Sunday, February 8, 2026
E-PAPER
Homeజాతీయంభారత్‌కు తదుపరి పెద్ద మార్కెట్‌ గల్ఫ్‌ దేశాలు

భారత్‌కు తదుపరి పెద్ద మార్కెట్‌ గల్ఫ్‌ దేశాలు

- Advertisement -

– ఆరు దేశాలతో మెగా ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందంపై చర్చలు
– ఇది ఎగుమతులు, ఎనర్జీ, ఉద్యోగాలకు దోహదం
– భారత్‌.. అమెరికా మార్కెట్‌పైనే ఆధారపడొద్దు : ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు


ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధాలు, టారిఫ్‌ అడ్డంకులతో అంతర్జాతీయ వ్యాపారం మందగిస్తున్న సమయంలో గల్ఫ్‌ దేశాలు భారత్‌కు కీలకమైన కొత్త వ్యూహాత్మక మార్కెట్‌గా మారుతున్నాయి. ఇప్పటికే గల్ఫ్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) భారత్‌కు అతిపెద్ద వాణిజ్య బ్లాక్‌గా ఉన్నది. ఇది యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), ఏసియాన్‌ల కంటే కూడా పెద్దది. జీసీసీ అనేది సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌, కువైట్‌, ఒమన్‌, బహ్రయిన్‌ అనే ఆరు పశ్చిమాసియా దేశాల కూటమి. ఇప్పుడు ఆ ఆరు గల్ఫ్‌ దేశాలతో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు భారత్‌ ముందడుగు వేసింది. ఇది భారత్‌కు చాలా కీలకమైందని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు.

న్యూఢిల్లీ : జీసీసీ దేశాలతో భారత్‌ వాణిజ్యం 2024-25లో సుమారు 179 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది ఈయూ, ఏసియాన్‌ దేశాల కంటే కూడా ఎక్కువ. ఈ కొత్త ఎఫ్‌టీఏ వల్ల భారత్‌కు పలు లాభాలున్నాయి. దిగుమతి- ఎగుమతి సుంకాలు తగ్గుతాయి. నాన్‌-టారిఫ్‌ అడ్డంకులు తొలగిపోతాయి. భారత ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పెట్రోకెమికల్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు కొత్త ఊపు వస్తుంది. పెట్టుబడులకు స్థిరత్వం, నమ్మకం ఏర్పడతాయని విశ్లేషకులు చెప్తున్నారు. భారత్‌ ఇప్పటికే యూఏఈతో 2022లో, ఒమన్‌తో 2025 డిసెంబర్‌లో ‘సెపా’ ఒప్పందాలు అమలు చేస్తోంది. గల్ఫ్‌ దేశాలు భారత్‌కు చమురు, సహజవాయువు సరఫరాలో కీలకం. అలాగే అక్కడ సుమారు ఒక కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు ఎనర్జీ సెక్యూరిటీ (ఇంధన భద్రత), గల్ఫ్‌ దేశాలకు ఫుడ్‌ సెక్యూరిటీ (ఆహార భద్రత) బలపడుతుందని కేంద్రం భావిస్తున్నది.

గల్ఫ్‌.. భారత్‌కు భవిష్యత్తు మార్కెట్‌
ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులు, ఆర్థిక ఆంక్షల నడుమ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్టాక్‌ మార్కెట్లు అస్థిరతతో నడుస్తున్నాయి. అయితే ఇలాటి పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక నిపుణులు మాత్రం గల్ఫ్‌.. భారత్‌కు ఒక భవిష్యత్‌ మార్కెట్‌గా అంచనా వేస్తున్నారు. ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్‌ ప్రకారం… భారత్‌ వృద్ధికి దక్షిణాసియా, చైనా, పశ్చిమాసియా (గల్ఫ్‌), ఆఫ్రికాలు ముఖ్యమైన మార్కెట్లు. భారత్‌ అమెరికా మార్కెట్‌పై మాత్రమే ఆధారపడకూడదని ఆయన చెప్పారు.

భారత్‌-గల్ఫ్‌ వాణిజ్య వివరాలు
భారత్‌.. సౌదీ అరేబియా, ఖతార్‌ వంటి గల్ఫ్‌ దేశాల నుంచి క్రూడాయిల్‌, సహజ వాయువును దిగుమతి చేసుకుంటుంది. ముత్యాలు, విలువైన, పాక్షిక విలువైన రాళ్లను, లోహాలు, ఇమిటేషన్‌ జ్యువెలరీ, ఎలక్ట్రికల్‌ మెషినరీ, ఐరన్‌, స్టీల్‌, కెమికల్స్‌ను ఈ దేశాలకు భారత్‌ ఎగుమతి చేస్తుంది. 2024-25లో జీసీసీకి భారత్‌ ఎగుమతులు దాదాపు 57 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 2023-24లో నమోదైన 56.32 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం కంటే ఇది పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. ఇక దిగుమతులు 15.33 శాతం పెరిగి 121.7 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 2023-24లో దిగుమతుల విలువ 105.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది.

యూఏఈ.. భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నది. భారత్‌ నుంచి ఈ దేశానికి 36.63 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరగగా.. దిగుమతులు 63.40 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 26.76 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. సౌదీ అరేబియా ఐదో స్థానంలో ఉన్నది. ఇక ఖతార్‌ నుంచి భారత్‌ ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)ని దిగుమతి చేసుకుంటుంది. బదులుగా భారత్‌ తృణధాన్యాలు, మాంసం, చేపలు, రసాయనాలు, ప్లాస్టిక్స్‌ ఎగుమతి చేస్తుంది.

2024-25లో ఒమర్‌ భారత్‌కు 28వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నది. ఎగుమతులు 4 బిలియన్‌ డాలర్లుగా, దిగుమతులు 6.54 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 2.48 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. భారత్‌తో వాణిజ్యం విషయంలో కువైట్‌ 29వ స్థానంలో ఉన్నది. ఎగుమతులు 1.93 బిలియన్‌ డాలర్లుగా, దిగుమతులు 8.28 బిలియన్‌ డాలర్లుగా, వాణిజ్య లోటు 6.35 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇక బహ్రయిన్‌ 65వ స్థానంలో ఉన్నది. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 797.47 మిలియన్‌ డాలర్లు, దిగుమతులు 843.44 మిలియన్‌ డాలర్లు, వాణిజ్య లోటు 45.97 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది.
ప్రపంచ వాణిజ్యం కుదేలవుతున్న ఈ తరుణంలో.. గల్ఫ్‌ దేశాలతో మెగా ఎఫ్‌టీఏ భారత్‌కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ముందడుగుగా ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. ఇది భారత ఎగుమతులకు, ఎనర్జీ భద్రతకు, ఉద్యోగ అవకాశాలకు దోహదపడే అవకాశం ఉన్నదని అంటున్నారు.

ఎఫ్‌టీఏ చర్చలకు అధికారిక ఆరంభం
భారత్‌-జీసీసీ మధ్య ఎఫ్‌టీఏ కోసం ‘టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీఓఆర్‌)’పై ఇప్పటికే సంతకాలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ అధ్యక్షత వహించారు. ”భారత్‌-గల్ఫ్‌ దేశాలు 5000 ఏండ్లుగా వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు మరింత బలమైన వాణిజ్య ఒప్పందం అవసరం” అని ఈ సందర్భంగా పీయూశ్‌ గోయల్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -