Sunday, May 31, 2026
E-PAPER
Homeకథమరో మెట్టు పైకి

మరో మెట్టు పైకి

- Advertisement -

రాత్రి పది గంటలు అయ్యింది. వీధి నిండా చిక్కటి చీకటి పరుచుకుంది. ఆ వీధిలో కన్ను పొడుచుకు వెతికినా ఏ ఇంట్లో కనీసం ఒక లైట్‌ కూడా వెలిగించి లేదు. ఇక వీధి దీపాలు అయితే సరే సరి. పేరుకైతే ఆ వీధిలో దీపాలు ఉన్నాయి గాని అవి ఎప్పుడూ వెలగవు!? అసలు ఆ వీధిలో వుంటున్న వాళ్ళే, తమ వత్తికి అడ్డు లేకుండా, వీధిలో ఎక్కడా వెలుగన్నది లేకుండా ఏర్పాటు చేసుకున్నారేమో!? శీతాకాలం అవడం వలన చలిగాలి రివ్వున వీస్తోంది. వీధి కుక్కలు భయంకరంగా మొరుగుతున్నాయి. అనంగరావు మెల్లిగా నడుచుకుంటూ ఆ వీధి వెంట నడుస్తున్నాడు.

అలా వెళుతూ ఒక ఇంటి ముందు ఆగాడు. సెల్‌ బయటకు తీసి ఒక నంబర్‌ డయల్‌ చేసాడు.
అవతలనించి కోకిలలాంటి తీయని కంఠం వినిపించింది.
”సార్‌ వచ్చారా!? ఉండండి నేను గేట్‌ దగ్గరకు వస్తాను” అంటూ ఇరవయి, ఇరవయి ఐదేళ్లు వయసు ఉన్న ఒక యువతి ఇంట్లోంచి బయటకి వచ్చింది.
”రండి సార్‌” అంటూ అనంగరావు చేయి పట్టుకుని లోపలికి నడిపించుకెళ్లింది. లోపలకి వెళ్లిన తరువాత ఆ అమ్మాయిని పరీక్షగా చూసాడు అనంగరావు. ఆమెది కళ్ళు చెదిరే అందం.
”బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు” అన్న సామెత ఆమెను చూసిన వారికి అతికినట్టు సరిపోతుంది. అందమైన గుండ్రటి ముఖం, చేపలే అక్కడ తారాడుతున్నాయా అన్నట్లు నేత్ర ద్వయం, కోటేరులాంటి ముక్కు, ముద్దులొలికే పెదాలు, శంఖం లాంటి కంఠం… కొన్ని నిముషాల పాటు అలా చూస్తూ ఉండిపోయాడు అనంగరావు. ఆ పరిస్థితుల్లో సభ్యత, అసభ్యత అన్నవి గాలికి వదిలేసాడు. అసలు అటువంటివి, అక్కడి వాతావరణంలో, ఆ నిమిషంలో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అనిపించింది అతనికి. అయితే తను చేస్తున్నది తప్పు అనిపించి వెంటనే చూపు, మనసు కూడా మరల్చుకున్నాడు.
”నా పేరు హర్షిణి. మీ పేరు….. ఇక్కడ లోపలకి వచ్చిన మనిషిని చూసేవరకూ మా వివరాలు చెప్పడం కానీ, మా ఫొటోల్లాంటివి పంపడం కానీ జరగదు. అయినా ఇక్కడకి వచ్చే వాళ్ళకి కావాల్సింది మా శరీరమే కానీ మా పేరు, ఊరు ఎందుకులెండి?” అంటూ అదోరకంగా నవ్వింది హర్షిణి.
”నా పేరు అనంగరావు. వయస్సు అరవై. ఈ వయస్సులో ఇదేమిటా అనుకోకు. ఇష్టాలకి, వయస్సుకి సంబంధం లేదు. అసలు నాకు ఇన్నాళ్లకి నీలాంటి అద్భుత సౌందర్య రాశిని చూసే అవకాశం కలిగింది. అలాగే నీతో కొంత సమయం గడిపే అవకాశం దొరికింది” అన్నాడు హర్షిణిని చూస్తూ.
”మీ చూపులు, హావ భావాలు చూసిన తరువాత మీరు ఇంకేమి చెప్పక్కర్లేదు అనిపించింది. మహా రసికులే” అంది హర్షిణి నవ్వుతూ.
”హర్షిణి నువ్వు చక్కటి బాషా ప్రయోగం చేస్తున్నావు. నువ్వు బాగా చదుకున్నట్లున్నావు!?” అన్నాడు అనంగరావు.
”మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నేను ఎం.ఏ. తెలుగు చదువుకున్నాను. ఒక సగటు ఆడపిల్లలా ఎన్నో కలలు కన్నాను. ఉద్యోగం చెయ్యాలని, మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చేసుకోవాలని… అలా ఎన్నో కలలు. కానీ తోడేలులాంటి మా మేనమామ, మా అన్నయ్య, వాడి స్నేహితులు హఠాత్తుగా నా జీవిత గమనాన్ని మార్చేశారు. జరిగింది మీకు అర్థం అయ్యింది అనుకుంటాను” అంది హర్షిణి. ఆమె కనుకొనల్లలో నీటి బిందువులు తళుక్కుమన్నాయి
”మీ అన్నయ్య కూడానా!? అయినా ఈ రోజుల్లో వావి వరసలు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు జనం. వినడానికే వెగటుగా ఉంటోంది” అన్నాడు అనంగరావు.
”మనలాంటి వాళ్ళం ఎందుకులెండి వావివరసలు లాంటి గురించి మాట్లాడుకోవడం” అంది హర్షిణి వ్యంగ్యంగా. ఆ మాటలు అనంగరావుకి తగలాల్సిన చోటే తగిలాయి.

”ఇంకొక విషయం ఏమిటంటే పాపం మగవాళ్ళకి ఉద్యోగం చూసుకోవాలి. లేకపోతే అడుక్కు తినాలి. మాకు ఇదో చక్కటి సంపాదనా మార్గం ఏర్పరిచాడు దేవుడు” అంది హర్షిణి విరక్తిగా నవ్వుతూ.
అనంగరావు హర్షిణి వైపు ఒక క్షణం చురుగ్గా చూసాడు.
”సరే మీరు కాఫీ, టీ లాంటివి ఏవైనా తాగుతారా? కూల్‌ డ్రింకా?… లేకపోతే కాస్త బలాన్నిచ్చే జ్యూస్‌ తాగుతారా?” అంది హర్షిని అదోలా నవ్వుతూ.
”నువ్వు ఇచ్చే ఏ ఫ్రూట్‌ జ్యూస్‌ అయినా పరవాలేదు” అన్నాడు అనంగరావు నవ్వుతూ.
హర్షిణి గబాగబా ఫ్రిజ్‌ డోర్‌ ఓపెన్‌ చేసి గ్రేప్‌ జ్యూస్‌ ఒక గాజు గ్లాసులో పోసి అనంగరావుకి ఇచ్చింది.
”ప్రస్తుతానికి ఇది తాగి బలం తెచ్చుకోండి” అంది హర్షిణి చిలిపిగా నవ్వుతూ.
అనంగరావు ”నీకో!?” అన్నాడు.
”బలం కావాల్సింది మీకు” అంది గలగలా నవ్వుతూ.

హర్షిణి మాటలలో శ్లేష అర్ధం చేసుకులేనంత పసివాడు, అమాయకుడు కాదు అనంగరావు.
”ఓ .కె.” అంటూ జ్యూస్‌ మెల్లిమెల్లిగా తాగడం ప్రారంభించాడు.
అతను తాగడం అయిపోగానే ”రండి బెడ్‌ రూమ్‌లోకి వెళిపోదాం. ఇంకా ఆలస్యం ఎందుకు?” అంది హర్షిణి కొంటెగా నవ్వుతూ, అనంగరావువైపు ఓరగా చూస్తూ. తరువాత అతి సుందరంగా అలంకరించిన బెడ్‌రూమ్‌లోకి దారి తీసింది హర్షిణి. అక్కడ అలంకరణ చూసి ముగ్ధుడయ్యాడు అనంగరావు.
”శోభనం గదిలా అలంకరించావే!?” అన్నాడు అనంగరావు హర్షిణి వైపు మెచ్చుకోలుగా చూస్తూ.
”మాకు రోజూ శోభనమే కదా!! ఐ మీన్‌ రోజు ఒక కొత్త వ్యక్తితో గడపడమే కదా” అంది హర్షిణి అదోలా నవ్వుతూ.
హర్షిణి బెడ్‌ మీద కూర్చుంటూ ”రండి” అంది కంటితోనే అనంగరావుని ఆహ్వానిస్తూ.
అనంగరావు బెడ్‌ పైన హర్షిణికి దగ్గరగా కూర్చున్నాడు.
”ఇక్కడికి వచ్చే ఒక్కొక్కళ్ళ కోరికలు ఒకో రకంగా ఉంటాయి. వీలైనంత వరకు వాళ్ళ కోరికలు తెలుసుకుని, తీర్చగలిగేవి తీరుస్తాం. రండి ఈ శరీరం మీదే ” అంది హర్షిణి.

”ఎందుకంత కంగారు పడిపోతున్నావు!? ఇంకా చాలా టైం ఉంది కదా!?” అని అడిగాడు అనంగరావు.
”సార్‌ మీరు గంటకే బుక్‌ చేసుకున్నారు. నెక్స్ట్‌ స్లాట్‌లో ఇంకొకరు వస్తారు. అంటే ఈ రాత్రి ఇంతవరకూ ఎవరూ లేరు. కానీ ఆ ప్రాబ్లెమ్‌ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే తొందర పడుతున్నాను” అంది హర్షిణి.
”నేను నీకు రెండు వేలు ఇచ్చాను. ఈ రాత్రంతా అయితే!?” అన్నాడు అనంగరావు.
”ఈ వయస్సులో రాత్రంతా నన్ను ఎంగేజ్‌ చేసుకుంటారా!?” అంటూ తన ఆశ్చర్యం, సందేహం వెలిబుచ్చింది హర్షిణి.
”చూడు హర్షిణీ మేం అమ్మ పాలు తాగి పెరిగిన వాళ్లం. మీలా పోతపాలు తాగిన వాళ్ళం కాదు” అన్నాడు అనంగరావు.
”నైస్‌. మీలాంటి వ్యక్తి తారసపడడం నాకు ఫస్ట్‌ టైం. రాత్రి అయితే పదివేలు” అంది హర్షిణి. హర్షిణి ఆ మాట అంటుండగానే కొత్త వంద రూపాయల కట్ట ఒకటి హర్షిణి ఒడిలో పడేసాడు అనంగరావు. అప్పుడు హర్షిణి ‘కుర్రాడేమి ప్రవరాఖ్యుడు కాదు. సార్ధక నామధేయుడే అనుకుని మనస్సులోనే నవ్వుకుంది.
”అయితే అసలు విషయం ఎప్పుడు మొదలు పెడతారు!?” అని అడిగింది హర్షిణి.
”రాత్రంతా టైం ఉంది. నేనేం చేస్తానో జస్ట్‌ వెయిట్‌ అండ్‌ సీ” అన్నాడు అనంగరావు నవ్వుతూ.
ఇక ఆ రాత్రికి వేరే మగవాళ్లకు అవకాశం, ఆ ఆవసరం లేదని తెలుసుకున్న హర్షిణి తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేసింది. తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలనుకుంది హర్షిణి.

అనంగరావు తనని పరీక్షగా చూడడం తప్ప ఏమీ చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది హర్షిణికి.
”హర్షిణీ నేను నిన్ను శారీరకంగా పొందేందుకు ఇక్కడకు రాలేదు. అంతకన్నా పెద్ద స్వార్ధంతో వచ్చాను” అన్నాడు అనంగరావు తన మాటలకి, హర్షిణి ప్రతిచర్యని కనుకొసలనుంచి పరిశీలిస్తూ.
”పెద్ద స్వార్ధమా!? అదేమిటి? కొంపముంచి నన్ను వీడియో తీసి…” అర్థాంతరంగా ఆగిపోయింది హర్షిణి. ఆమె ముఖంలో భయం కనిపించింది అనంగరావుకి.
”అంతకంటే పెద్ద స్వార్ధం” అన్నాడు అనంగరావు.
”మీ మాటలు, చేతలు నాకు పూర్తిగా అర్థం కావడంలేదు. మరి నా దగ్గరికి శారీరక సుఖానికి కాక దేనికి వచ్చారు!? ఇక్కడకు వచ్చే వాళ్ళందరూ తమకు దొరికే సుఖం సరిపోవడంలేదనో , వెరైటీ కోసమో వస్తారు. మరి మీరేమిటి ఏదో వింతగా మాట్లాడుతున్నారు! వింతగా ప్రవర్తిస్తున్నారు!?” అంది హర్షిణి ఆశ్చర్యంగా ముఖం పెట్టి.
”హర్షిణీ నాదొక వింత కోరిక .తీరుస్తావా?”
”ఏమిటది!? చెపితే అప్పుడు నేను సమాధానం చెప్పగలను” అంది హర్షిణి.
”నువ్వు నాతో వచ్చేస్తావా!?” అన్నాడు అనంగరావు.

”ఏమిటీ!? మీతో రావడమా!? ఏమిటి నన్ను ఉంపుడుకత్తెగా ఉంచుకోదలచుకున్నారా!? చూడండి నేను సెక్స్‌వర్కర్‌ అయి ఉండవచ్చు. అంతమాత్రాన నాకు ఆత్మాభిమానం, నైతికత లేవనుకోవడం మీ భ్రమ. మీరు నా ముఖాన్న పడేసే డబ్బులకు పడక సుఖం కావలిస్తే పొందండి. అంతకి మించి అర్థం లేని కోరికలు, ఆశలు పెట్టుకోకండి” అంటూ కోపంగా వందరూపాయల కట్ట అనంగరావు ముఖాన విసిరికొట్టింది. అలాగే అంతకు ముందు అతను ఆన్‌లైన్లో పంపించిన రెండువేల రూపాయలు తన దగ్గరున్న అయిదు వందల రూపాయలో రూపంలో విసిరింది.
”గుడ్‌. ఈ రియాక్షన్‌ గురించే నేను ఎదురు చూస్తున్నాను. ప్లీజ్‌ కూల్‌ డౌన్‌” అని చేతులు పట్టుకుని హర్షిణిని శాంతపరిచాడు అనంగరావు.
”హర్షిణి నిన్ను ఈ వత్తినుంచి శాశ్వతంగా విడుదల చేద్దామనే నిన్ను నాతో రమ్మన్నాను. నిన్ను విమెన్‌ హోమ్‌లో చేర్పిస్తాను. అక్కడ నీకు కావలిసిన విధంగా బతుకు. కావాలంటే ఇంకా చదువుకో. నీకు నచ్చిన, నిన్ను మెచ్చిన అబ్బాయిని పెళ్ళి చేసుకో. జీవితాన్ని హాయిగా తీర్చి దిద్దుకో. నా కూతురులాంటి నీకు కొత్త జీవితం ఇచ్చాననే సంతోషం నాకు ఇయ్యి. నేను అసలు ఇక్కడికి వచ్చిందే అందుకు. నా మాట నమ్ము” అంటూ హర్షిణి ఏ సమాధానం చెపుతుందోనని ఎదురు చూడసాగాడు అనంగరావు.

కొన్ని క్షణాలు అక్కడ మౌనం రాజ్యం చేసింది. హర్షిణి తీవ్రంగా ఆలోచించసాగింది.
”ఒక తండ్రిలా మీరు చెప్పిన దానికి మనస్పూర్తిగా ఒప్పుకుంటున్నాను. బురదలో పోర్లాడుతున్న నన్ను, మంచి నీటితో శుద్ధి చేసి, ముత్యంలా మారుస్తానన్న మీ పెద్దమనసుకి నా జోహార్లు” అంటూ అనంగరావు పాదాలకి నమస్కరించింది హర్షిణి. అనంగరావు హర్షిణిని పైకి లేవనెత్తాడు. ఆ క్షణంలో అనంగరావుకి మరొక స్త్రీని చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తున్నాననే తప్తి, ఆనందం కలిగాయి. అలాగే తను జీవితంలో, పతితల జీవితం బాగు చేయడం అనే సౌధానికి, అగ్రభాగానికి చేరుకోవాలనుకున్నకోరికలో, మరో మెట్టు పైకి ఎక్కాననే ఆనందం అనంగరావు మనస్సుని ముంచెత్తింది.

ఎం.వి.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌.
98490 13002

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -