‘ఆల్ ఇండియా రేడియో’ అనగానే ఒక తరానికి క్రికెట్ కామెంట్రీ వినడం గుర్తుకు రావచ్చు. మరికొందరికి తుఫాన్ సమయంలో అల్లాడిపోతూ రేడియో గర గరల మధ్య వచ్చే సమాచారం కోసం వేచి ఉండడం స్ఫురించవచ్చు. ఇంకొందరికి ఎన్నికల ఫలితాల వేళ రెండు, మూడు రాత్రులు, పగళ్ళు బోలెడు సినిమా పాటలు మధ్య ప్రత్యేక ఎన్నికల ప్రసారాలు విన్న విషయం మదిలో మెదలవచ్చు. పదవ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల కోడ్ ప్రకటించడం, పబ్లిక్ పార్కులో ఎంప్లాయిమెంట్ న్యూస్ విని, ఉద్యోగానికి అప్లై చేసి జీవితంలో స్థిరపడడం గుర్తుకు రావచ్చు. భద్రాచలం లేదా తిరుపతి ఉత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం, భక్తి రంజని, ప్రాంతీయ వార్తలు, మధ్యాహ్నం రెండు గంటల ఇంగ్లీష్ వార్తలు, రాత్రి ప్రసారమయ్యే స్పాట్లైట్, జనరంజని, సంగీత్ సరిత, జయమాల, ఛాయాగీత్, కార్మికుల కార్యక్రమం, ఆదివారం మధ్యాహ్నం గంట నాటకం, మంగళవారం హరికథ, శనివారం నేషనల్ కాన్సర్ట్.. ఇలా ఎవరి ఆసక్తి, ఇంపాక్ట్, వయసు బట్టి వారిపై ‘ఆల్ ఇండియా రేడియో’ చెరగని ముద్ర వేసింది. ఇంకా చెప్పాలంటే నిజాం ప్రభువు భారత ప్రభుత్వానికి లొంగిపోయినట్టు ప్రకటించుకున్నది రేడియో ద్వారానే. అలాగే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు తానే నేరుగా ప్రకటన చేసింది ఆలిండియా రేడియో ద్వారానే!
మన దేశంలో వైర్లెస్ రేడియో ప్రసార వ్యవస్థకు ‘ఆల్ ఇండియా రేడియో’ అని 1936 జూన్ 8న నామకరణం చేసి నేటికీ తొంబయ్యేళ్లు అవుతోంది. ఒక యంత్రంలో మనిషి మాటలు వినపడటమనేది అప్పటికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అమెరికాలో ఇంగ్లాండులో భారతదేశంలో రేడియో ప్రసారాలు దాదాపు ఏకకాలంలోనే మొదలయ్యాయని చెప్పుకోవాలి. పత్రికలు, సినిమాలు, టెలివిజన్ తొలుత మొదలైనట్టుగానే మద్రాసు నుంచే తెలుగు ఆల్ ఇండియా రేడియో కూడా 1938 జూన్ 16న శ్రీకారం చుట్టుకుంది. ఈ ఇంగ్లీష్ మాటలోని మూడు పదాల తొలి అక్షరాలను స్వీకరిస్తే అది AIR అవుతుంది. రేడియో తరంగాలు గాలిలోనే ప్రయాణిస్తాయి కనుక ఇది కూడా ఔచిత్యం, అర్థవంతం. మనదేశంలో రేడియో ప్రసారాల మోటో ‘బహుజనహితాయ బహుజన సుఖాయ’ అన్న దానిని ఎప్పుడు స్వీకరించారో సరిగా నమోదు కాలేదు, కానీ దాదాపు అదే రోజుల్లోనే జరిగి ఉంటుందని ఎక్కువమంది భావిస్తున్నారు. ట్రాన్సిస్టర్, మొబైల్ యాప్ వచ్చిన తర్వాత రేడియో పర్సనల్ మీడియం అయింది. కానీ తొలుత రేడియో పరిమాణం, ఖరీదు బాగా ఎక్కువ ఉన్నప్పుడు అది కమ్యూనిటీ మీడియం మాత్రమే. కనుక ‘ఎక్కువమందికి ఉపయుక్తమయ్యేది, సౌఖ్యాన్ని కలిగించేది’ అనే ఉద్దేశం మంచిదే. ‘ఆకాశవాణి’ అనే మాటను 1956లో ఆల్ ఇండియా రేడియోకు ప్రత్యామ్నాయ నామకరణంగా స్వీకరించారు.
రేడియో తొలి అడుగులు
రేడియో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. అమెరికా, ఇంగ్లాండ్, భారతదేశంలో రేడియో ప్రసారాలు దాదాపు ఏకకాలంలో మొదలయ్యాయి. తొలుత టెలిఫోన్, టెలిగ్రాఫ్ వ్యవస్థలు ఉన్నాయని ఇంగ్లాండు ప్రభుత్వం ఈ వైర్లెస్ రేడియో సదుపాయం గురించి కొంత నిర్లక్ష్యం వహించింది. భ్రమలు కల్పించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ఇటలీలో రేడియో దోహదపడటం, సోవియట్ యూనియన్ లో విప్లవ సందేశాలు వ్యాప్తి కావడానికి రేడియో వినియోగపడటం చరిత్ర. 1926 మే మాసంలో బ్రిటన్ లో తొమ్మిది రోజులు సమ్మె జరిగినప్పుడు ఇంగ్లీష్ పాలకులకు రేడియో ప్రసారాల ప్రాముఖ్యత అనుభవమయ్యింది. తర్వాతనే ఇంగ్లాండు తన సొంత దేశంలోనూ, వలస దేశాల్లోనూ తమ ప్రయోజనం కోసం రేడియోను వినియోగించుకోవాలని దష్టి పెట్టింది.
1921 ఆగస్టులో తంతి తపాలా శాఖతో కలిసి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వార్తాపత్రిక బొంబాయి నుంచి మొదటి రేడియో కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. 1923 నవంబర్ లో రేడియో క్లబ్ ఆఫ్ బెంగాల్ కార్యక్రమాలు ప్రసారం చేసినట్టు తెలుస్తోంది. ఇక మద్రాసు ప్రెసిడెన్సీలో 1924 మే 16న రేడియో క్లబ్ ఏర్పడి, జూలై 31 నుంచి ప్రతిరోజూ కొన్ని కార్యక్రమాలు ప్రసారం చేసింది. అయితే వీటికి సంబంధించిన వివరాలు పెద్దగా అందుబాటులో లేవు. వీటిని చెదురు ముదురుగా జరిగిన ప్రయత్నాలుగానే భావించాలి. 1925 మార్చి 27న బ్రిటిష్ ప్రభుత్వం రేడియో కేంద్రాల నిర్వహణ కొరకు దరఖాస్తులు ఆహ్వానించింది. 1926 సెప్టెంబర్ 13న ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో 1927 జులై 23కు కొంత ఆర్గనైజ్డ్ గా రేడియో ప్రసార వ్యవస్థ ఏర్పడింది. ఆరోజున బొంబాయిలో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ రేడియో కేంద్రాన్ని ప్రారంభించింది. కనుకనే జూలై 23న మనం ‘ది ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ డే’ లేదా ‘నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ డే’ అని పిలుచుకుంటున్నాం. ఆ కంపెనీ అదే ఏడాది మద్రాసులో ఆగస్టు 26న కలకత్తాలో, అక్టోబర్‌లో రేడియో కేంద్రాలను ప్రారంభించింది. 1927 డిసెంబర్ 31న రేడియో రిసీవర్ కలిగి ఉండడానికి లైసెన్సు తప్పక ఉండాలనే విధానం అమలులోకి వచ్చింది. రేడియో ప్రసారాల కోసం ‘ది ఇండియన్ రేడియో టైమ్స్’ అనే పత్రికను కూడా ప్రారంభించిన ఈ కంపెనీ 1930 మార్చి 1న విడిపోవడం వెనుక విషయాలు తెలియవు. అదే ఏడాది ఏప్రిల్ 1 న రేడియో ప్రసారాలు ప్రత్యక్షంగా బ్రిటిష్ ప్రభుత్వ అజమాయిషీలోకి రావడం, ‘ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్’ ఏర్పడటం జరిగింది. ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫీ యాక్ట్ -1933 ఏర్పడి, 1934 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ పేరు ‘ఆల్ ఇండియా రేడియో’గా మార్చడం 1936 జూన్ 8న సంభవించింది.
బ్రిటిష్ వారి రేడియో, సంస్థానాలలో రేడియో…
స్వాతంత్య్రానికి పూర్వం మనదేశంలో మూడు రకాల రేడియో కేంద్రాలు కనపడతాయి. విదేశీ వలసపాలకులకు వ్యతిరేకంగా ఆజాద్ హింద్ రేడియో, ఆజాద్ రేడియో, భాగ్యనగర్ రేడియో, ది వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ వంటి రేడియో కేంద్రాలు కొంత కాలం నడిచిన గొప్ప చరిత్రను సష్టించి స్ఫూర్తిని కలిగించాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత దేశ స్వాతంత్య్రం ప్రధాన ఉద్దేశంగా బయట నుంచి ఆజాద్ హింద్ రేడియో నడపగా, క్విట్ ఇండియా సమయంలో పెద్ద నాయకులందరూ జైళ్ళ పాలయినప్పుడు రామ్ మనోహర్ లోహియా కొంతమంది యువకులతో ఆజాద్ రేడియో నిర్వహించారు. దీని గురించి చాలాకాలం సమాచారం లేదు. పోలీసుల రహస్య పత్రాల ఆధారంగా ఈ ఛానల్ ఆచూకీ లభించింది. ఒక మనిషి మోయగలిగే సైజు పెట్టెలో ట్రాన్స్ మీటర్‌ను తీసుకుని బ్రిటిష్ పోలీసుల కళ్ళు కప్పడానికి వేరు వేరు ప్రాంతాలకు వెళ్తూ, వేర్వేరు ఫ్రీక్వెన్సీలతో కొన్ని రోజులపాటు నడిచిన ‘ఆజాద్ రేడియో’ గొప్ప సంచలనం సష్టించింది. దీన్ని ‘ఇల్లీగల్ రేడియో’ అని కూడా అప్పటి ప్రభుత్వం పిలిచేది.
1933లో ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా మొదలైన రేడియో ట్రాన్స్ మీటర్‌ను 1935 ఫిబ్రవరి 3న హైదరాబాద్ నైజాం స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి నిజాం రేడియోలో ఉర్దూ ప్రధానంగా ఇంకా మరాఠీ, కన్నడ, తెలుగు భాషల్లో ప్రసారాలు నడిచేవి. నిజాంకి ఔరంగాబాద్‌లో మరొక రేడియో కేంద్రం ఉండేది. స్థూలంగా ఈ రేడియో కేంద్రాలు నిజాం ప్రభువు సమాచార అవసరాలు తీర్చుతూ అలాగే బ్రిటిష్ వారికి అనుకూలంగా సమాచారాన్ని ఇచ్చేవి. మైసూరు, తిరువాన్కూరు, బరోడా సంస్థానాలలో కూడా రేడియో కేంద్రాలు ఇదే రీతిలో నడిచేవి.
నైజాం ప్రభువుకు వ్యతిరేకంగా ‘భాగ్యనగర్ రేడియో’ కర్నూల్ నుంచి కొంతకాలం ప్రసారాలు చేసేది. తక్కువ కాలమే నడిచినా ఈ రేడియో గొప్ప చరిత్రనే సష్టించింది. 1948 జనవరి 30న గాంధీజీ హత్య వార్తను ప్రసారం చేసి భాగ్యనగర్ రేడియో మూతబడింది. వెల్దుర్తి మాణిక్యరావు రాసిన ‘హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్రోద్యమం’ పుస్తకంలో భాగ్యనగర్ రేడియో గురించి ప్రస్తావన ఉంది. ఈ భాగ్యనగర్ రేడియో వెనక గొప్పగా భాసించే కీర్తి బావుటా పాగా పుల్లారెడ్డి. గడియారం రామకష్ణ శర్మ రాసిన స్వీయ చరిత్ర ‘శతపత్రము’లో ఈ రేడియో ప్రసారాలకు సంబంధించి కొంత చరిత్ర, సమాచారం లభిస్తున్నది. ఈ రేడియో కేంద్రంలో ఉర్దూ ప్రసారాలు కూడా ఉండేవి, వాటిని వకీలు నాగప్ప పర్యవేక్షించేవారు.
స్వాతంత్య్ర భారతంలో ఆల్ ఇండియా రేడియో
1947 ఆగస్టు 15 కు మనదేశంలో ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో.. ఈ ఆరు పట్టణాల్లో మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన రేడియో కేంద్రాలున్నాయి. మరో మూడు పెషావర్, లాహోర్, ఢాకా పాకిస్తాన్ ప్రాంతానికి వెళ్లాయి. హైదరాబాద్, ఔరంగాబాద్, తిరువంకూర్, మైసూర్, బరోడా రేడియో కేంద్రాలు ఆయా సంస్థానాలు భారతదేశంలో విలీనమైనప్పుడు ఆల్ ఇండియా రేడియోతో కలిసిపోయాయి. అలాగే పోర్చుగీసు వారి అధీనంలో ఉన్న గోవా ప్రాంతంలోని పణజీ కేంద్రం కూడా తర్వాతి కాలంలో ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1951 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత 18.3 శాతం కాగా గ్రామీణ ప్రాంతంలో 12.1, పట్టణ ప్రాంతంలో 34.6 శాతంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో నిరక్షరాస్యులు సైతం అందుకోవడానికి వీలైన రేడియో మాధ్యమం చేసిన విద్య, సమాచార, వినోద సంబంధిత సేవలు చాలా విశేషమైనవి. పనికి ఆటంకం లేకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం వేళల్లో కొంత సమయం మాత్రమే రేడియో కార్యక్రమాలు నడిచేవి. అందులో వార్తలు వంటి సమాచారం ఒకవైపు, జానపద, శాస్త్రీయ, లలిత, సినిమా సంగీతం ఇంకోవైపు. ఈ రెండూ కాకుండా సామాజిక విద్యను సాధ్యం చేసే రీతిలో వ్యవసాయ, ఆరోగ్య, విజ్ఞాన, సాహిత్య సంబంధమైన అవగాహన కలిగించే కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు శ్రోతల వయసును దష్టిలో పెట్టుకుని పిల్లలు, మహిళలు, యువజనులను ఉద్దేశించి సాగే కార్యక్రమాలు నడిచేవి. తొలి సమాచార ప్రసార శాఖ మాత్యులు సర్దార్ వల్లభారు పటేల్ హయాంలో ఆకాశవాణి చాలా పెద్ద ఎత్తున విస్తరింపబడింది. 1948 డిసెంబర్ 1న విజయవాడ ఆకాశవాణి ప్రారంభం కాగా, 1950 ఏప్రిల్ 1న హైదరాబాదులోని నైజాం రేడియో భారతదేశం అజమాయిషీలోకి మారి ఆల్ ఇండియా రేడియో అయ్యింది.
1957 అక్టోబర్ 3న సినిమా సంగీతంతో ప్రధానంగా నడిచే ‘వివిధభారతి’ కేంద్రాలు దేశవ్యాప్తంగా రావడం మొదలయ్యాయి. 1976 ఏప్రిల్ ఒకటి దాకా టెలివిజన్ కూడా రేడియోతో పాటు ఒకే నిర్వహణలో ఉండేవి. 60వ దశకం తొలి ఏడాదిలో కడప, విశాఖపట్నం కేంద్రాలు మొదలయ్యాయి. తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యల కారణంగా ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం, నిజామాబాద్, అనంతపురం, కర్నూలు, తిరుపతి, మార్కాపురం జిల్లా స్థాయి అవసరాల కోసం ప్రారంభించబడ్డాయి. స్థూలంగా ఇవన్నీ ఎఫ్.ఎం. బ్యాండ్ మీద ప్రసారయ్యే రేడియో కేంద్రాలే. తొలుత మీడియం వేవ్ ప్రసారాలు మాత్రమే ఉన్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీల కేటాయింపు వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల మీద ఆధారపడి ఉండేది. కనుక ఎక్కువ సంఖ్యలో రేడియో కేంద్రాలు ప్రారంభం కావడానికి సాధ్యం కాలేదు. మొదటి రోజుల్లో రేడియో వినాలంటే రిబ్బన్ లాంటి ఏరియల్ ఇంటి బయట కట్టుకునే పరిస్థితి ఉండేది. అది రేడియో సిగల్‌ను ఆకర్షించి రేడియో సెట్టుకు పంపితే ప్రసారాలు మెరుగ్గా అయ్యేవి. అయినప్పటికీ ఆనాడు కార్యక్రమాలు గర గరల కారణంగా అంత హాయిగా ఉండేవి కావు. మన దేశంలో సాటిలైట్ టెక్నాలజీ కూడా రేడియో ప్రసారాలకు అనుసంధానించడంతో అవి చాలా మెరుగయ్యాయి. దూరప్రాంతాలకు షార్ట్ వేవ్ రేడియో ప్రసారాలు ఉండేవి. ఈ షార్ట్ వేవ్ లోనే శ్రీలంక రేడియో ప్రసారం చేసే తెలుగు కార్యక్రమాలు కొన్ని దశాబ్దాల కిందట చాలా బాగా ప్రాచుర్యంలో ఉండేవి. మూడున్నర దశాబ్దం కిందట ఎఫ్.ఎం. రేడియో ప్రసారాలు మొదలైనప్పుడు ఎఫ్.ఎం.సెట్లు అందుబాటులో ఉండేవి కావు. కనుక స్థానికంగా ఉన్న మీడియం వేవ్ రేడియో సెట్లను కొద్దిగా మార్చుకుని సర్దుబాటు చేసుకునేవారు. ఇటీవల దశాబ్దాలలో ఎఫ్.ఎం. రెయిన్‌బో, ఎఫ్.ఎం. గోల్డ్ వంటి సర్వీసులను ఆల్ ఇండియా రేడియో ప్రారంభించడంతో ఎంతో మంది యువత మళ్లీ ఆకాశవాణి వైపు తరలివచ్చారు.
ప్రక్రియా వైవిధ్యం, ప్రతిభా నైపుణ్యం కలగలిసిన ఆకాశవాణి
లోక్ సభలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెబుతూ 482 రేడియో కేంద్రాలు ఉన్నాయని సుమారు 100 దేశాల్లోని శ్రోతలు ఆల్ ఇండియా రేడియో వింటున్నారని చెప్పడం విశేషం. ఆకాశవాణి కార్యక్రమాలు నిత్యం 23 భాషల్లో 146 మాండలికాల్లో ప్రసారమవుతూ ఉంటాయి. మనదేశంలో 92 శాతం భూభాగాన్ని ఆకాశవాణి ప్రసారాలు చేరుతున్నాయని;, అలాగే 97-99% దేశ జనాభా ఆకాశవాణిని వినగలరని వివరాలు చెబుతున్నాయి. ప్రసంగం, పాట, సంభాషణ, చర్చ, వార్తలు, నాటకం, హరికథ, శాస్త్రీయ సంగీతం, వాయిద్య సంగీతం, లలిత సంగీతం, పరిచయం, పుస్తకసమీక్ష, టుడే ఇన్ పార్లమెంట్, అసెంబ్లీ కార్యకలాపాలపై సమీక్ష, సినిమా పాటలు… ఇలా సాగుతుంది వైవిధ్యం. పిల్లలు, మహిళలు, వయోజనులు, వ్యవసాయదారులు, కార్మికులు, విద్యార్థులు ఇలా వివిధ వర్గాలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాలు రూపొందించడం ఆకాశవాణికి బాగా తెలుసు.
తొలినుంచి ఆకాశవాణి ప్రాంతీయమైన వైవిధ్యాన్ని గౌరవిస్తూ ఆయా ప్రాంతాలను దష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను రూపొందిస్తూ వస్తోంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర మొత్తం హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం పరిధిలో ఉంటే.. మిగతా కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటి కేంద్రాలు ఆయా ప్రాంతాల అవసరాల మీద మరింత దృష్టి పెట్టి ప్రసారాలు చేస్తాయి. గిరిజనులకు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకప్పుడు వయోజనులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నడిచేవి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ సంస్థ చాలా కాలం నేర్పించిన ఇంగ్లీష్ పాఠాలు ఎంతోమందికి దోహదపడ్డాయి. అలాగే సంస్కత పరిచయ కార్యక్రమం చాలా మందికి గుర్తుండే వుంటుంది. ఇందిరా గాంధీ చొరవ కారణంగా 1969లో యువజనుల కోసం ఢిల్లీ, హైదరాబాదులోనూ ప్రత్యేక రేడియో ఛానళ్లు మొదలయ్యాయి.
ఎందరో మహామహులు
కాశవాణిలో ఉద్యోగులుగా పనిచేసిన ప్రముఖుల జాబితా చూస్తే చాలా విస్మయం కలుగుతుంది. సంగీత విద్వాంసులు పండిట్ రవిశంకర్, హిందీ నటుడు దేవానంద్, వెస్ట్రన్ మ్యూజిక్ గాయకుడు రెమో ఫెర్నాండిస్, ప్రఖ్యాత జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్… ఇలా చాలామంది ఆకాశవాణిలో పనిచేశారు. ఇక తెలుగు ప్రసారాల విషయానికి వస్తే ఆచంట జానకిరామ్, దేవులపల్లి కష్ణశాస్త్రి, అయ్యగారి వీరభద్రరావు, పింగళి లక్ష్మీకాంతం, గుర్రం జాషువా, దాశరధి కృష్ణమాచార్య, జీవి కృష్ణారావు, కురుగంటి సీతారామయ్య, బుచ్చిబాబు, గోపీచంద్, స్థానం నరసింహారావు, కందుకూరి రామభద్రరావు, శ్రీశ్రీ, కొంగర జగ్గయ్య, రావూరి భరద్వాజ, గొల్లపూడి మారుతీరావు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, డి. వెంకట్రామయ్య, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం, బాలాంత్రపు రజనీకాంతరావు, ఓలేటి వెంకటేశ్వర్లు… వంటి దిగ్గజ పండితులు, కళాకారులు ఆకాశవాణి సిబ్బందిగా పూర్తి కాలమో లేదా కొంతకాలమో సేవలు అందించారు. ఇక ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రముఖుల పేర్లు చెప్పాలంటే సాధ్యమయ్యే వ్యవహారం కాదు. ఆకాశవాణిలో తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసిన అనౌన్సర్లు, జాకీలు తర్వాతి కాలంలో ఇతర రేడియో, టీవీ ఛానల్స్ లో ప్రఖ్యాతి పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి.
దిశా నిర్దేశం చేసిన ఆకాశవాణి
ఈ దేశంలో అందరికీ గడియారాలు కూడా లేని కాలంలో గడియారంగా మారి దిశా నిర్దేశం చేసింది ఆకాశవాణి. అంతేకాదు దూరవిద్యారూపంలో భాషను, సంస్కారాన్ని మాత్రమే కాక అవసరమైనప్పుడు కుటుంబ నియంత్రణా సందేశాన్ని, హరిత విప్లవ రహస్యాన్ని అమ్మ మాటలా, స్నేహితుడి లాలింపులా నేర్పించింది. ఇప్పటి ఎలక్ట్రానిక్ మాధ్యమ విప్లవానికి మూలపుటమ్మ వంటిది ఆల్ ఇండియా రేడియో. ఆకాశవాణి సాంకేతిక విజ్ఞానాన్ని చేజిక్కించుకొని ఎప్పటికప్పుడు కొత్త రూపు ధరిస్తూ నిత్యం శ్రోతల మనసుల్లో వెలుగుతూనే ఉంది.
కొసమెరుపు: తెలుగు సినిమారంగంలో ఉజ్వలంగా ప్రకాశించిన హీరోలు నందమూరి తారకరామారావును, అక్కినేని నాగేశ్వరరావును ఎన్నో పత్రికలు, ఎన్నోసార్లు ఇంటర్వ్యూలు చేశాయి. కానీ ఏ ఒక్కసారి, ఈ ఇద్దరినీ కలిపి ఏ పత్రికా ఇంటర్వ్యూ చేయలేకపోయింది. కానీ దానిని ఆకాశవాణి తన మద్రాసు కేంద్రం ద్వారా సాధించగలిగింది, దానికి కారణం ఆకాశవాణికి ఉన్న గౌరవం, విశ్వసనీయత.
– డా. నాగసూరి వేణుగోపాల్, 9440732392



