– మండల పంచాయతీ అధికారి సదాశివ్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కార్పొరేట్ పాఠశాలల కంటే కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు మిన్నగా ఉన్నాయని మండల పంచాయతీ అధికారి సదాశివ్ అన్నారు. బుధవారం మండలంలోని కోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వందరోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కోనాపూర్ ఉన్నత పాఠశాలలో లక్షల రూపాయల ఫీజులు ఉండే కార్పొరేట్ స్కూల్లో కంటే అధికంగా సౌకర్యాలు ఉన్నాయని, తల్లిదండ్రులు, గ్రామస్తులు తమ విద్యార్థులను స్థానిక పాఠశాలలో చేర్పించాలని సూచించారు. మండలంలోని అన్ని పాఠశాలల కంటే ఉత్తమంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:7 ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో బోధిస్తారని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులకు రెమేడియల్ తరగతులు, వైయుక్తికబోధన జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ హరిత విద్యాలయ పథకంలో కోనాపూర్ పాఠశాలకు అత్యుత్తమ 5 స్టార్ రేటింగ్ వచ్చిందని తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాలైన కళ్యాణ లక్ష్మి, ఉపాధి హామీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి లను ఆదరించినట్టుగానే ప్రభుత్వ పాఠశాలలను కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను నమోదు చేసి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చూడాలని కోరారు.
పాఠశాల అభివృద్ధికి 5సంవత్సరాల గౌరవ వేతనం విరాళం
కోనాపూర్ గ్రామ సర్పంచ్ అరుణ్ రెడ్డి మాట్లాడుతూ తన ఐదు సంవత్సరాల గౌరవ వేతనాన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు సభలో ప్రకటించారు. బడి తోటలో పండించిన కూరగాయలు మధ్యాహ్న భోజన పథకంలో వాడడం వల్ల విద్యార్థులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం లభిస్తుందని తెలిపారు. పాఠశాలలకు ఎలాంటి సహాయం అవసరం ఉన్న సత్వరమే స్పందిస్తానని తెలిపారు.పాఠశాల ప్రారంభం రోజున వచ్చే విద్యార్థులందరికీ జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, అదేవిధంగా బాలురకు, బాలికలకు ప్రత్యేకంగా డ్రా ద్వారా 1000 రూపాయలను విలువైన స్కూల్ బ్యాగ్ ను అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోర్తాడ్ ఉదయ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినోద్, పంచాయతీ కార్యదర్శి నవీన్, కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అర్జున్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్, ఏఎన్ఎం శోభారాణి, వార్డు సభ్యులు, అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.



