Thursday, June 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంన‌మ్మ‌కంతోనే రియల్ ఎస్టేట్ అభివృద్ధి

న‌మ్మ‌కంతోనే రియల్ ఎస్టేట్ అభివృద్ధి

- Advertisement -

ప్ర‌పంచ ఆర్థిక ప‌రిస్థితుల ప్రభావం
రియ‌ల్ ఎస్టేట్ మంద‌గించ‌డానికి
హైడ్రా కార‌ణం కాదు
వినియోగ‌దారుడికి మేలు జ‌ర‌గాలి
మెరుగైన, ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌ న‌గ‌రంగా అభివృద్ధి : టీఆర్ఎఫ్ స‌ద‌స్సులో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగనాథ్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
రియల్ ఎస్టేట్ వ్యాపారం నమ్మకంపై ఆధారపడి అభివృద్ధి చెందుతుందని, ఈ రంగంలో క్రెడిబిలిటీ (విశ్వసనీయత), మంచి రెప్యుటేషన్‌ చాలా ముఖ్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. తెలంగాణ రియల్టర్స్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బేగంపేటలోని ది ప్లాజా హోటల్‌లో బుధ‌వారం నిర్వహించిన రియల్టర్స్ సమ్మిట్ – 2026 కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కేవలం ఒక ప్రాపర్టీని విక్రయించి, కమీషన్ లేదా వ్యాపార లాభాలు పొందడం మాత్రమే లక్ష్యంగా ఉండకూడదన్నారు. వినియోగదారుడికి మంచి, సురక్షితమైన ప్రాపర్టీని అందిస్తున్నామా లేదా అనే బాధ్యత ప్రతి రియల్టర్‌పైనా ఉందన్నారు. మీరు మీ కోసం ఒక ప్లాట్ లేదా ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అదే స్థాయిలో వినియోగదారుడికి ప్రాపర్టీ అందించేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సొంత బిడ్డకు వివాహం చేసేటప్పుడు ఎంత శ్రద్ధ వహిస్తామో, స్థిరాస్తి కొనుగోలు సమయంలో కూడా అంతే జాగ్రత్తగా పరిశీలించాలని కొనుగోలుదారుల‌కు సూచించారు. రియల్ ఎస్టేట్ రంగంలోనే కాదు, మార్కెట్లో నిల‌బ‌డాలంటే పారదర్శకత, నాణ్యత, బాధ్యతాయుతమైన విధానాలు అవసరమన్నారు. రియ‌ల్ ఎస్టేట్ రంగం కాస్త మంద‌గించ‌డానికి హైడ్రా కార‌ణం కాద‌ని స్ప‌ష్టం చేశారు. దేశ‌, ప్ర‌పంచ ఆర్థిక ప‌రిస్థితులు, ఉద్యోగాలు, జీతాలు ఇలా అనేక అంశాలు రియ‌ల్ ఎస్టేట్ రంగంపై ప్ర‌భావం చూపుతున్నాయ‌న్నారు. ఒక్క హైద‌రాబాద్‌లోనే కాదు.. దేశంలోని ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో కూడా రియ‌ల్ ఎస్టేట్ రంగం కాస్త మంద‌గించింద‌నే విష‌యాన్ని గుర్తించాల‌ని కోరారు.

​మార్పు లేనిదే అభివృద్ధి లేదు..
హైద‌రాబాద్‌ను మెరుగైన, ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌ న‌గ‌రంగా మార్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోందని, ఇలాంటి ఆలోచ‌న‌ల నుంచే హైడ్రా అనే సంస్థ‌ను ఏర్పాటు చేసిందని కమిషనర్‌ ‌చెప్పారు. వివిధ శాఖ‌ల‌కు చెందిన‌ అధికారాల‌ను అవ‌స‌రం మేర‌కు క‌ట్ట‌బెట్టి హైడ్రా ద్వారా ఒక మార్పు తీసుకురావాలని ప్ర‌భుత్వం భావిస్తోందని తెలిపారు. మార్పు తీసుకురావాలంటే కొన్ని ప్రాథమిక ఇబ్బందులు ఎదురవుతాయని, అయితే సమాజ ప్రయోజనానికి ఆ మార్పు అవసరమని అన్నారు. ఇటీవ‌ల ఒడిశాలో జ‌రిగిన బ్రిక్స్ స‌మావేశంలో వివిధ దేశాల‌తో పాటు ముఖ్య‌మైన న‌గ‌రాల ప్ర‌తినిధులు హైడ్రా కార్య‌క‌లాపాల‌పై ఆస‌క్తి చూపించారన్నారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను ఎదుర్కోవాలంటే, ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను సాధించాలంటే హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డార‌న్నారు. చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌లో భాగంగా ముందుగా ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించామని, త‌ర్వాత అభివృద్ధి చేశామని, ఇప్పుడు ఆ ఫ‌లాల‌ను స్థానికులు ఆస్వాదిస్తున్నారన్నారు.

మంగ‌ళ‌వారం భారీ వ‌ర్షం కురవగా అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ‌కుంట‌కు భారీగా వ‌ర‌ద నీరు చేరిందని గుర్తు చేశారు. గ‌తంలో ఈ వ‌ర‌ద అక్క‌డ బ‌స్తీల‌ను, కాల‌నీలను ముంచెత్తేదన్నారు. బ‌తుక‌మ్మ కుంట కాదు ఆ స్థ‌లం వారిదని వాదిస్తున్న వారి మాటల్లో నిజం లేద‌నేది హైడ్రా ప‌రిశోధ‌న‌లో వెళ్ల‌డైందని తెలిపారు. చెరువుల‌ను గుర్తించ‌డంతోపాటు వాటి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించ‌డం, పున‌రుద్ధ‌రించ‌డంలో హైడ్రా చాలా శాస్త్రీయంగా ముందుకెళ్తోంద‌ని చెప్పారు. పేద‌వారికి న‌ష్టం లేకుండానే ఇదంతా చేసిందని, బ‌డాబాబులుగా స‌మాజంలో చెలామ‌ణి అవుతూ.. ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డినవారే హైడ్రాపై దుష్ప్ర‌చారం చేస్తున్నారని అన్నారు. హైడ్రా వ‌ల్ల ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌లు తెలుసుకున్నార‌ని చెప్పారు. తెలంగాణ రియల్టర్స్ ఫోరం అధ్య‌క్షులు ప్ర‌వీణ్ ద‌ర‌మ్‌తో పాటు ప‌లువురు ఫోరం ప్రతినిధులు, వ‌సుంధ‌ర బిల్డ్ఎక్స్ అధినేత పీ. ర‌మేష్ బాబుతో పాటు ప‌లువురు రియ‌ల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -