నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం
జైలుకు పోకుండా కాపాడానంటూ ఫోన్ లో హెచ్చరికలు
లెబనాన్‌లో దాడులపై మండిపాటు
శాంతి చర్చలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆక్షేపణ
వాషింగ్టన్ : లెబనాన్‌లో ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో జరుపుతున్నశాంతి చర్చలను ఇజ్రాయిల్ ప్రమాదంలో పడేస్తోందని ఆరో పించారు. నెతన్యాహూతో జరిపిన వాడివేడి టెలిఫోన్ సంభాషణలో ట్రంప్ ఆయనపై మండిపడ్డారని సమాచారం. ‘నీకు పిచ్చి పట్టింది. ఇప్పుడు నిన్న, ఇజ్రాయిల్‌ను అంద రూ ద్వేషిస్తున్నారు. నీకు కృతజ్ఞత లేదు. నువ్వు జైలుకు పోకుండా సాయపడ్డాను. కాపాడుకుంటూ వస్తున్నాను. లేకపోతే జైలులో ఉండేవాడివి’ అంటూ పరుష పద జాలంతో నెతన్యాహూను తూర్పార పట్టినట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. ఓ దశలో ఆగ్రహంతో ఊగిపోతూ ‘అసలు నువ్వు ఏం చేస్తున్నావు’ అని నిలదీశారు.
ఇజ్రాయిల్ దూకుడు
శాంతి చర్చలకు అవరోధం
లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులు సహా అన్ని రకాల దాడులను నిలిపి వేస్తేనే శాంతి ఒప్పందం సాధ్య పడుతుందని ఇరాన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా ట్రంప్, నెతన్యాహూ మధ్య ఉద్రిక్తపూరితమైన సంభాషణలు జరిగినప్పటికీ ఇరాన్, ఇతర సమస్యలపై వారిద్దరి మధ్య సన్నిహిత సమన్వయం కొనసాగుతూనే ఉంది. లెబనాన్‌పై ఇజ్రాయిల్ దూకుడుగా వ్యవహరించడం వల్లనే ఇరాన్‌తో శాంతి చర్చలు ముందుకు సాగడం లేదని ట్రంప్ ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. లెబనాన్ రాజధాని బీరుట్ దాడులు చేయాలన్న ఇజ్రాయిల్ ప్రణాళికకు ట్రంప్ బ్రేకులు వేశారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ అమెరికా పత్రిక తెలిపింది. బీరుట్‌పై బాంబు దాడులు జరుపుతామని ఇజ్రాయిల్ చేస్తున్న హెచ్చరికలు ఆ దేశాన్ని ప్రపంచంలో మరింత ఒంటరిని చేస్తుందని నెతన్యాహూను ట్రంప్ హెచ్చరించారని తెలుస్తోంది.
ఇజ్రాయిల్ చర్యలపై మండిపాటు
నెతన్యాహూ జైలుకు పోకుండా సాయం చేశానని ఆయనతో జరిపిన సంభాషణ సందర్భంగా ట్రంప్ నిష్టూరమాడారు. నెత న్యాహూ అవినీతిపై విచారణ జరిగిన సమయంలో ఆయనకు ట్రంప్ మద్దతుగా నిలిచారన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతోంది. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్ అనుకూల హిజ్బొల్లాలు ఇజ్రాయిల్ సేనలపై కాల్పులు జరుపుతున్నారని, దీంతో ఇజ్రాయిల్‌కు తనను తాను రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ట్రంప్ తొలుత భావించారు. అయితే ఇటీవలి కాలంలో నెతన్యాహూ తన దుండుడుకు వైఖరితో పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నారని ట్రంప్ తాజాగా నిర్ణయానికి వచ్చారు. ఇజ్రాయిల్ దాడిలో అనేక మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడం, ఓ హిజ్బొల్లా కమాండర్‌ను చంపడానికి ఇజ్రాయిల్ సేనలు పలు భవనాలను కూల్చివేయడం వంటి పరిణామాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అమెరికా వర్గాలు ఆక్సియాస్ వార్తా సంస్థకు తెలియజేశాయి.
దాడులు-ప్రతి దాడులు ఆగాయి : ట్రంప్
ట్రంప్, నెతన్యాహూ మధ్య ఫోన్ సంభాషణ జరిగిన తర్వాత హిజ్బొల్లా లక్ష్యాలపై దాడి చేసే యోచన ఏదీ లేదని ఇజ్రాయిల్ అధికారి ఒకరు చెప్పారు. నెతన్యాహూతో జరిపిన ఫోన్ సంభాషణ ‘ఫలప్రదమైందని’, ఇజ్రాయిల్ దళాలు బీరుట్ వెళ్లబోవని ట్రంప్ తెలిపారు. ‘నేను ఈ రోజు బీబీ నెతన్యాహూతో మాట్లాడాను. బీరుట్‌పై దాడి చేయవద్దని కోరాను. ఆయన తన దళాలను వెనక్కి రప్పిస్తున్నారు. ధన్యవాదాలు…బీబీ’ అని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. హిజ్బొల్లా నాయకుల ప్రతినిధులతో కూడా మాట్లాడానని, ఇజ్రాయిల్ పైన, దాని సేనల పైన కాల్పులు ఆపడానికి వారు అంగీకరించారని తెలిపారు. అదే విధంగా ఇజ్రాయిల్ కూడా కాల్పులు ఆపడానికి అంగీకరించిందని అంటూ ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూద్దామని అన్నారు. కాగా ట్రంప్‌తో సంభాషణను నెతన్యాహూ ధృవీకరించారు. అయితే ఈ సంభాషణ తనకు ఓ హెచ్చరిక వంటిదని చెప్పారు. హిజ్బొల్లా దాడులు ఆగకపోతే వారు బీరుట్‌లోని లక్ష్యాలపై కూడా దాడి చేస్తారని ట్రంప్ చెప్పారని అన్నారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ సైన్యం ఓ ప్రణాళిక ప్రకారం పనిచేస్తుందని తెలిపారు. ఇజ్రాయిల్‌పై హిజ్బొల్లా దాడులు ఆపకపోతే తాము బీరుట్‌పై దాడి చేసే అవకాశం లేకపోలేదని ముక్తాయింపు ఇచ్చారు. ‘మా వైఖరి కొనసాగుతుంది’ అని అన్నారు. కాగా తాజా పరిణామాలపై హిజ్బొల్లా ఇంకా స్పందించలేదు.
ఇదీ
కారణం
బీరుట్‌లోని దహియెహ్ జిల్లాలో హిజ్బొల్లాల నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై దాడులు చేయాలని నెతన్యాహూ, ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కట్జ్ తమ దళాలను సోమవారం ఆదేశించారు. కాల్పుల విరమణను హిజ్బొల్లా పదేపదే ఉల్లంఘిస్తోందని, ఇజ్రాయిల్ భూభాగంపై దాడులు చేస్తోందని ఆరోపించారు. దీంతో పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరగవచ్చునన్న భయాందోళనలతో బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. లోబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులు శాంతి చర్చలకు విఘాతం కలిగిస్తాయని ఇరాన్ హెచ్చరించింది. అమెరికాతో జరిగే ఏ ఒప్పందంలో అయినా లెబనాన్‌లో కాల్పుల విరమణ కీలక అంశం కావాల్సిందేనని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధానికి ఫోన్ చేసి హెచ్చరికలు జారీ చేశారు.



