Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజూన్ నెలాఖరులోగా పీఆర్సీ నివేదిక ప్రకటించాల్సిందే

జూన్ నెలాఖరులోగా పీఆర్సీ నివేదిక ప్రకటించాల్సిందే

- Advertisement -

ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను కుదించాలనే ఆలోచనను విరమించుకోవాలి
ఓపియస్ హామీని నిలబెట్టుకోవాలి : టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూన్ 2 లోపు ఇస్తామన్న పీఆర్సీ నివేదిక ఇంకా విడుదల కాలేదనీ, ఆ నివేదికను కనీసం జూన్ నెలాఖరులోపు తెప్పించుకొని పీఆర్సీ ప్రకటించకపోతే జూలైలో పోరాటం చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు చావ రవి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్ ) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన రెండో పీఆర్సీ 35 నెలలు గడిచినప్పటికీ నివేదిక సమర్పించలేదని తెలిపారు. జూన్ నెలాఖరులోగా నివేదిక తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్ తో పీఆర్సీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాత్సారం చేస్తే జులై నెలలో టీఎస్ యూటీఎఫ్ ఉద్యమిస్తుందని తెలిపారు. గతంలో హామీ ఇచ్చి మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రయివేటు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 27 వేల పాఠశాల నుంచి 4 వేల పాఠశాలలకు కుదించనున్నట్టు ప్రకటించిన నిర్ణయం సరైంది కాదని ఆక్షేపించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించి ఆ స్కూళ్లను కాపాడాలని కోరారు. ఎన్‌రోల్‌మెంట్ పెంచడానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.

మెరుగైన సమాజ నిర్మాణం కోసం ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాలని తెలిపారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో తప్పకుండా ప్రభుత్వ బడి ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డీఏ లను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా స్పెషల్ టెట్ నిర్వహించాలనీ, క్వాలిఫై మార్క్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన మెమో నెం.57 ప్రకారం 2004 సెప్టెంబర్ కు ముందు నియామకమైన డియస్సీ 2003 ఉపాధ్యాయులకు వెంటనే పాత పెన్షన్ విధానం అమలు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆగస్టు నెలలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలన్నారు. బీసీ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో టైం టేబుల్ మార్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, సిహెచ్ దుర్గా భవాని, రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.రవికుమార్, జి.శ్రీధర్, వై.జ్ఞానమంజరి, పి.నాగేశ్వరరావు, పి.వెంకటేశం, యం.వెంకటప్ప, సిహెచ్.విశాలి, ఆడిట్ కమిటీ కన్వీనర్ జె. యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -