ఏజెన్సీలకు ఓ రేటు.. దుకాణదారులకు మరో రేటు
చిన్న వ్యాపారులను నిండా ముంచుతున్న కంపెనీలు
ఒకే ఇంజక్షన్‌కు వేర్వేరు ధరలు
పలు మెడికల్ ఏజెన్సీల చేతివాటం
మందుల కంపెనీ ఒక్కటే.. ధరలు వేర్వేరు
మహబూబ్‌నగర్‌లో బయటపెట్టిన
మెడికల్ షాప్ యజమాని
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కంపెనీ ఒకటే మందుల ధరలే వేర్వేరు.. కానీ ఏజెన్సీలకు ఇచ్చే మందులను వేర్వేరు ధరలతో వ్యాపారాలు చేస్తున్నారు. అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్న వారికి ధరలో రాయితీలు ఇస్తూ లాభాలు దండుకుంటున్నారు. పెద్ద దుకాణదారులతో పోటీ పడలేక.. వ్యాపారాలు బంద్ చేసుకోలేక చిన్న వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ఒకే కంపెనీ.. ఒకే బ్యాచ్ నంబర్, ఒకే ఎంఆర్పీ.. ఉన్న ఇంజక్షన్‌ను ఇద్దరు స్టాకిస్టులు వేర్వేరు ధరలకు విక్రయించడం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో మెడికల్ షాపు యజమానులు, స్టాకిస్టులు, ఔషధ కంపెనీల ధరల విధానాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జువెంటస్ కంపెనీకి చెందిన యాంటీబయోటిక్ టివిబాక్ట్ అనే ఇంజక్షన్ కొనుగోలు విషయంలో ధరల తేడాలు గమనించిన మహబూబ్‌నగర్ వీరన్నపేటకు చెందిన ఆల్ నూర్ మెడికల్ షాపు యజమానికి అనుమానం వచ్చింది. అదే బ్యాచ్‌కు చెందిన ఇంజక్షన్‌ను రెండు వేర్వేరు మెడికల్ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేశారు. అయితే రెండు బిల్లుల్లో ధరలు భిన్నంగా ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
మొదట ఒక ఏజెన్సీ నుంచి రెండు ఇంజక్షన్లు కొనుగోలు చేసిన అనంతరం ధరపై సందేహం రావడంతో, అదే ఇంజక్షన్‌ను మరో ఏజెన్సీ నుంచి కొనుగోలు చేశారు. రెండింటినీ పరిశీలించగా ఒకే ఉత్పత్తికి వేర్వేరు రేట్లు ఉండటం బయటపడింది. ఈ సందర్భంగా మెడికల్ షాపు యజమాని మాట్లాడుతూ.. ”ఒక్క ఇంజక్షన్ దగ్గరే ఇంత ధర వ్యత్యాసం ఉంటే, మిగతా మందుల విషయంలో ఎంత దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మేము ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి వ్యాపారం నిర్వహిస్తుంటే, కొందరు స్టాకిస్టులు ఒకే మందును వేర్వేరు ధరలకు విక్రయిస్తూ భారీ లాభాలు పొందుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వినియోగదారుల ఫోరంను ఆశ్రయించనున్నట్టు ఆయన తెలిపారు. ఇదే అంశంపై స్టాకిస్టులను వివరణ కోరగా.. ”ధరల వ్యత్యాసానికి ప్రధాన కారణం కంపెనీల విక్రయ విధానాలే. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ఒక ధర, తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తే మరో ధర విధిస్తున్నారు. దీంతో మేం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం..” అని స్టాకిస్టులు తెలిపారు. దీనిపై మహబూబ్‌నగర్ పట్టణంలోని మెడికల్ షాపు యజమానులు, స్టాకిస్టులు, ఔషధ కంపెనీల మధ్య ధరల విధానాలపై వివాదం ముదురుతోంది. సంబంధిత అధికారులు, ఔషధ నియంత్రణ శాఖ, వ్యాపార సంఘాలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
మాఫియా ఆగడాలు
మందుల వ్యాపారంలో మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరుగుతు న్నాయి. అన్‌లైన్‌లో తెప్పించుకున్న మందులకు ధర మరింత తక్కువగా ఉంటుం ది. ఈ మందుల విషయంలో నాణ్యత, భరోసా వంటి వాటిపై అనేక సందేహాలు న్నాయి. ముఖ్యంగా ప్రతిరోజూ కోట్లలో జరిగే ఈ వ్యాపారంలో అనేక అనుమానా లొస్తున్నాయి. హోల్ సేల్‌గా విక్రయించే మందులకు, రిటైల్‌గా అమ్మే మందుల ధరల్లో తేడా ఉంటే చిన్న దుకాణదారులు తీవ్రంగా నష్టపోతారు. మందుల అమ్మకాల్లో తేడా చూయిస్తే హైదరాబాద్‌లాంటి ప్రధాన నగరాలతో గద్వాల వంటి మారుమూల ప్రాంతాలతో పోల్చితే దూర ప్రాంతాల్లో ఉండే దుకాణదారులు తీవ్రంగా నష్టపోతారు. దీని ప్రభావం అక్కడ మందులను ఉపయోగించుకునే పేదలపై పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మందుల అమ్మకాలలో తేడా ఉండరాదు
వాకిట అశోక్‌కుమార్, మెడికల్ దుకాణదారుల సంఘం రాష్ట్ర నాయకులు మహబూబ్ నగర్ అధిక మొత్తంలో మందులను కొనుగోలు చేసే వారికి తక్కువ ధర.. తక్కువ మందులను కొనుగోలు చేసే వారికి ఎక్కువ ధర అమ్మడం ఆరోగ్యదాయకం కాదు. మానవీయ కోణంలో పరిశీలించి అందరికీ ఒకే ధరలో మందులు వచ్చేలా నిర్ణయం జరగాలి. దీనిని పరిగణలోకి తీసుకొని విధానపరమైన నిర్ణయం జరగాలి. లేనిచో పేదల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.



