Friday, June 12, 2026
E-PAPER
Homeబీజినెస్బీమా రంగం మందగింపు

బీమా రంగం మందగింపు

- Advertisement -

మేలో 5 శాతం వృద్ధికి పరిమితం
ఎనిమిది నెలల కనిష్టానికి పతనం
ఎల్‌ఐసీ 3 శాతం పెరుగుదల
వెనుకబడిన హెచ్‌‌డీఎఫ్‌‌సీ లైఫ్‌, ఎస్బీఐ లైఫ్‌


నవతెలంగాన – బిజినెస్‌ బ్యూరో
దేశీయ జీవిత బీమా రంగంలో మందగమనం చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా పన్ను మినహాయింపుల మద్దతుతో రెండంకెల వృద్ధిని నమోదు చేసిన బీమా కంపెనీల కొత్త వ్యాపార ప్రీమియం (ఎన్బీపీ) వసూళ్లు ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోయింది. ఏడాదికేడాదితో పోల్చితే మే నెలలో ఈ వృద్ధి కేవలం 5 శాతానికే పరిమితమైందని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.గడిచిన ఎనిమిది నెలలో ఇదే అత్యంత పేలవమైన ప్రగతి కావడం గమనార్హం. గతేడాది జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టడమే ఈ మందగమనానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మందగమనానికి సరిగ్గా నెల రోజుల ముందే జీవిత బీమా సంస్థలు రికార్డు స్థాయి వృద్ధిని సాధించాయి. ఏప్రిల్‌లో ఈ రంగం ఏకంగా 39 శాతం పెరుగుదలతో రూ.30,550 కోట్ల ప్రీమియం వసూలు చేసి.. రెండేండ్ల లోనే అత్యుత్తమ రికార్డును నమోదు చేసింది. కాగా.. మే నెల వచ్చేసరికి ఆ జోరు భారీగా తగ్గింది. గత ఏడాది మే నెలలో రూ.30,463.21 కోట్లుగా ఉన్న కొత్త ప్రీమియం ఆదాయం.. ఈ ఏడాది మే నాటికి రూ. 32,030.84 కోట్లకు చేరింది. కంపెనీలు విక్రయించిన మొత్తం పాలసీల సంఖ్యలో కూడా ఎలాంటి మార్పు లేకుండా 16.7 లక్షలుగానే స్థిరంగా ఉండటం విశేషం.

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ 3 శాతం పెరుగుదలతో రూ.19,042 కోట్ల కొత్త ప్రీమియం వసూలు చేసింది. మరోవైపు 26 సంస్థలతో కూడిన ప్రయివేటు బీమా రంగం సంయుక్తంగా 8 శాతం వృద్ధితో రూ. 12,989 కోట్లు సాధించింది. సెప్టెంబర్ 2025లో కేంద్ర ప్రభుత్వం టర్మ్ ప్లాన్‌లతో సహా వ్యక్తిగత జీవిత బీమా ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపు ఇచ్చిన తర్వాత ఈ రెండు రంగాలు భారీ లాభాలను అర్జించాయి. అయితే ఇప్పుడు ఆ ప్రభావం నెమ్మదించింది. దేశంలోని ప్రముఖ ప్రయివేటు బీమా సంస్థల పనితీరును గమనిస్తే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త వ్యాపార ప్రీమియం 10 శాతం క్షీణించి రూ. 2,668.38 కోట్లకు పడిపోగా, హెచ్‌డీఎఫ్‌‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏకంగా 15 శాతం పతనంతో రూ. 2,577.10 కోట్లను నమోదు చేసింది. వీటికి భిన్నంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ గతేడాది కంటే మెరుగైన ఫలితాలతో రూ. 1,602.64 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించింది. ఇక బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తన ప్రీమియం వసూళ్లను దాదాపు రెట్టింపు చేసుకుని రూ. 1,235.93 కోట్లకు పెంచుకుంది.జీవిత బీమా రంగం మే నెలలో కొంత మందగించినప్పటికీ.. జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ (నాన్-లైఫ్) రంగం మాత్రం ఆర్థిక సంవత్సరం 2026 లో సరికొత్త మైలురాయిని అందుకుంది. హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో లభించిన జీఎస్టీ తగ్గింపుల కారణంగా.. దేశీయ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ స్తూల ప్రీమియం రికార్డు స్థాయిలో రూ. 3.36 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -