Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫుడ్ పాయిజన్ ఘటనలకు తావివ్వొద్దు

ఫుడ్ పాయిజన్ ఘటనలకు తావివ్వొద్దు

- Advertisement -

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలకు అవకాశం ఇవ్వొద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లోని సచివాలయం నుంచి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, జోనల్ అధికారులు, ప్రధాన కార్యాలయ సిబ్బందితో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవలి కాలంలో కొన్ని విద్యాసంస్థల్లో చోటుచేసుకున్న ఆహార సంబంధిత ఘటనలను ప్రస్తావించారు. గురుకులాల్లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల కొనుగోలు నుంచి వంట ప్రక్రియ, నిల్వ, పంపిణీ వరకు ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. వంటశాలలు, స్టోర్‌రూమ్‌లు, డైనింగ్ హాల్స్‌ను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలనీ, తాగునీటి నాణ్యతను తరచూ పరీక్షించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

రాష్ట్రంలోని గురుకులాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మరింత మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని వారికి సూచించారు. పీరియడ్‌‌ల వారీగా పాఠ్యాంశాల బోధన, వారాంత సమీక్షలు, నెలవారీ విద్యా ప్రగతి నివేదికలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తిస్థాయి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలు, హాస్టళ్లలో అవసరమైన మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పైకప్పుల లీకేజీలు, విద్యుత్ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, హాస్టల్ గదులు, వంటశాలలు, మరుగుదొడ్ల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సిబ్బంది సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పరిపాలనా సమస్యలపై సంస్థ యాజమాన్యంతో ప్రత్యేకంగా చర్చించి సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) కంభంపాటి శారద తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -