అయ్య మీదికి అవ్వ నోట్లె నుంచి జెప్పున
ఉర్కచ్చే ఊతపదం,
నీ.. మొద్దుమొఖంల కట్టె.
ఇట్ల ప్రేమ వర్షం కురిపిత్తే,
తడిసి ముద్దయితడు.
ఆసామిని అడగంది కంకిరువడు.
సూసిన పండ్లకు తువ్వాల పరువబొడు.
ఒడ్డుకు ఒరిగున్న కందికాయలనన్న
దుస్స,పానం దరియ్యదు.
సెమట సిందంది తింటె ఒంటికి సేదైతదని.
ఏసుడు ఏసుడేగాని వద్దంటే వద్దంటడు
మా ఓట్లకు లీడర్లు నోట్లు పంచత్తే.
నీతి నిజాయితీ అనే జీవితకాల
మాలేసుకున్నందుకు.
నియ్యతి సూసి నింగినేల నివ్వెరపోయింది.
కూరమందం నాలుగుంచుకొని,
పలారం బంచినట్టు పంచుతడు.
వరదకు పట్టిన బుడ్డపర్కలు.
బోలాకోరోడు తప్ప బొంకుడు రానోడు.
ఎవ్వల మీద కుట్ర బాజితనం కుమ్మరించడు
కంట్రోలు బియ్యం కారంముద్దలు
తిన్న తనువు కాబట్టి.
కట్నాల బుక్కుల మాత్రం పేరెక్కుతడు
పిల్సిన పభోజనాలల్ల తిన్నా,తినకున్న.
పొక్కలుపడ్డ బనీనును,ఏసుకున్న
అంగి దాసిపెట్టినట్టు,
కష్టాల కంటితీగలు
ఎన్నోకుట్టిన ఏర్పడనియ్యలే.
ఎవ్వలన్న కట్టంశెప్పి కన్నీళ్లుతీత్తే,తువ్వాలైతడు,
ధైర్నం గోలేసి పంపిత్తడు.
అయ్య జీవిపొతే నిర్జీవయ్యింది ఊరు.
గజానికొక్కల భుజాలు మోసినై పాడేను.
ఏడుసుకుంట ఎడమ చేత కట్టెపుల్లేత్తంటే,
వలపోతతో వల్లిచ్చుకుంట
నీ మొద్దు మొఖంమీద కట్టేస్తాండ్లని
పెద్దబిడ్డ అవ్వను అంటంటే
గోసరిల్లి గొల్లుమన్నదీ పేర్సిన కాడు.
– పడిదం రాజేందర్, 9618955589



