Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.110 కోట్లతో అంబేద్క‌ర్ నాలెడ్జ్ సెంట‌ర్

రూ.110 కోట్లతో అంబేద్క‌ర్ నాలెడ్జ్ సెంట‌ర్

- Advertisement -

రూ. 25 కోట్లతో ఎస్సీ హాస్టల్ : స్థలాలను పరిశీలించిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్ర‌జా ప్ర‌భుత్వం రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నిర్మించేదిశ‌గా కృత నిశ్చ‌యంతో ప‌నిచేస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లోని లోయ‌ర్ ట్యాంక్ బండ వ‌ద్ద రూ.110 కోట్ల అంచ‌నాల‌తో నిర్మించ‌నున్న బాబాసాహెబ్ అంబేద్క‌ర్ నాలెడ్జ్ సెంట‌ర్, నింబోలి అడ్డా వ‌ద్ద రూ. 25 కోట్ల అంచ‌నాల‌తో నిర్మించ‌నున్న ఎస్సీ హాస్టల్ కు స్థ‌ల ప‌రిశీల‌న అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఇప్ప‌టికే ఈ రెండు భ‌వ‌నాల‌కు ఆర్థిక‌, పాల‌నాపర‌మైన అనుమ‌తులు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. ఈ భ‌వ‌నాలు ​కేవలం భౌతికంగా కనపడేటువంటి ఒక కట్ట‌డాలు మాత్ర‌మే కాదనీ, వేలాదిమంది విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే ఆధునిక దేవాల‌యాల‌ని చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోచింగ్ కష్టాలను శాశ్వతంగా దూరం చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద నిర్మించ తలపెట్టిన ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్’ స్థలాన్ని, ఆ తర్వాత కాచిగూడలోని ‘నింబోలిఅడ్డా హాస్టల్’ ప్రాంగణాన్ని సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి ల‌క్ష‌ణ్ కుమార్, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి భట్టి పరిశీలించారు. ​డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను ట్యాంక్‌బండ్ దగ్గర 10 అంతస్తులతో నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు.

నింబోలిఅడ్డా వ‌ద్ద మూడు అంతస్తుల‌తో హాస్ట‌ల్ భ‌వ‌నాల నిర్మాణం ద‌ళిత‌, నిరుపేద వ‌ర్గాల చిరకాల వాంఛ అని చెప్పారు. ఈ భ‌వ‌నాలను నిర్మించడం ద్వారా రాష్ట్రంలో జ్ఞానం పొందాలనుకునే అందరికీ పెద్ద ఎత్తున ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. ఈ భ‌వ‌నాల నిర్మాణంకు ప్ర‌తిపాద‌న‌లు పంపిన వెంట‌నే రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిందని తెలిపారు. నాలెడ్జ్ సెంట‌ర్ లో ​స్టడీ సర్కిల్స్, ​డిజిటల్ లైబ్రరీ, ​కాన్ఫరెన్స్ హాల్స్ లో విజ్ఞానాన్ని పంచే అత్యుత్త‌మ వేదిక‌లగా నిలుస్తాయ‌నే అశాభ‌వాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఇక్కడ నిర్వహించే కార్యకలాపాలను డిజిటల్ వ్యవస్థతో మారుమూల ప్రాంతాలకు చేర్చేలా బ‌ల‌మైన సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను అందిస్తున్న‌ట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్ర‌తి శాస‌న‌సభ నియోజ‌క‌వ‌ర్గంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ను నిర్మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించామ‌ని గుర్తు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కోచింగ్ కోసం హైద‌రాబాద్ రాకుండా అక్క‌డే ప్రిపేర‌య్యేలా అవి ఉండ‌బోతున్నాయని తెలిపారు. ​

భవిష్యత్తులో ఆయా శాసనసభ నియోజకవర్గాల్లోనే, అక్కడే వాళ్లకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ ఇక్కడి నుంచి పాఠాలు చెబుతుంటే.. ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు ఉన్న‌చోట‌నుంచే కదలకుండా కోచింగ్‌ను పొందేలా ఆ సెంటర్లను ఇంటర్‌లింక్ చేస్తున్న‌ట్టు చెప్పారు. ​ఈ పనులన్నింటినీ మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్లడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వెల్ల‌డించారు. ఈ నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణాలపై మేధావులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థులు ఎవరైనా సరే సలహాలు, సూచనలను నిరభ్యంతరంగా సంక్షేమ శాఖా మంత్రికి ఇవ్వ‌వ‌చ్చ‌ని చెప్పారు. ఈ పర్యటనలో సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్, రాజ్య‌స‌భ స‌భ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంక‌టేష్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ దీపక్ జాన్, ఇతర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -