– మాంసం విక్రయాలపై పర్యవేక్షణ కరువు
– ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న దుకాణాల నిర్వహణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇటీవల ఓ మేకల దొడ్డిపై కుక్కలు దాడి చేయడంతో గాయపడిన జీవాల మాంసాన్ని కొందరు దుకాణాల్లో విక్రయించారనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, వడగాల్పులు, వర్షాకాల ముసురు వంటి కారణాలతో కొన్ని పశువులు మృత్యువాత పడటం సహజం. అలాంటి జంతువులను కొందరు యజమానులు ఆర్థిక నష్టాన్ని తగ్గించుకునేందుకు మాంసం దుకాణాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కొనుగోలు చేస్తున్న మాంసం నిజంగా నాణ్యమైనదేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన మాంసం అందించడంలో పశుసంవర్ధక శాఖ, మున్సిపాలిటీ అధికారుల పాత్ర అత్యంత కీలకం. అయితే అనేక ప్రాంతాల్లో మాంసం దుకాణాలపై పర్యవేక్షణ సరిగా లేకపోవడం ప్రజారోగ్యంపై ఆందోళనలకు కారణమవుతోంది.
వధకు ముందు జంతువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం, వ్యాధిగ్రస్త పశువులను గుర్తించడం, వధ అనంతరం మాంసం నాణ్యతను పరీక్షించి వినియోగానికి అనుకూలమా కాదా నిర్ధారించడం పశువైద్యుల ప్రధాన బాధ్యత. అదేవిధంగా మాంసం ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు అవసరమైన సూచనలు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు మాంసం దుకాణాలకు లైసెన్సులు జారీ చేయడం, పరిశుభ్రత ప్రమాణాల అమలును పర్యవేక్షించడం, వ్యర్థాల నిర్వహణను తనిఖీ చేయడం, అక్రమ వధశాలలు మరియు అనుమతులు లేని విక్రయాలపై చర్యలు తీసుకోవడం మున్సిపాలిటీ బాధ్యత. అయితే చాలా చోట్ల ఈ తనిఖీలు క్రమం తప్పకుండా జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు.
పశుసంవర్ధక శాఖ, మున్సిపాలిటీ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సురక్షితమైన మాంసం అందించే వ్యవస్థ సమర్థవంతంగా అమలవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వినియోగదారుల ఆవేదన:
“మాకు తాజా, నాణ్యమైన మాంసం అందాలి. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి కలుషిత మాంసం విక్రయాలను అరికట్టాలి” అని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. దుకాణాల్లో పరిశుభ్రత పాటించడంతో పాటు వ్యాధిగ్రస్త జంతువుల మాంసం విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజారోగ్య పరిరక్షణ కోసం పశుసంవర్ధక శాఖ, మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో మాంసం విక్రయ కేంద్రాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో నాణ్యమైన మాంసం ప్రజలకు అందడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నివారించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
అధికారుల వివరణ:
ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డిని వివరణ కోరగా, “కుక్కల దాడికి గురైన మేకల మాంసం విక్రయాలపై వచ్చిన ప్రచారాన్ని పరిశీలించాం. అయితే అలాంటి మాంసం విక్రయించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు” అని తెలిపారు.
మాంసం నాణ్యత నిర్ధారణ అంశంపై పశువైద్య అధికారులను సంప్రదించగా, “మున్సిపాలిటీ అధికారికంగా అభ్యర్థించిన సందర్భాల్లో మేము మాంసాన్ని పరిశీలించి నాణ్యత నిర్ధారిస్తాం. సంబంధిత ధృవీకరణ అనంతరమే విక్రయాలు జరగాల్సి ఉంటుంది” అని వెల్లడించారు.



