మళ్లీ భారీగా ప్రభుత్వ ఆస్తుల విక్రయం
ఎన్‌ఎంపీ 2.0కు ప్రణాళికలు
న్యూఢిల్లీ : పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందనే నెపంతో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ఆస్తులను, విలువైన ప్రజల భూములను ప్రయివేటు శక్తులకు విక్రయించేందుకు మోడీ సర్కార్ ప్రణాళికలను ముమ్మరం చేసింది. ఇటీవల కొన్ని అత్యవసర ఆర్థిక చర్యల వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, నిధుల కొరత ఏర్పడిందనే సాకుతో ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ (మానిటైజేషన్), పెట్టుబడుల ఉపసంహరణ పేరిట విక్రయాల వేగాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని మంగళవారం అధికారిక వర్గాల సమాచారం. వనరుల సమీకరణ పేరుతో ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించేందుకు సీనియర్ ప్రభుత్వ అధికారులు.. డిపార్టమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్), ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ)లతో వారానికోసారి అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఏకంగా రూ. 80,000 కోట్ల విలువైన ప్రభుత్వ వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. దీనిని మించి దీపమ్ మరిన్ని ప్రభుత్వ సంస్థలను ప్రయివేటుపరం చేయనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఐడీబీఐ బ్యాంక్ అమ్మకం వేగవంతం..
గతంలో విలువ నిర్ణయంపై వచ్చిన వివాదాలు, కొనేందుకు పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడంతో తాత్కాలికంగా బ్రేక్ పడిన ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రతిపాదనను కూడా పూర్తి చేసి ప్రయివేటు, కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు సర్కార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల ఆస్తులను ప్రయివేటు శక్తులకు అప్పగించేందుకు వీలుగా నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపీ.2) కింద రాబోయే ఐదేళ్లలో 2030 మార్చి నాటికి ఏకంగా రూ. 10 లక్షల కోట్ల ఆస్తులను విక్రయించాలని మోడీ సర్కార్ పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంతకుముందు ఎన్‌ఎంపీ 1.0 కింద కూడా దాదాపు రూ. 5.4 లక్షల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను ఇప్పటికే ప్రయివేటు రంగానికి బదిలీ చేశారు.మరోవైపు నేషనల్ ల్యాండ్ మోనిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ) ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన విలువైన మిగులు భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. కేవలం ఆర్థిక సంవత్సరం 2025-26 లోనే సుమారు రూ.10,048 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తుల అమ్మకానికి ఆమోదముద్ర వేశారు. చమురు మార్కెటింగ్ సంస్థలకు ఇటీవలి కాలంలో రూ. 10,000 కోట్లు, అలాగే ఎంఎస్ఎమ్‌ఈ, విమానయాన రంగాల కోసం రూ.18,000 కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ వంటి పథకాలను ప్రకటించడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిందని.. అందుకోసమే ఈ విక్రయాలు జరుపుతున్నామని పాలకులు సమర్థించుకుంటున్నారు. అయితే సంక్షోభాల నెపంతో దేశానికి లాభాలు తెచ్చిపెట్టే ప్రభుత్వ రంగాన్ని, విలువైన భూములను చౌకగా ప్రయివేటు శక్తులకు ధారాదత్తం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మోడీ సర్కార్ భారీ స్కెచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



