ఎన్నికలు ముగిసాయి. ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వీటిలో అత్యధికం హస్తానికే మొగ్గు చూపుతూ తమ అంచనాలను వెల్లడించాయి. ఇవి ఎంత వరకు నిజమవుతాయో తెలియదుగానీ, వీటితో నిమిత్తం లేకుండా ప్రధాన పోటీదారులు ఎవరికివారు తమదంటే తమదే విజయమని బీరాలు పలుకు తున్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమైవున్న ప్రజాతీర్పు రేపు వెలువడాల్సి వుండ గానే… ఎల్లుండే క్యాబినెట్ అని ఒక పక్షం, తొమ్మిదిన ప్రమాణస్వీకారం, అదేరోజు క్యాబినెట్ అని మరోపక్షం ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్న తీరు విస్తుగొలుపుతోంది! ఇటువంటి రాజకీయా లన్నీ అసంబద్ధ గారడీలే అనడానికి ఇదో తాజా ఉదాహరణ. ఇదిలా ఉండగా దీనికి మించిన వాదనలూ ప్రతి వాదనలు, సవాళ్లూ ప్రతిసవాళ్లతో మీడియా ఈ తతంగాన్ని మరింత రక్తికట్టిస్తోంది. జనంలో కూడా ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. తెల్లవారితే గెలిచేదెవరో ఓడేదె వరో తేలిపోతోంది. అయినా ఇదో ప్రహసనం!
ఎన్నికలన్నాక ఎవరో ఒకరు గెలవడం, మరొకరు ఓడటం సహజం. కానీ తరువాత జరిగేదేమిటి? జనానికి ఒరిగేదేమిటి? ఈ ప్రశ్నకు ఏ మీడియా చర్చలోనూ తావులేకపోవడం గమనార్హం. నిజంగా ఎన్నికలైపొయినాక ఏం జరుగుతుంది? దీనికి సమధానం ప్రఖ్యాత పాత్రికేయులు కె.ఎన్.వై.పతంజలిగారి మాటల్లో చెప్పుకోవాలంటే..
”ఎన్నికలైపోయాక దేశం
దగాపడిన ఓ ఆడకూతురిలా ఉంటుంది.
చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలా ఉంటుంది.
ఎన్నికలైపోయినాక ఏమవుతుందంటే…
మనకు భోజనం లేదని గుర్తొస్తుంది.
మనకు ఉపాధిలేదని తెలిసొస్తుంది.
తెలిసి తెలిసీ అయిదేళ్లకోసారి మోసపోవడం గూర్చి ఏడుపొస్తుంది.
ఎన్నికల పతాకాలు విప్పేసిన తరువాత, గుడారాలు పీకేసిన తరువాత,
పట్టాభిషేక మహోత్సవాలు ముగిసిన తరువాత…
తుపాకీ ఇంకా మనకేసే గురిపెట్టి ఉందని తెలుస్తుంది.
మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది.”
నిజానికి ఈ దేశంలో ప్రజాస్వామ్యమనేది ప్రజలందరికీ ప్రత్యక్షంగా అనుభవంలోకొచ్చే ఒకే ఒక సందర్భం ఎన్నికలు. ఈ సందర్భాలు అనేకం వచ్చాయి, వస్తూనే ఉంటాయి. అయితే ఏ సందర్భంలోనూ ఓటును స్వేచ్ఛగా స్వతంత్రంగా వినియోగించుకోలేని దుస్థితి మన ప్రజలది. ప్రతీ సందర్భంలోనూ ప్రధాన పోటీదారులంతా ప్రజా వ్యతిరేకులే అయితే ఏం చేయాలి? ఎవరికి ఓటేయాలి? ”ఏ రాయి అయి తేనేం పల్లూడగొట్టుకోవడానికి” అన్నట్టుగా.. ఇష్టమున్నా లేకున్నా వారిలోనే ఎవరినో ఒకరినిని ఎంచుకోక తప్పని స్థితి. ఇది చాలదన్నట్టు గుట్టలు గుట్టలుగా కరెన్సీ కట్టలు, సందుసందునా మందు బాటిళ్లు మూకుమ్మడిగా దాడి చేస్తుంటే ఎటూ పాలుపోని స్థితి! ఎన్నడూ ఎండ కన్నెరుగని నేత గణమంతా వీధివీధీ తిరిగి జనాన్ని తమ ఉద్రేక ప్రసంగాలతో వూగించాక, మతాన్ని రెచ్చగొట్టి, కులాన్ని మభ్యపెట్టి, ఆలోచనలను జోకొట్టి… ప్రలోభాల్లో ముంచెత్తి, స్వేచ్ఛగా ఎంచుకునే అవకాశమే లేకుండా చేశాక ప్రజలకు మరోదారేది? చివరికి వారిని డబ్బులిస్తే తప్ప ఓటు వేయలేమనే స్థితికి దిగజార్చారు కదా ఈ ”రాజకీయులు”..! అయినా చోద్యం చూస్తూ ప్రవచనాలు వల్లించడమే తప్ప ఈ అవాంఛనీయతను నివారించలేని ఎన్నికల వ్యవస్థది మరో అవస్థ. అన్నింటికీ మించిన విషాదమేమంటే… ఈ అశుద్దాలన్నీ కలిసి నిజాయితీగా ప్రజలకోసం బరిలో నిలిచే నేతలను వారి దరికే చేరని వ్వడంలేదు. ప్రజల పట్ల నిబద్దతతో నిజాయితీతో విలువలకు, విధానా లకు కట్టుబడి నడుచుకునే రాజకీయ శక్తులకు ఇది అవరోధంగా మారడం విచారకరం. ఇది తొలగనంతకాలం గెలిచేదెవరైనా ప్రజలు ఓడిపోతూనే ఉంటారు.
బూర్జువా పార్టీలు ఏవైతేనేం, అభ్యర్థులు ఎవరైతేనేం… ఎన్నికల బరిలో నిలువడానికి వాళ్లకున్న ఆస్తులూ, వాటి వెను కున్న చీకటి వ్యాపారాలే కదా ప్రామాణికాలు! అందుకే గెలిచేదెవరైనా ప్రజాభిప్రాయానికి ఆకాంక్షలకు అవకాశమేలేని ”ప్రజాస్వామ్యం” వర్థిల్లుతోందీ దేశంలో! ఫలితంగా ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగంగా పరిష్కారం కావాల్సిన ప్రతి చిన్న సమస్యకూ ప్రజలు రోడ్ల మీదికి వచ్చి పోరాడాల్సి వస్తోంది. ఉదాహరణకు గడిచిన ఐదేండ్ల కాలంలో రాష్ట్రంలోగాని, దేశంలోగాని వీధుల్లో జరుగుతున్న పోరాటాల్లోని డిమాండ్లన్నిటినీ ఒక్కచోట చేర్చి చూస్తే… అవన్నీ రాజ్యాంగ పరిధిలోనివే. అసలు వాటిని ప్రజలు అడగనక్కరలేదు. వాటికవే పరిష్కారం కావాల్సినవి. కానీ జరుగు తున్నదేమిటీ? ఏనాడైనా అసెంబ్లీల్లో, పార్లమెంట్‌లో ఈ డిమాండ్లు కనీస చర్చకు నోచుకుంటున్నాయా? మనమేదో రాజ్యాంగబద్ధ పాలన, ప్రజాస్వామ్య ప్రక్రియంటూ ముచ్చట పడుతుంటాం కానీ… ఎన్నికల్లోనే కాదు, వాటిద్వారా ఏర్పడే చట్ట సభల్లో, పాలనా ప్రక్రియల్లో కూడా ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు చోటులేకుండా పోతోంది. ఈ చేదు నిజాన్ని గుర్తించి మేలుకోకపోతే చూపుడు వేలుకు అంటిన సిరా చుక్క మన పౌరధర్మాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది.