కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
ఉపముఖ్యమంత్రిగా పరమేశ్వర బాధ్యతలు!
బెంగళూరు : కర్నా టకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్ భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ డీకే శివకుమార్తో ప్రమాణం చేయించారు. అలాగే సీనియర్ నేత జి.పరమేశ్వర్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితోపాటు మరో 12 మంది మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్నా టక మాజీ సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం సతీశన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అజారుద్దీన్ హాజరయ్యారు.
చేతిలో రాజ్యాంగం
ప్రమాణ స్వీకారానికి ముందు డీకే వేదికపై నుంచి ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను డీకే సత్కరించారు. అనంతరం తన తాతయ్య గంగాధరయ్య చిత్రపటానికి నివాళులర్పించి ఆయన్ను స్మరించుకుంటూ కర్నాట క రాష్ట్రానికి 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో డీకే చేతిలో రాజ్యంగం బుక్ అందర్నీ ఆకర్షించింది. చేతిలో రాజ్యాంగం బుక్ను పట్టుకుని అయన ప్రమాణం చేశారు.
మంత్రులుగా సిద్ధరామయ్య, ఖర్గే కుమారులు డీకే క్యా బినెట్లో మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు మంత్రివర్గంలో చోటు దక్కింది. వీళ్లతోపాటుగా కె.హెచ్.మునియప్ప, కె.జె.జార్జ్, ఎం.బి.పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జర్కిహోళి, కృష్ణబైరిగౌడ, యు.టి.ఖాదిర్, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, శరణ్ ప్రకాశ్ పాటిల్తో గవర్నర్ థావర్చంద్ ప్రమాణం చేయించారు. దీంతో కర్నా టకలో డీకే శివకుమార్ నేతృత్వంలో నయా సర్కార్ కొలువుదీరింది.ముఖ్యమంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న డీకే శివకుమార్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని అన్నారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు.
కార్యదర్శి జోక్యం
ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా, ఎం.బి. పాటిల్ బసవన్న సిద్ధేశ్వర మహాస్వామి పేర్ల మీద ప్రమాణం చేశారు. దీంతో కార్యదర్శి శాలిని రజనీశ్ జోక్యం చేసుకుని, పత్రంలో ఉన్న పదాలను మాత్రమే చదవాలని సూచించారు. ప్రమాణ పత్రంలో ఉన్నవి తప్ప మరే ఇతర విషయాలను చదవకూడదని గవర్నర్ ఆదేశించారు.
సొంత నియోజకవర్గంలో కార్యకర్తల సంబురాలు!
డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఆయన సొంత నియోజకవ ర్గం రామనగరలో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్త లు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. నగరంలోని ఐజూరు సర్కిల్, చన్నపట్న వద్ద బస్ స్టాండ్ వద్ద వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు.
ఎట్టకేలకు సాధించిన డీకే
కాగా, 2023 మే నెలలో కర్నా టక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఆ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకేకు సీఎం పీఠం దక్కుతుందని అంతా భావించారు. కానీ పార్టీ అధిష్ఠానం మాత్రం సీనియర్ నేత సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. రెండున్నరేండ్ల తర్వాత తనను సీఎం చేస్తామని హైకమండ్ డీకేకు మాట ఇచ్చినట్లు అప్పట్నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్కు రెండున్నరేండ్లు ముగియగానే ఈ ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. అలా గత ఆరునెలలుగా కర్నా టకలో నాయకత్వ మార్పు ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. దీంతో రీసెంట్గా అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య గతనెల 29న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆ సీటులోకి డీకే వచ్చారు.



