నవతెలంగాణ-హైదరాబాద్ : శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఎగువసభ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’లో తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు జీవితకాల సభ్యుడి (లైఫ్ పీర్)గా ప్రమాణ స్వీకారం చేశారు. బ్రిటిష్ సంప్రదాయాల మేరకు బుధవారం జరిగిన వేడుకలో ముదురు ఎరుపు రంగు గౌను ధరించి, భగవద్గీతపై నాగరాజు ప్రమాణం చేశారు. మూలాలను మరవకుండా భారతీయ సంస్కృతిపై తన గౌరవాన్ని చాటారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు.. దాదాపు 25 ఏళ్ల క్రితం బ్రిటన్ వెళ్లారు. మహాత్మాగాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగామ్ వ్యవస్థాపకుడిగా యువతలో నైతిక నాయకత్వం, సామాజిక న్యాయం, గాంధేయ విలువలను పెంపొందించడంలో కృషిచేస్తున్నారు. ‘ఏఐ పాలసీ ల్యాబ్స్’ సంస్థను స్థాపించి కృత్రిమ మేధ (ఏఐ), గ్లోబల్ గవర్నెన్స్‌పై విశేష కృషి చేస్తున్నారు. రెండేళ్ల క్రితం అక్కడి పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచారు. అయినా ఆయన సేవలకు గుర్తింపుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సిఫార్సు మేరకు కింగ్ చార్లెస్-3.. ఎగువ సభ సభ్యునిగా ఎంపిక చేశారు. ఇకపై ఆయనను ‘లార్డ్ నాగరాజు ఆఫ్ బ్లూమ్స్‌బరీ’ పేరుతో పిలుస్తారు. తన పేరు ముందు ‘బ్లూమ్స్‌బరీ’ చేరడం వెనక బలమైన కారణం ఉంది. ఆయన ఉన్నత విద్యను అభ్యసించిన ప్రఖ్యాత ‘యూనివర్సిటీ కాలేజీ లండన్’ ఈ ప్రాంతంలోనే ఉంది. గాంధీ చదివిన ఈ కళాశాలలోనే ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు.
బ్రిటిష్ పార్లమెంట్‌లో తెలంగాణ బిడ్డ ప్రమాణ స్వీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



