Sunday, July 26, 2026
E-PAPER
Homeకవితకేటాయింపు

కేటాయింపు

- Advertisement -

ఆమె సమయాలంటూ ఆమె పనులంటూ
హోదా లంటూ ఫలితాలంటూ ఏమీలేవు
అంత గా చెప్పుకోవడానికి.
ఆమె పుట్టక ముందే
వంట గది, ఆ గది మూల మూలన
ఆ గదిలోని వస్తువులపై ఆమె కోసమే
కేటాయించ బడతాయి
గది శుభ్రత తాలింపుల ఘుమ ఘుమలు
రుతువుల బహుమతులు ప్రశంసలు
అన్నీ ఆమె శ్రమకు చిరు గుర్తింపులే
ఆమె పుట్టక ముందే పడక గది
ఆ గదిలో ఆమె ఎటువైపు అతనెటువైపు
ఆమె మాటలు, తల్లి తనాలు
అత్యవసర విశేషణా కిరీటాలు
కడుపులో ఉన్నపుడే కేటాయించ బడ్డాయి
ఉదయం లేవగానే ఇంటికి ప్రభాతాన్ని అద్దడం
వాకిలికి చిలుకల ముగ్గులు పేర్చడం
పిల్లలలతో పాటు లేగలకు కోళ్లకు
దానగుల్లలు అందివ్వడం
దినమంతా పంట పొలాల్లో మట్టి పొత్తిల్లు పరచి
పైరు కూనలకు పాలుపట్టడం
అన్నీ ఆమెకే ఆమెకోసమే కేటాయించినట్లుగానే…
ఆమెతో మాట్లాడే వాళ్ళు, ఆమె మాట్లాడే వాళ్ళు
ఆమె కోసమే నిషేధ స్థలాలు,
నిషేధ మనుషులు….
జాగమారుతుంది వయసు మారుతుంది
బయట డాబు మారుతుంది
కానీ Ai కాలంలోనూ
చేతులు, కాళ్ళు, చూపులు పనులు
చివకి తన శరీరమూ ఎంత గింజకున్నా
అలవాటైన రాత్రులు, దినాలు
కేటాయింపులు అలవాటైన జీవితం
కేటాయింపులకే కేరాఫ్‌ ఆమె
కొంచెం గొంతు పెకిలి కొత్తగా మాట్లాడినా
కొంచెం చేతులు పైకి లేచినా
కొంచెం నిటారుగా కనబడినా
కేటాయించిన ఆంక్షలు శిక్షలు
సిద్ధంగా ఎదురు చూస్తుంటాయి.

డా. ఉదారి నారాయణ,
9441513666

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -