– మాజీ అధ్యక్షుడు, కార్యదర్శుల సభ్యత్వాలు రద్దు చేసిన మత్స్యశాఖ
– వివరాలు వెల్లడించిన ప్రస్తుత పాలకవర్గం
నవతెలంగాణ – సత్తుపల్లి
బేతుపల్లి-గంగారం మత్స్య సహకార సంఘంలో దాదాపు రూ.50 లక్షలకు పైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన మాజీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, మాజీ ప్రధాన కార్యదర్శి పొదిలి నరసింహారావుల సభ్యత్వాలను మత్స్యశాఖ అధికారికంగా రద్దు చేసింది. ప్రస్తుత పాలకవర్గం ఆమోదించిన తీర్మానాన్ని సమర్థిస్తూ మత్స్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం గంగారంలోని చాకలి ఐలమ్మ భవన్ లో సంఘ అధ్యక్షుడు ఊకే కన్నారావు, ఉపాధ్యక్షుడు కొండా జయరాజు ఆ సంఘ డైరెక్టర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2006-07 నుండి 2017-18 వరకు దాదాపు 12 ఏళ్ల పాటు సంఘంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించిన వెంకటేశ్వరరావు, నరసింహారావు రూ.50 నుండి రూ.60 లక్షల వరకు సంఘ నిధులను పక్కదారి పట్టించారని తెలిపారు.
నిధుల దుర్వినియోగంపై సంఘ సభ్యులందరూ తీవ్ర ఆవేదనకు గురై జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి, వారిద్దరి సభ్యత్వాలను రద్దు చేస్తూ తీర్మానం చేశామన్నారు. సభ్యత్వాల తొలగింపు తీర్మానాన్ని సవాలు చేస్తూ వారు కోర్టును ఆశ్రయించగా, నిజనిర్ధారణ చేయాలని మత్స్యశాఖను కోర్టు ఆదేశించిందని తెలిపారు. మత్స్యశాఖ అధికారులు గంగారం వచ్చి విచారణ జరిపి, జనరల్ బాడీ సమావేశం చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు నివేదిక అందించారు. గతనెల 17న నిర్వహించిన తుది విచారణలో రూ.50 లక్షలకు పైగా నిధుల దుర్వినియోగాన్ని అధికారులు నిర్ధారించారు. ఈ నిధుల దుర్వినియోగంపై అప్పట్లో సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి సీఐ రమాకాంత్ విచారణ చేపట్టారన్నారు. విచారణలో అప్పటి ఎఫ్‌డీఓ శివప్రసాద్ కూడా ఈ అక్రమాలను అంగీకరించినట్లు పాలకవర్గ సభ్యులు తెలిపారు.
నిధుల రికవరీ కోసం కోర్టును ఆశ్రయిస్తాం..
పక్కదారి పట్టిన రూ.50 నుండి రూ.60 లక్షల నిధులను రికవరీ చేసి, తిరిగి సంఘానికి జమ చేసేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో మత్స్య సంఘం డైరెక్టర్లు నీలాల నరసింహారావు, ఊకే రమేష్ (కరాటే), బొందల రాంబాబు, పొదిలి శ్రీనివాసరావు, పాలెపు శ్రీనివాసరావు, కాకా రామచంద్రరావు పాల్గొన్నారు.



