స్వల్ప ఆలస్యంతో ప్రవేశం
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు: వాతావరణ శాఖ
త్రివేండ్రం: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు స్వల్ప ఆలస్యంతో కేరళంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా అంచనాల ప్రకారం జూన్ 4న కేరళం తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. దీంతో దేశంలో అధికారికంగా వర్షాకాలం ప్రారంభం కానుంది. రుతుపవనాల రాకతో దక్షిణ భారత రాష్ట్రాల్లో వచ్చే ఆరు నుంచి ఏడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కేరళంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అరేబియా సముద్రం మీదుగా తేమతో కూడిన గాలులు బలపడుతుండటంతో రుతుపవనాల కదలిక వేగవంతమవుతోంది. దీని ప్రభావంతో కేరళంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.
అయితే రుతుపవనాల ప్రారంభంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాలతో పాటు దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా వేసింది. దీంతో విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక నిర్మాణాలు, వ్యవసాయ పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని సూచించింది.ఉత్తరాదిలోని ఢిల్లీ- ఎన్సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఇటీవల నమోదైన తీవ్ర ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. ఆ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత కొన్ని రోజులుగా అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి మధ్య భారత రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు భారతదేశంలోని బీహార్, జార్ఖండ్, బంగాల్లో రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తొలుత మే 26నే అంచనా
నైరుతి రుతుపవనాలు కేరళను తాకవచ్చునని తొలుత మే 26నే ఐఎండీ అంచనా వేసింది. అయితే, ఆ అంచనాలను మే 29నకు సవరించి, తదుపరి వారంలో రావచ్చని పేర్కొంది. మరోవైపు, వాతావరణంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితుల వల్ల ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షాలే కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయని, జూన్లో అవి బలహీనంగా ఉన్నా సెప్టెంబర్లో బలపడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, తీవ్రమైన ఎండల ప్రభావంతో దేశం వేడేక్కిపోతోంది. ఈ ఎండలతో అల్లాడిపోతున్న ప్రజానీకానికి మరికొన్ని రోజులపాటు నిరీక్షణ తప్పేలా లేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఇంకోవైపు, రెండుమూడు రోజుల తర్వాతైనా రుతుపవనాలు కేరళంకు వస్తాయా అని కొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, రుతుపవనాల రాకతో వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తమ య్యారు. కేరళంలోని పలు ప్రాంతాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్జ్ జారీ చేశారు. మొత్తం 9 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
రేపు కేరళంలోకి నైరుతి రుతుపవనాలు
- Advertisement -
- Advertisement -



