బీసీ, ఎస్టీ కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారం
మూడు బోర్లను ప్రారంభించిన సర్పంచ్ బానోత్ జ్యోతి కొండ
నవతెలంగాణ – బోనకల్
బోనకల్ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బోనకల్ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు మంచినీటి బోర్లను సోమవారం గ్రామ సర్పంచ్ బానోతు జ్యోతి కొండ ప్రారంభించారు. గ్రామంలోని బీసీ కాలనీలో ఆళ్ల వెంకటేశ్వర్లు ఇంటి సమీపంలో ఒక బోరు, మోర్ల రాములు ఇంటి వద్ద మరో బోరు, ఎస్టీ కాలనీలో గుగులోత్ వరాలు ఇంటి సమీపంలో మరో బోరును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు జ్యోతి , ఉప సర్పంచ్ బానోతు కొండ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గ్రామపంచాయతీ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. తాగునీరు ప్రతి కుటుంబానికి అత్యంత ప్రాథమిక అవసరమని, గ్రామంలో ఎక్కడ నీటి కొరత తలెత్తినా వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతకు స్వచ్ఛమైన తాగునీరు ఎంతో అవసరమన్నారు. గ్రామంలోని అన్ని ప్రధాన వీధులలో నీటి సమస్య లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధిలో భాగంగా తాగునీటి సౌకర్యాల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
గ్రామస్తులు ఈ బోర్ల ఏర్పాటుతో తమ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి కోల రాజేశ్వరి, బోనకల్ సొసైటీ మాజీ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, సిపిఎం మధిర డివిజన్ కమిటీ సభ్యులు తెల్లాకుల శ్రీనివాసరావు, తెల్లూరి రమేష్, నందమూరి సత్యనారాయణ, నాగేశ్వరరావు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పోటు వెంకటేశ్వర్లు, అంతోటి శ్రీను, అంతోటి సునీత, జరుపల లావణ్య, తాళ్లూరి జ్యోతి, షేక్ నౌషిన్, మరీదు శేషు, షేక్ మీరా సాహెబ్, జరపల శివకృష్ణ, షేక్ బాజీ, టైగర్ విజయ్, గద్దె రామారావు, గంగుల త్రివేణి, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



