Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచికెన్‌ వ్యర్థాల పట్టివేత

చికెన్‌ వ్యర్థాల పట్టివేత

- Advertisement -

హెచ్-ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా దాడి
అంతర్రాష్ట్ర చికెన్ వ్యర్థాల 
అక్రమ రవాణా గుట్టురట్టు
చేపల చెరువుల్లో వేసేందుకు తరలించే యత్నం
90 టన్నుల వ్యర్థాలు, 7 వాహనాలు స్వాధీనం


నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగించే.. చేపల చెరువుల్లో వేసేందుకు తరలిస్తున్న కుళ్లిపోయిన చికెన్‌ ‌వ్యర్థాలను పోలీసులు పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ‘హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్’ (హెచ్‌-‌ఫాస్ట్‌), జీహెచ్‌ఎంసీ వెటర్నరీ వైద్యుల బృందం ఉమ్మడిగా దాడి చేసి పట్టుకున్నాయి. హైదరాబాద్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున ఉమ్మడి బృందాలు అంబర్‌పేట్, కుల్సుంపురా, అత్తాపూర్, రాజేంద్రనగర్ పరిధిలోని చికెన్ వ్యర్థాల రవాణా గోదాములపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 7వాహనాలను పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులూ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న సుమారు 90 టన్నుల పచ్చి చికెన్ వ్యర్థాలను సీజ్ చేశారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న వివిధ చికెన్ షాపుల నుంచి ఈ వ్యర్థాలను సేకరిస్తున్నట్టు విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం ఈ వ్యర్థాలను చెంగిచెర్లలోని రెండరింగ్ పాయింట్‌కు తరలించాల్సి ఉంది.

కానీ ఎలాంటి లైసెన్స్, అనుమతులూ లేకుండా చేపల చెరువుల్లో మేతగా ఉపయోగించడం కోసం వీటిని ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా) ప్రాంతాలతోపాటు నల్లగొండలోని మాల్ టౌన్‌కు అక్రమంగా తరలిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న సుమారు 90 టన్నుల చికెన్ వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో డిస్పోస్‌ ‌చేశారు. ఈ ఆపరేషన్‌ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో హెచ్-ఫాస్ట్ ఇన్‌స్పెక్టర్లు ఎన్‌.రంజిత్ కుమార్, ఎమ్.అంజయ్య, సబ్-ఇన్‌స్పెక్టర్లు, హెచ్-ఫాస్ట్ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ వైద్యులు నిర్వహించారని సీపీ తెలిపారు. చికెన్ వ్యాపారులు, ప్రజలు ఎవరైనా ఇటువంటి అక్రమ నిల్వలు, వ్యర్థాల తరలింపులను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి ప్రజారోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని సీపీ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -