లిటిల్ సైంటిస్ట్
ప్రయోగానికి కావలసిన వస్తువులు: క్యాండిల్స్, అగ్గిపెట్టె, గాజు గ్లాసు.
ప్రయోగం చేయు విధానం: హల్లో పిల్లలు.. ఈ ప్రయోగం కోసం వివిధ పొడవులు గల మూడు క్యాండిల్స్‌ను తీసుకొని వెలిగించి, వెలుగుతున్న క్యాండిల్స్ మీద గాజు గ్లాసును బోర్లిస్తే ఏమి జరుగుతుందో ఆలోచించండి. మూడు క్యాండిల్స్ ఒకేసారి ఆరిపోతాయా? లేకపోతే మూడు క్యాండిల్స్ వేర్వేరు సమయాల్లో ఆరిపోతాయా? వేర్వేరు సమయాల్లో ఆరిపోతే ఏ క్యాండిల్ త్వరగా ఆరిపోతుందో ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ప్రయోగం చేసి, మీ ఆలోచన సరైనదా కాదా తెలుసుకోండి.
ప్రయోగ వివరణ : ప్రయోగం చేసి ఉంటారు కదా! గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ తో పాటు ఇతర వాయువులు ఉంటాయి. గాలిలో ఉన్న ఆక్సిజన్ వాయువు క్యాండిల్ మండడానికి ఉపయోగపడుతుంది. మూడు క్యాండిల్స్‌ను వెలిగించి వాటి మీద గ్లాసును బోర్లించినప్పుడు, మూడు క్యాండిల్స్ ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని మండుతుంటాయి. ఈ మండే క్రమంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు తయారవుతుంది. తయారైన కార్బన్ డయాక్సైడ్ వేడి వలన పైకి వెళుతుంది. ప్రయోగం జరుగుతున్నప్పుడు పై భాగంలో కార్బన్ డయాక్సైడ్ ఉండి, కింది భాగంలో కొంత ఆక్సిజన్ ఉంటుంది. పై భాగంలో ఆక్సిజన్ లేకపోవడం వలన పొడవుగా ఉన్న క్యాండిల్ మొదటగా ఆరిపోతుంది. ఆ తర్వాత మధ్యస్థంగా ఉన్న క్యాండిల్ ఆరిపోతుంది. ఆఖరికి మొత్తం ఆక్సిజన్ అయిపోవడం వలన పొట్టిగా ఉన్న క్యాండిల్ కూడా ఆరిపోతుంది.
వాస్తవ జీవిత ఉదాహరణ : అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏర్పడిన కార్బన్ డయాక్సైడ్ రూమ్ లోపల పై భాగంలో ఉంటుంది. క్రింది భాగంలో కొద్ది మొత్తంలో ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు మనం నడుచుకుంటూ బయటికి వస్తే మనకు ఆక్సిజన్ అందదు. పాక్కుంటూ బయటకు వస్తే కొద్ది మొత్తంలో ఆక్సిజన్ అందవచ్చు. కాబట్టి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనం పాక్కుంటూ బిల్డింగ్ బయటికి వస్తాము.
వాలుగొండ వెంకటేశ్వర్లు



