నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఇప్పటి వరకు అక్కడ పూర్తి అదనపు బాధ్యతల్లో ఉన్న డి. కృష్ణ భాస్కర్‌ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది.
ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి సబ్యసాచి ఘోష్ ప్రస్తుతం ఉన్న బాధ్యతలతో పాటు, ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతల్లో కూడా ఆయనే కొనసాగుతారు. పి. కాత్యాయని దేవిని ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా బదిలీ చేశారు. దీంతో పాటు ఆమె స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతారు.
సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ విభాగంతో పాటు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దివ్య దేవరాజన్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. మయాంక్ మిట్టల్ జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. చివరగా రఘురామ్ శర్మను పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు.



