కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఈ నియామకాలు ఖరారయ్యాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న వారిలో నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, మరొకరు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ వెలువరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన వారిలో జస్టిస్ చంద్రశేఖర్ (బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ షీల్ నాగు (పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ సంజీవ్ సచ్దేవ్ (మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ అరుణ్ పళ్లి (జమ్మూ కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), సుప్రీం కోర్టుకు చెందిన ప్రముఖ సీనియర్ మహిళా న్యాయవాది వి. మోహన ఉన్నారు. న్యాయవాది మోహన 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అయిదేండ్ల లా డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఇందు మల్హోత్రా, సీఎస్ వైద్యనాథన్‌ల వద్ద జూనియర్‌గా ఉన్నారు. 1996లో ఏఓఆర్ పరీక్ష పాసైన తర్వాత ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. వివిధ కేసుల్లో సీనియర్ న్యాయవాదులు కపిల్‌సిబల్, కెకె వేణుగోపాల్, పి. చిదంబరం, అరుణ్ జైట్లీ, అంద్యార్జునలతో కలిసి పనిచేశారు. 2015 ఏప్రిల్ 23న సీనియర్ న్యాయవాది హోదా పొందారు. ఈమె చేరికతో సుప్రీం కోర్టులో మహిళా జడ్జిల సంఖ్య రెండుకు చేరినట్లయింది.
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు
- Advertisement -
- Advertisement -



