Sunday, June 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినవ్విపోదురుగాక…

నవ్విపోదురుగాక…

- Advertisement -

నిన్న మిత్రుడొక పోస్టు పంపాడు నాకు. అందులో ఏముందంటే, “సింహం జీవితకాలం పదిహేనేండ్లు. గాడిద జీవితకాలం నలభైయేండ్లు ఎక్కువకాలం జీవించడంలో గాడిద సింహం రికార్డును బ్రేక్ చేసిందని గాడిదలు అన్నీ కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాయట. అయితే అసలు వాటికి అర్థం కాని విషయం ఏంటంటే, సింహం పదిహేనేండ్లు బతికినా ఎప్పుడూ ఎవరికీ భయపడదు. తలవంచదు. గాడిద మాత్రం దాని నలభైయేండ్లు ఎప్పుడూ ఎవరికీ ఒకరికి వెట్టిచాకిరి చేయాల్సిందే. బానిసగా బతకాల్సిందే!” (నిజంగా గాడిదలకు ఈ విషయాలేవీ తెలియవు, పట్టవు.) ఈ పోలికలన్నీ మనుషులుగా మనమే పోల్చుకుని నవ్వుకుంటాం. గతంలో చిన్నయ సూరిగారు నీతికథలను జంతువుల, పక్షుల పాత్రలతో మనుషుల దుర్నీతులను, నీతిని ప్రబోధించి పెద్ద ప్రభావాన్నే కలిగించారు. వాటిల్లో ఉన్న సారాన్ని తీసుకుని ఇప్పటి పరిస్థితులను వ్యక్తులను సరిచూసుకోవటం చేయాలి తప్ప జంతువులను కించపరచకూడదు. ఆ నీతిని పాటించాలి. నిజంగా ఆయా జంతువులకు మాటలు వస్తే, ఎన్ని సంగతులు మనకు తెలిసొచ్చేవో! అయినాకాని కొన్ని పోలికలు వందశాతం మనుషులకు సరిపోతాయి.ఆ మధ్య వైఎస్సార్ బతికున్న రోజుల్లో శాసనసభలో మాట్లాడుతూ “పందిలా పదేండ్లు బతకటమెందుకయ్యా, నందిలా నాలుగేండ్లు బతికితే చాలదా!” అనేవాడు ప్రతిపక్షనాయకుడిగా. ఈ అన్ని పోలికలూ చెప్పేదేమి టంటే, బతకటం కాదు, రికార్డులు బ్రేక్ చేయడం కాదు, ఎలా బతికాము, ఎంత స్వేచ్ఛగా, ధీరోదాత్తంగా బతికాము అనేది చాలా ముఖ్యం.

అలా చూసినపుడు, ఇపుడు గంభీరాలు పలికే సన్నాసులకు అసలు విషయం బోధపడదు. మనమెంత పాతాళంలో ఉన్నామో, దిగజారుతున్నామో చెప్పేదాకా తలకెక్కదు! ఈ ఉదాహరణలు, పోలికలు విన్నపుడు మన నాయకుల, దేశం పరిస్థితులు ఎట్లున్నారో, ఎట్లుందో ఒకసారి పరిశీలించు కోవాలి. అత్యంత ధైర్యవంతుడైన నాయకుడని, బలమైన నేత అని, విశ్వ గురు అని పెద్దపెద్ద మాటలతో భ్రమలు కల్పిస్తూ ప్రజలను వంచిస్తున్నారని ఏ కాస్త ఆలోచించేవారికైనా ఇట్టే తెలిసిపోతుంది. అందుకు అనేకం ఉదహరించవచ్చు. బలమైన నాయకుడు అంటే దేశ ప్రయోజనాలకు, ప్రజలకు ప్రమాదం కలిగినపుడు మౌనంగా ఉండేవాడు, మాట్లాడటానికే భయపడేవాడుగా ఉంటాడా? నిన్నగాక మొన్న హర్మూజ్ జలసంధి సమీపంలో ఓమన్ తీరంలోని భారతీయ నావికా సిబ్బందితో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు నావికులు మృతిచెందారు. అందులో విశాఖ నావికుడూ ఉన్నారు. 24 మందితో ఉన్న నౌకలో 21 మంది ఓమన్ సహకారంతో బతికి బయటపడ్డారు. అమెరికా చర్యలను విదేశాంగశాఖ తప్పు పట్టిందేతప్ప, మన ప్రధాని ఒక్కమాటా మాట్లాడలేదు, ఖండించలేదు. ఈ దాడులను ఇరాన్ వెంటనే ఖండించింది. అమెరికా దాడిలో భారతీ యులు ప్రాణం కోల్పోయినా మన రాజీపడిన, అగ్రరాజ్యానికి ఊడిగం చేస్తున్న ప్రధాని మాత్రం పల్లెత్తుమాట మాట్లాడలేడు. ఇది ధీరత్వం కాదు బీరత్వం.

భరతమాత బిడ్డలను పొట్టన పెట్టుకున్న వారిపై ఒక్కమాటా ఖండన లేకపోవటం కూడా దేశభక్తి అంటారా? వాళ్లు చెప్పే దేశభక్తి ఇదేనా! ఇక విశ్వగురువు అని ఓ పెద్ద డంబాచారం! అక్రమంగా అమెరికా చేసిన ఈ దాడిని, హత్యలను ప్రపంచంలోని ఏ దేశమూ ఖండించలేదు. ఒక్క ఇరాన్ తప్ప ఒక్కటంటే ఒక్క దేశమూ ఖండించకపోవడం చూస్తే, మన దేశం పట్ల ఇతర దేశాలు ఎంత సౌహార్థంగా ఉన్నాయో! మనగురువు పరపతి ఎంతగొప్పగా ఉందో తేటతెల్లమవుతుంది. ఇక ఇప్పుడు ట్రంప్ మాత్రం ఆ దాడి ఇరానే చేసిందని బుకాయిస్తున్నాడు. నిజానికి ఈ దాడులు చేసింది మేమే అని ఇంతకుముందే అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ స్వయంగా ప్రకటించింది. మనకో లత్కోర్ సాబ్ కళారూపం ఉంది. ట్రంప్ ప్రపంచ లత్కోర్ సాబ్ అయితే మన నాయకుడు దేశీయ లత్కోర్‌సాబ్. పిట్టల దొరలాంటి ప్రగల్బాలు పలుకుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్లను చూసే ఆ కళారూపం తయారు చేసుంటారు పూర్వీకులు. ఇరవై రెండు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పరీక్షలు నిర్వహించలేనోళ్లు, సి.బి.ఎస్.సి. పరీక్షలు జరుపలేనోళ్లు, లక్షలాది మంది నిరుద్యోగులను పకోడీలు చేసుకుని బతకమనేటోళ్లు వాస్తవాలు బయటి కొస్తాయని భయపడి, ఈవిఎమ్‌లనే తగలేసేటోళ్లు, మేము రికార్డులు బ్రేక్ చేస్తున్నాం, ధీరులం అంటే! ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అనుకోవడమేగా!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -