగా చేసుకొని
ముందుకు సాగాలి.

ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ పోవాలి.
పైకి కనిపించే ప్రతి శిఖరం వెనుక
కనిపించని వేల మెట్లు ఉంటాయి.

ముండ్ల దారే అయినా దాన్నే పూల దారిగా మార్చే శక్తి
మన సంకల్పంలో ఉండాలి.
రాళ్లు ఎదురైతే వాటితోనే విజయానికి మెట్లు కట్టాలి.

జీవితం ఎవరికీ సిద్ధంగా దొరకదు.
దాన్ని మన చేతులతోనే మలచుకోవాలి.
శ్రమను ప్రేమించినవారిని
కాలం కూడా గౌరవిస్తుంది.

చెమట చుక్కలు ఎప్పుడూ వృథా కావు,
ఈ రోజు కారిన చెమటే
రేపటి గౌరవానికి పునాది అవుతుంది.
శ్రమించిన చేతులు
ఎప్పుడూ ఖాళీగా తిరిగి రావు.

ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా,
ఎన్ని అవహేళనలు వినిపించినా,
తలవంచకు…
తలెత్తి నిలబడే ధైర్యమే
మనిషి అసలు ఆభరణం.

గెలుపు అనేది అదృష్టం కాదు,
అది ప్రతిరోజూ చేసిన కృషికి
కాలం ఇచ్చే ప్రతిఫలం.

ఒకరోజు నీవు విజయంతో నిలబడితే
నిన్ను చూసి నవ్వినవాళ్లే
చప్పట్లు కొడతారు.
నిన్ను చిన్నచూపు చూసినవాళ్లే
నీతో ఒక ఫోటో కోసం ఎదురుచూస్తారు.

అప్పుడు ప్రపంచం చూపు నీ వైపే ఉంటుంది.
కానీ గుర్తుంచుకో…

గెలుపు గొప్పది కాదు,
గెలిచే వరకు వదలకుండా చేసిన ప్రయాణమే జీవితం

డప్పు భాస్కర్ ఉస్తాద్ 8096938894

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -