ఆ పేరు కవితకు దక్కేనా…
నాదేనంటున్న షోలాపూర్‌కు చెందిన దయానంద్
తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన పేరుతో దరఖాస్తు
ఎవరికీ కేటాయించొద్దంటున్న బీఆర్‌ఎస్
ఈసీఐకి 700 వరకు అభ్యంతరాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టీఆర్‌ఎస్ అనే పేరుతో తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉన్నది. అయితే దేశవ్యాప్తంగా టీఆర్‌ఎస్ అనే పేరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్ అనే పేరుకు సంబంధించిన వివాదం ముదురుతున్నది. ఆ పేరు తమదంటే తమదంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ అనే పేరు ఎవరిది?, ఎవరికి దక్కుతుందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కల్వకుంట్ల కవిత ఈ ఏడాది ఏప్రిల్ 25న తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) పేరుతో పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పేరును ఇచ్చింది. అయినప్పటికీ టీఆర్‌ఎస్ పేరు ఉండడంతో కవితతోపాటు ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే టీఆర్‌ఎస్ అనే పేరుపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ గతనెల ఒకటిన కవిత పలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. దీనిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) లీగల్ సెల్ ఈసీఐకి ఫిర్యాదు చేసింది. టీఆర్‌ఎస్ అనే పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నదని తెలిపింది. ఆ పేరుతో ప్రజల భావోద్వేగాలతోపాటు అనుబంధం ఉందని పేర్కొంది. ఇప్పటికీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గానే ప్రజలు గుర్తిస్తారని వివరించింది. అందువల్ల టీఆర్‌ఎస్ పేరును ఎవరికీ కేటాయించొద్దని ఈసీఐకి విజ్ఞప్తి చేసింది. కవిత స్థాపించిన టీఆర్‌ఎస్ పేరుపై దాదాపు 700 వరకు అభ్యంతరాలు ఈసీఐకి అందాయి.
టీఆర్‌ఎస్ నాదేనంటున్న షోలాపూర్ వాసి
మహారాష్ట్ర షోలాపూర్ చెందిన దయానంద్ మహాదేవ్ టీఆర్‌ఎస్ పేరు తనదేనంటున్నారు. కవిత తెలంగాణ రక్షణ సేన స్థాపించడానికి ముందే తాను తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన (టీఆర్‌ఎస్) అనే పేరుతో దరఖాస్తు చేసినట్టు చెప్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న తాను పలు పత్రికల్లో టీఆర్‌ఎస్ అభ్యంతరాలు తెలియజేయాలంటూ ప్రకటనలు కూడా ఇచ్చానని అంటున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. టీఆర్‌ఎస్ పేరును తనకే కేటాయించాలని ఆయన కోరుతున్నారు.
తెలంగాణలోనూ టీఆర్‌ఎస్ పేరుతో రెండు పార్టీలు
కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్ పార్టీని ప్రకటించడానికి ముందే తెలంగాణలో ఆ పేరుతో మరో రెండు పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలో 14 రాజకీయ పార్టీలు గుర్తింపు పొందాయి. అందులో తెలంగాణ రక్షణ సమితి (డెమొక్రటిక్), తెలంగాణ రాజ్య సమితి పేరుతో రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఉన్నాయి. ఈ పార్టీలు కూడా టీఆర్‌ఎస్ పేరును కవితకు కేటాయించొద్దని ఈసీఐని కోరాయి. టీఆర్‌ఎస్ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు అందడంతో ఏం చేయాలనే దానిపై అధికారులు సమాలోచన చేస్తున్నారు. కవిత పార్టీ ప్రకటించడానికి ముందే టీఆర్‌ఎస్ పేరును ఇతర పార్టీలు వాడుకోవాలని దరఖాస్తు చేయడం, గతంలో వాడిన బీఆర్‌ఎస్ కూడా అభ్యంతరం చెప్పడం వల్ల ఇప్పుడు ఆ పేరు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే కవితకు టీఆర్‌ఎస్ పేరు దక్కేది కష్టమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.



