Tuesday, June 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమా భూమిని కబ్జా చేశారు
న్యాయం చేయండి

మా భూమిని కబ్జా చేశారు
న్యాయం చేయండి

- Advertisement -

అర్ధ శతాబ్దకాలంగా వృద్ధ దంపతుల కన్నీటి పోరాటం
న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి

నవతెలంగాణ-కల్లూరు
”కష్టం చేసి పైసా పైసా కూడా పెట్టి భూమి కొనుగోలు చేశాం.. ఇప్పుడు ఆ భూమిని కొందరు ఆక్రమించుకొని మమ్మల్నే అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు దిగుతున్నారు..మాకు న్యాయం చేయండి” అంటూ 87 ఏండ్ల వృద్ధ దంపతులు సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌ను వేడుకుంటున్నారు. కల్లూరు మండలం ల‌క్ష్మీపురం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వెన్నం బసవయ్య, విజయలక్ష్మి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని కాపాడుకోవడానికి అర్ధ శతాబ్దానికి పైగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని రోదించారు. వయోభారంతో బాధపడుతున్న ఈ దంపతులు ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు. బసవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 1970లో లక్ష్మీపురం పరిధిలోని సర్వే నంబర్‌ 52/2/ఏలోని 30 ఎకరాల వ్యవసాయ భూమిని అప్పటి పట్టాదారులైన నాణెంకాల వీరభద్రమ్మ- వీరరాజ సోమశేఖరయ్య వద్ద నుంచి భూమిని బసవయ్య కొనుగోలు చేశారు. బసవయ్య రచయిత, కవి కూడా. ఆయన పుస్తకాల ప్రచురణ చేశారు. వ్యవసాయంలో వచ్చే ఆదాయంతో ఆ పుస్తకాలను ప్రచురించారు. మాగి, జొన్న తదితర పంటలు సాగు చేశారు.

అక్కడ ఒక వ్యక్తిని రక్షణగా పెట్టుకున్నారు. ఆ తర్వాత భూముల విలువ పెరగడంతో కొందరు బసవయ్య భూమిపై కన్నేసి వారిని బెదిరిస్తున్నారు. భూమి రక్షణ కోసం రెండు లారీల ఫెన్సింగ్‌ రాళ్లు తెప్పించి కాంపౌండ్‌ నిర్మించేందుకు ప్రయత్నించగా కొందరు వ్యక్తులు వాటిని ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. భూమిని చదును చేయడానికి డోజర్‌ తీసుకెళ్తే కొందరు తగులబెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక్కడ ఉన్న పాకను సైతం దుండగులు తగలబెట్టారు. 1996లో పంగిడి చెరువు ప్రాజెక్టు నిర్మాణంలో బసవయ్య 30 ఎకరాల్లో సుమారు 10 ఎకరాల భూమి మునిగిపోయింది. దానికి సంబంధించిన నష్టపరిహారం కోసం దశాబ్దాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు రూపాయి కూడా బాధితులకు అందలేదు.

‘ఇప్పుడు నా వయస్సు 87 సంవత్స రాలు. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన భూమిని కాపాడుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోయాను. కలవని అధికారి లేడు.. వెళ్లని కార్యాలయమూ లేదు. ప్రజాప్రతినిధులను, నాయకులను కలిసి నా గోడు చెప్పుకున్నా పరిష్కారం లభించలేదు” అని బసవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని, భూమిని ఆక్రమించిన వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ భూమిని తిరిగి స్వాధీనం చేయాలని దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మానవీయ దృక్పథంతో స్పందించాల్సిన అవసరం దశాబ్దాలుగా భూమి కోసం పోరాడుతున్న వృద్ధ దంపతుల సమస్యపై రెవెన్యూ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. వృద్ధాప్యంలో న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఈ దంపతుల సమస్యకు ప్రభుత్వం తక్షణ పరిష్కారం చూపాలని ప్రజలు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -