సోషల్ మీడియాలో ఒక రిలేషన్‌షిప్ రూల్ వైరల్ అవుతుంది. ఈ రూల్ పాటిస్తే భాగస్వాముల మధ్య ప్రేమ పటిష్టం అవుతుందట. దెబ్బతిన్న బంధాలను తిరిగి చిగురింపజేయడానికి, ఉన్న ప్రేమను రెట్టింపు చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. అదే ‘777 రిలేషన్‌షిప్ రూల్’. ఈ రూల్ అనేది వ్యక్తిగత సంబంధాలను బలంగా, తాజాగా ఉంచుకోవడానికి లైఫ్ కోచ్‌లు, రిలేషన్‌షిప్ నిపుణులు సిఫార్సు చేసే ఒక అద్భుతమైన ఫార్ములా. బిజీ లైఫ్ స్టైల్ వల్ల భాగస్వాముల మధ్య దూరం పెరగకుండా ఉండేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఒక బంధాన్ని ఏర్పరచుకోవడం సులభం, కానీ దానిని నిలబెట్టుకోవడం అంతకంతకూ కష్టమవుతోంది. ఎలాంటి బంధమైనా, ఇద్దరు భాగస్వాములు పూర్తిగా అంకితభావంతో ఉన్నప్పుడే అది నిలబడుతుంది.
బంధంలో సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. బంధంలోని ప్రేమని నిలబెట్టుకోవడానికి చాలా కషి అవసరం. ఒకరి సంతోషాన్ని మరొకరు చూసుకోవాలి. అయితే ఒత్తిడితో కూడిన లైఫ్‌స్టైల్ వల్ల సంబంధాల్ని నిలుబెట్టుకోవడం ఒక సవాలుగా మారింది. ప్రేమించడం సులభమే కానీ, ఆ ప్రేమను కాలంతో పాటు కాపాడుకోవడం చాలా కష్టం. బ్రిటీష్ నటి అమీ నుట్టాల్ తన భర్తతో ఉన్న విభేదాలను తొలగించుకుని, విడిపోయే స్థితి నుండి తన వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి 777 ఫార్ములానే వాడిందట. అప్పటి నుండి ఇంటర్నెట్‌లో దీనికి విపరీతమైన క్రేజ్ పెరిగింది.
అర్థవంతమైన సమయం
సైకాలజీ డిగ్రీలు లేదా లోతైన పరిశోధనలు అవసరం లేకుండా, కేవలం ఒక క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్ ద్వారా మీ భాగస్వామితో మళ్లీ మొదటి రోజుల్లాంటి ప్రేమను పొందవచ్చు. ఆ ‘777 రూల్’ లెక్కలేంటో చూద్దాం. 7-7-7 నియమం అనేది జంటలు కలిసి అర్థవంతమైన సమయాన్ని గడపడానికి సహాయపడే ఒక లైఫ్ స్టైల్. ఇది ప్రతి 7 రోజులకు ఒక డేట్‌ను, ప్రతి 7 వారాలకు ఒక రాత్రి బసతో కూడిన యాత్రను, ప్రతి 7 నెలలకు ఒక విహారయాత్రను ప్లాన్ చేసుకోమని ప్రోత్సహిస్తుంది. ఈ విధానం రొటీన్ నుండి బయటపడటానికి, భావోద్వేగపరంగా దగ్గరగా ఉండటానికి, ఒకరికొకరు దూరమవకుండా ఉండటానికి సహాయపడుతుందని చెబుతారు.
ప్రతి ఏడు రోజులకు ఒకసారి
ఈ రూల్ ముఖ్య ఉద్దేశం భాగస్వామికి క్రమం తప్పకుండా సమయం కేటాయించడం. వారానికి ఒకసారి మొబైల్ ఫోన్లు, ఆఫీసు మెయిల్స్ పక్కన పెట్టి కేవలం ఇద్దరే కలిసి గడపాలి. ఇది కాఫీ షాప్ కావచ్చు లేదా ఇంట్లోనే వండుకున్న భోజనం కావచ్చు.
7 వారాలకు ఒక వీకెండ్ ట్రిప్
సుమారు రెండు నెలలకు ఒకసారి చిన్న విహారయాత్రకు వెళ్లాలి. లాంగ్ డ్రైవ్ లేదా పక్కనే ఉన్న ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లడం వల్ల దినచర్యలో మార్పు వస్తుంది.
7 నెలలకు ఒక పెద్ద వెకేషన్
ఏడాదికి రెండు సార్లు శృంగారభరితమైన విహారయాత్రకు లేదా విహారానికి వెళ్లాలి.హొఇది కేవలం ఒక రాత్రి గడిపే సమయంలా కాకుండా, అన్నింటి నుండి దూరంగా ప్రశాంతంగా గడపడానికి ఒక మార్గంగా ఉండాలి. కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి సుదీర్ఘ ప్రయాణం చేయాలి. జీవితంలో గందరగోళం పెరిగినప్పుడు ఒకరినొకరు పట్టించుకోవడం మర్చిపోతుంటాం. ఈ ‘777 రూల్’ ఒక అలారంలా పనిచేస్తుంది. భాగస్వామి మాటలను శ్రద్ధగా వినడం, కొత్త జ్ఞాపకాలను సష్టించుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇది ఖరీదైన ప్లాన్ కానక్కర్లేదు, బడ్జెట్‌కు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. కేవలం ఉనికి అనేది ఇక్కడ ముఖ్యం. ఇద్దరికీ నచ్చిన ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కష్టంగా మారిన నేటి తరుణంలో, ఈ బంధాలను మరింత బలోపేతం చేయడానికి ఒక చక్కని గైడ్‌లైన్‌లా పనిచేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు లేదా బిజీ ఉద్యోగాల వల్ల ప్రతి 7 నెలలకు వెకేషన్ వెళ్లడం అందరికీ కుదరకపోవచ్చు. మనస్పర్థలు లేదా పెద్ద సమస్యలు ఉన్నప్పుడు కేవలం బయటకు వెళ్తే సరిపోదు, ఒక్కోసారి థెరపీ కూడా అవసరం అవుతుంది. కచ్చితంగా ఈ రూల్ పాటించాలనే నియమం పెట్టుకుంటే, అది ఒక బాధ్యతలా మారి ఒత్తిడి కలిగించవచ్చు.
ఏదో మంత్రదండం కాదు
ఇది కేవలం బిజీ ప్రపంచంలో భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తుచేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే తప్ప మంత్రదండం కాదు. బడ్జెట్, సమయాన్ని బట్టి దీనిని నచ్చినట్లు మార్చుకుని పాటించవచ్చు. సంబంధం ఏదైనా అందులో ‘ప్రయత్నం, ప్రేమ’ ఉన్నప్పుడే అది కలకాలం నిలుస్తుంది. మారుతున్న కాలంలో మనకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తు చేసే ఒక మంచి పద్ధతి. బంధంలో ప్రేమను సజీవంగా ఉంచడానికి ఖరీదైన గిఫ్టులు అక్కర్లేదు, కాస్త సమయం కేటాయిస్తే చాలు.
అవసరమైతేనే పాటించండి
ఇలాంటి నియమాలు కేవలం ఒక ఆవశ్యకతను నెరవేరుస్తున్నామనే భావనను కలిగించి, విషయాలలోని సహజత్వాన్ని, శృంగారాన్ని దూరం చేస్తాయని కొందరు వాదించవచ్చు. ప్రియమైన వారితో ఎక్కువ సమయం ఒంటరిగా గడపడం సహజంగానే జరగాలన్నది వారి వాదన. ఇప్పటికే ప్రియమైన వారితో అలాంటి సమయాన్ని గడుపుతున్నట్లయితే 777 నియమాన్ని పూర్తిగా పక్కన పెట్టవచ్చు. కానీ చాలా మందికి జీవితంలోని ఇతర అంశాలు చాలా హడావిడిగా మారి, పరధ్యానాలు పెరిగిపోవచ్చు. దీనివల్ల అసలు విషయాన్ని విస్మరించడం, ఇద్దరూ కలిసి ఒక జంటగా పనిచేసి చాలా కాలం అయిపోయిందన్న విషయాన్ని మరచిపోవడం సులభం అవుతుంది. ఇక్కడే అంకెలు.. కొన్ని లెక్కలు, ముఖ్యమైన వాటిపైనే దష్టి ఉండేలా చూసుకోవడానికి సహాయపడతాయి.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి,
8008 577 834


