నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు టోర్నీ ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వారం ప్రాక్టీస్ సెషన్‌లో గజ్జల్లో బంతి బలంగా తగలడంతో అతను అంతర్గత రక్తస్రావంతో బాధపడుతున్నాడు. దీంతో నేడు ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు మార్ష్ దూరమయ్యాడు. అతని స్థానంలో ట్రావిస్ హెడ్ తాత్కాలికంగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
ఈ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన విడుదల చేసింది. “మార్ష్‌కు తీవ్రమైన నొప్పి, అసౌకర్యం ఉన్నాయి.కదలడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. స్కానింగ్‌లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు నిర్ధారణ అయింది. అతనికి కొంతకాలం విశ్రాంతి అవసరం. లక్షణాలు తగ్గిన తర్వాత, వైద్యుల సలహా మేరకు అతను తిరిగి ఎప్పుడు ఆడతాడో నిర్ణయిస్తాం” అని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా, స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను శ్రీలంకకు రావాల్సిందిగా జట్టు యాజమాన్యం కోరింది. అతను అక్కడి వాతావరణానికి అలవాటుపడి, అవసరమైతే జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రస్తుతానికి స్మిత్‌ను అధికారికంగా ప్రపంచకప్ స్క్వాడ్‌లో చేర్చలేదు. అయితే, ఇప్పటికే హేజిల్‌వుడ్ స్థానాన్ని భర్తీ చేయకపోవడంతో ఆసీస్ 15 మంది సభ్యుల జట్టులో ఒక ఖాళీ ఉంది.



