లోపాలు లేవంటూనే దిద్దుబాట్లు
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమవుతూనేవుంది. ప్రశ్నాప్రతాల లీకేజీలు మొదలు కొని మూల్యాంకనం వరకు అన్నింటా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వివాదాలు మూటగట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కొత్తగా అమలు చేస్తున్న ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ పద్ధతిని నిన్నటి వరకు గట్టిగా సమర్థిస్తూ వచ్చిన కేంద్రం అందులో ఎటువంటి లోపాలు లేవంటూ వాదిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు లోపాలు సరిచేయడానికి అంటూ ఒక నిపుణులు కమిటీ నియమించడం విశేషం. మూల్యాంకనానికి వినియోగిస్తున్న తమ సర్వీస్ ప్రొవైడర్‌కు చెందిన ఆన్‌మార్క్ డిజిటల్ పోర్టల్‌లో భద్రతా లోపాలను సరిదిద్ది సురక్షితంగా మార్చేందుకు ఈ నిపుణుల బృందం నిరంతరం పనిచేస్తోందని ఆదివారం ఎక్స్ వేదికగా సిబిఎస్ఇ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐఐటిలు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇప్పటివరకు గుర్తించిన సాంకేతిక, భద్రతా లోపాలను సరిచేశామని, ఇంకా ఏవైనా హ్యాకింగ్‌కు అవకాశం కల్పించే బలహీనతలు ఉన్నాయా అనే అంశాన్ని నిపుణులు సమగ్రంగా పరిశీలిస్తున్నారని పేర్కొంది. భద్రతా అంశాలకు సంబంధించిన సమాచారం లేదా సూచనలు ఇవ్వాలనుకుంటే తమ సైబర్ భద్రతా విభాగాన్ని సంప్రదించాలని సీబీఎస్ఈ కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా [email protected] ఇ-మెయిల్ చిరునామాను అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది.



