Sunday, February 15, 2026
E-PAPER
Homeప్రత్యేకంమాతృభాష మన అస్తిత్వానికి పునాది

మాతృభాష మన అస్తిత్వానికి పునాది

- Advertisement -

మాతృభాష – మన అస్తిత్వానికి పునాది. మనిషి అస్తిత్వానికి ఊపిరి పోసేది భాష. ఆలోచనలకు ఆకారం, భావాలకు స్వరం,అనుభూతులకు అర్థం కల్పించేదిభాషే.భాష లేకపోతే మన భావ ప్రపంచం నిశ్శబ్దమైపోతుంది,మన ఆలోచనా ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోతుంది.అందుకే ప్రతి మనిషి జీవనయాత్రలో మాతృభాషకు అత్యున్నత స్థానం ఉంటుంది.మనం ఈ లోకాన్ని మొదట పలకరించే మాట ‘అమ్మ’. ఆ ఒక్క పదంతోనే మన భాషా ప్రయాణం ప్రారంభమవుతుంది.తల్లి ఒడిలో నేర్చుకున్న ఆ తొలి మాటలే జీవితాంతం మన వ్యక్తిత్వానికి పునాది రాళ్లవుతాయి,మన ఆలోచనా విధానానికి దిశానిర్దేశం చేస్తాయి.

మాతృభాష కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాదు, అది మన సంస్కృతికి వాహకము,చరిత్రకు జీవంత సాక్ష్యం,భవిష్యత్తుకు మార్గదర్శక దీపం,ప్రతి సమాజానికి మాతృభాష ఒక ఆత్మగౌరవ ప్రతీక. భాష ద్వారానే మన సంప్రదాయాలు, ఆచారాలు,జీవన విధానం తరతరాలకు సంక్రమిస్తాయి. భాష నశిస్తే, ఆ భాషతో ముడిపడిన సంపూర్ణ జీవన తత్వమే మాయమవుతుంది.
మనిషి తన మాతృభాషలో ఆలోచించినప్పుడే అతని ఆలోచనలు సహజంగా, స్వచ్ఛంగా, సృజనాత్మకంగా వికసిస్తాయి.ఇతర భాషల్లో భావవ్యక్తీకరణ సాధ్యమైనప్పటికీ, మాతృభాషలో కలిగే లోతు,అనురాగం,భావోద్వేగ స్పర్శ మరే భాషలోనూ అంతగా ప్రతిఫలించవు. అందుకే మాతృభాష మన మానసిక వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి మూలాధారం.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం – చారిత్రక నేపథ్యం
ప్రపంచవ్యాప్తంగా భాషల ప్రాముఖ్యతను గుర్తించేందుకు యునెస్కో ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. దీని వెనుక ఉన్న చరిత్ర ఎంతో త్యాగపూరితమైనది. 1952లో అప్పటి తూర్పు పాకిస్థాన్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌)లో బంగ్లా భాషను అధికార భాషగా గుర్తించాలనే డిమాండ్‌తో విద్యార్థులు ఉద్యమించారు. ఆ ఉద్యమంలో పలువురు యువకులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాన్ని స్మరిస్తూ, భాషల పరిరక్షణ అవసరాన్ని ప్రపంచానికి చాటేందుకు యునెస్కో 1999లో ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.

ఈ దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది – భాష అనేది కేవలం సమాచార మార్పిడి సాధనం మాత్రమే కాదు, అది ఒక సంస్కృతీ సంపద. భాష పరిరక్షణ అంటే కేవలం ఒక మాటల వ్యవస్థను కాపాడటం కాదు,ఒక జీవన విధానాన్ని, ఒక ఆలోచనా ధారను, ఒక చారిత్రక వారసత్వాన్ని కాపాడటమే.”అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం-2026థీమ్‌ బహుభాషా విద్య యొక్క భవిష్యత్తును నిర్మించడంలో యువత కీలక పాత్రను స్పష్టంగా రేఖాంకితం చేస్తోంది”యువత స్వరాల ద్వారా వ్యక్తమయ్యే బహుభాషా విద్య సందేశం – భాష అనేది కేవలం సమాచార మార్పిడికి ఉపయోగించే సాధనం మాత్రమే కాదని, అది వ్యక్తిగత గుర్తింపుకు ప్రతీకగా, జ్ఞానాభ్యాసానికి ఆధారంగా, మానసిక శ్రేయస్సుకు మూలంగా, సమాజంలో సార్థక భాగస్వామ్యానికి శక్తివంతమైన సాధనంగా నిలుస్తుందని బలంగా చాటిచెబుతోంది.

ప్రపంచ భాషల స్థితి -అంతరించిపోతున్న స్వరాలు
ప్రపంచంలో సుమారు 7,000 భాషలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తల అంచనా. అయితే ఈ భాషల్లో సగానికి పైగా ప్రమాదస్థితిలో ఉన్నాయి. ప్రతి రెండు వారాలకు ఒక భాష అంతరించిపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి.అంటేప్రతి ఏడాది సుమారు ఇరవై ఐదు భాషలు శాశ్వత మౌనంలో కలిసిపోవడం – మానవ నాగరికత ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సాంస్కృతిక సంక్షోభానికి నిదర్శనం. భాష అంతరించిపోతే, దానితో పాటు ఆ భాషలో దాగి ఉన్న జ్ఞానం,చరిత్ర, సాంస్కృతిక సంపద కూడా శాశ్వతంగా కోల్పోతాం.అడవుల్లో నివసించే గిరిజన తెగల భాషలు, చిన్నచిన్న సమాజాల భాషలు, ప్రాచీన భాషా రూపాలు వేగంగా అంతరించిపోతున్నాయి. ఆధునికీకరణ, నగరీకరణ, గ్లోబలైజేషన్‌ ప్రభావాల వల్ల చిన్న భాషలు పెద్ద భాషల ఒత్తిడికి లోనై తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. ఇది కేవలం భాషాపరమైన సమస్య కాదు,ఇది మానవాళి సంస్కృతిక సంపదకు ముప్పు.

యునెస్కో నివేదిక – హెచ్చరిక
యునెస్కో మరియుఅట్లాస్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలోని సుమారు 40 శాతం భాషలు అంతరించిపోతున్న ప్రమాదంలో ఉన్నాయి. ప్రతి రెండు వారాలకు ఒక భాష మౌనంలో కలిసిపోతుండటం, మానవ సంస్కృతి ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాలుగా నిలుస్తోంది. ఇటీవల అంతరించిపోయిన భాషలు: యాఘాన్‌ (చిలీ), బో (అండమాన్‌ — భారత్‌), ఇయాక్‌ (అలాస్కా – అమెరికా), లివోనియన్‌ (లాట్వియా).

మాతృభాష -మేధో వికాసానికి జీవస్రవంతి
విద్యా వ్యవస్థలో మాతృభాష పాత్ర అత్యంత కీలకమైనది. మాతృభాషలో విద్యాభ్యాసం పొందిన విద్యార్థి విషయాన్ని సహజంగా,సులభంగా,లోతుగా గ్రహిస్తాడు.అతని ఆలోచనా శక్తి స్పష్టతను సంతరించుకుంటుంది; భావవ్యక్తీకరణలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి — ప్రాథమిక విద్య మాతృభాషలో అందించినప్పుడు విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యం గణనీయంగా పెరిగి, వారి సమగ్ర వికాసానికి బలమైన పునాది పడుతుంది. ఇంగ్లీష్‌ లేదా ఇతర భాషల్లో నేరుగా విద్య ప్రారంభించడం వల్ల అనేక మంది పిల్లలు విషయాన్ని పూర్తిగా గ్రహించలేక మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇది వారి విద్యా ప్రయాణాన్ని మందగింపజేసి, అభ్యాసంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకే మాతృభాషను బుద్ధి వికాసానికి పునాదిగా చేసుకుని, దానిపై ఆధారపడి క్రమంగా ఇతర భాషలను నేర్పడం శాస్త్రీయంగా, విద్యావిధానపరంగా అత్యంత సమంజసమైన మార్గంగా పరిగణించబడుతోంది.

తెలుగు భాష -మన సంస్కృతికి జీవనాడి
తెలుగు భాషకు వేల సంవత్సరాల స్వర్ణయుగాల సాక్ష్యమైన ఘన చరిత్ర ఉంది. నన్నయ్య, తిక్కన, యెర్రాప్రగడలతో ఆరంభమైన కావ్య పరంపర, కాలగమనంలో ఎన్నో మలుపులు తిరిగి ఆధునిక యుగం వరకూ నిరంతరంగా ప్రవహిస్తోంది. శ్రీనాథుని కవితా వైభవం, పోతన భక్తి సరళి, తెనాలి రామకష్ణుని చమత్కార బుద్ధి, గురజాడ అప్పారావు సామాజిక చైతన్యం, శ్రీశ్రీ విప్లవాత్మక స్వరం, దాశరథి కవిత్వంలోని భావోద్వేగ గాఢత -ఇవన్నీ కలిసి తెలుగు సాహిత్యాన్ని అపూర్వంగా సుసంపన్నం చేశాయి.

కవిత్వం నుంచి కథ, నవల నుంచి నాటకం, వ్యాసం నుంచి జానపదం వరకూ ప్రతి సాహిత్య ప్రక్రియలో తెలుగు తన విశిష్టతను చాటుకుంది. గ్రామీణ జీవనపు సుగంధం నుంచి పట్టణ సంస్కృతిలోని ఆధునిక ఆలోచనల వరకూ, శ్రమజీవుల వేదన నుంచి మేధావుల మేధస్సు ప్రయాణం వరకూ — మానవ జీవనంలోని ప్రతి కోణాన్ని తెలుగు భాష సున్నితంగా, సజీవంగా, సమర్థంగా వ్యక్తపరిచింది. అందుకే తెలుగు భాష ఒక భాష మాత్రమే కాదు – అది తరతరాల సాంస్కృతిక వారసత్వం.

ఆధునికత ముసుగులో మసకబారుతున్న మాతృభాషలు
నేటి గ్లోబలైజేషన్‌ యుగంలో ఇంగ్లీష్‌ భాష ప్రాధాన్యం అనివార్యంగా పెరుగుతోంది. అంతర్జాతీయ సంభాషణ, ఉద్యోగావకాశాలు, సాంకేతిక అభివృద్ధి వంటి కారణాల వల్ల ఇది అవసరమే. అయితే ఈ అవసరం పేరుతో మాతృభాషను పక్కన పెట్టడం ఒక ప్రమాదకర ధోరణిగా మారుతోంది. ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలతో ఇంగ్లీష్‌లోనే మాట్లాడటం ప్రతిష్ఠగా, ఆధునికతకు ప్రతీకగా భావించడం సామాజికంగా ఆలోచించాల్సిన అంశం. దీని ప్రభావంగా పిల్లలు తమ మాతృభాషలో భావాలను స్పష్టంగా వ్యక్తపరచలేని స్థితికి చేరుకుంటున్నారు. ఇది వారి ఆలోచనా సామర్థ్యాన్ని, సృజనాత్మకతను, భావజాల వికాసాన్ని ప్రభావితం చేస్తోంది. భాష అనేది కేవలం సమాచార మార్పిడికి మాత్రమే కాక, వ్యక్తిత్వ నిర్మాణానికి మూలాధారం.

మాతృభాష నుంచి దూరమవడం వల్ల పిల్లలు తమ సాంస్కృతిక మూలాలతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు -సామాజిక, సాంస్కృతిక సంక్షోభానికి సంకేతం. మాతృభాష పట్ల నిర్లక్ష్యం పెరిగితే, తరతరాలుగా వచ్చిన జ్ఞాన సంపద, జానపద సంప్రదాయాలు, మౌఖిక సాహిత్యం, విలువ వ్యవస్థ క్రమంగా నశించే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల సమాజం తన అసలైన గుర్తింపును కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే మాతృభాషను విద్య, కుటుంబం, సమాజం – ఈ మూడు స్థాయిల్లో పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఆధునికతను అంగీకరిస్తూనే, సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకోవడం సమతుల్య సమాజ నిర్మాణానికి అత్యంత కీలకం.

తల్లిదండ్రులే భాషా వారసత్వానికి వారధులు
మాతృభాష పరిరక్షణలో కుటుంబం పాత్ర అత్యంత కీలకం. పిల్లలు మొదట భాష నేర్చుకునేది ఇంట్లోనే. తల్లిదండ్రులు పిల్లలతో మాతభాషలో మాట్లాడటం, కథలు చెప్పడం, పాటలు వినిపించడం, పుస్తకాలు చదివించడం ద్వారా భాష పట్ల ప్రేమను పెంపొందించవచ్చు.పండుగలు, కుటుంబ సమావేశాలు, సామాజిక కార్యక్రమాల్లో మాతృభాష వాడకాన్ని ప్రోత్సహించాలి. భాష అనేది పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా, జీవన విధానంగా మారాలి.

పాఠశాలలు – భాష వికాసానికి సృజనాత్మక కేంద్రాలు
మాతృభాష అభివృద్ధిలో పాఠశాలల పాత్ర అత్యంత కీలకమైనది. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో పాఠశాల ఒక ప్రధాన వేదిక. ఇక్కడే విద్యార్థులు భాషను కేవలం పాఠ్యాంశంగా కాకుండా, ఆలోచనకు సాధనంగా, సృజనాత్మకతకు ఆధారంగా నేర్చుకుంటారు. మాతృభాషలో బోధన ద్వారా విద్యార్థులు విషయాన్ని లోతుగా గ్రహించగలుగుతారు. వారి ఆలోచనా శక్తి, విశ్లేషణ సామర్థ్యం, భావ వ్యక్తీకరణ నైపుణ్యం సమగ్రంగా అభివద్ధి చెందుతాయి.

పాఠశాలల్లో సృజనాత్మక రచనలకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం అత్యంత అవసరం. వ్యాస రచన, కథా రచన, కవిత్వ సృష్టి, వక్తత్వ పోటీలు, వాదవివాదాలు, నాటక ప్రదర్శనలు, కవితా పఠన కార్యక్రమాలు విద్యార్థుల్లో భాషా నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక చైతన్యాన్ని కూడా పెంచుతాయి. భాషను ప్రేమించే భావనను పిల్లల హృదయాల్లో నాటేందుకు ఇవి బలమైన సాధనాలుగా నిలుస్తాయి.

అదేవిధంగా పాఠశాల గ్రంథాలయాల్లో మాతృభాష పుస్తకాల సంఖ్యను పెంచడం, ప్రముఖ రచయితల రచనలను పరిచయం చేయడం, భాషా దినోత్సవాలను ఉత్సాహంగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో భాష పట్ల గౌరవం పెరుగుతుంది. ఉపాధ్యాయులు మాతృభాషను ఆదర్శంగా ఉపయోగిస్తూ బోధన చేస్తే, విద్యార్థులు సహజంగా భాషను అలవరుచుకుంటారు.అంతిమంగా చెప్పాలంటే – పాఠశాలలు మాతభాషకు కేవలం బోధనా కేంద్రాలే కాకుండా, భాషా సంస్కరణకు, సృజనాత్మక వికాసానికి కేంద్రాలుగా మారాలి. అప్పుడే మాతృభాష భవిష్యత్‌ తరాలలో సజీవంగా కొనసాగుతుంది.

మాతృభాష పరిరక్షణ — సామాజిక బాధ్యత
మాతృభాష పరిరక్షణ కేవలం ప్రభుత్వాలు చేపట్టవలసిన విధి మాత్రమే కాదు; ఇది ప్రతి పౌరుని సామాజిక కర్తవ్యం, సాంస్కృతిక బాధ్యత. భాష మన అస్తిత్వానికి, గుర్తింపుకు ఆధారం.అందువల్ల భాషను కాపాడుకోవడం అంటే మన సంస్కృతిని, సంప్రదాయాలను, జీవన విలువలను కాపాడుకోవడమే.ఈ బాధ్యతను ప్రభుత్వం ఒక్కటే నిర్వర్తించలేను; ప్రజల భాగస్వామ్యం లేకుండా భాషా పరిరక్షణ అసాధ్యం. మన రోజువారీ జీవితంలో మాతృభాష వాడకాన్ని పెంచడం ద్వారా భాషను సజీవంగా ఉంచవచ్చు.ఇంట్లో, పాఠశాలలో, కార్యాలయాల్లో,మార్కెట్లలో-ప్రతి చోట మాతృభాషను గౌరవంగా ఉపయోగించడం ఒక సాంస్కృతిక ఉద్యమంగా మారాలి.

సామాజిక మాధ్యమాల్లో మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహించడం, మాతృభాషలో రచనలు, వ్యాసాలు, కవితలు, కథలను పంచుకోవడం ద్వారా యువతను భాషకు దగ్గర చేయవచ్చు.స్థానిక రచయితలు, కవులు, సాహిత్యకారులకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం,వారి రచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం, పుస్తక పఠన సంస్కృతిని విస్తరించడం వంటి చర్యలు భాషా పరిరక్షణకు బలమైన పునాదులుగా నిలుస్తాయి. అలాగే భాషా దినోత్సవాలు, సాహిత్య సదస్సులు, కవిసమ్మేళనాలు వంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో భాష పట్ల చైతన్యం పెంపొందించాలి. అంతిమంగా చెప్పాలంటే -మాతృభాష పరిరక్షణ ఒక ఉద్యమం కావాలి,ఒక జీవన విధానం కావాలి. ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతను స్వీకరించినప్పుడే భాష తరతరాలుగా సజీవంగా కొనసాగుతుంది.

ముగింపు- మాతృభాషే మన భవిష్యత్తు
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది — భాషను కాపాడుకోవడం అంటే మనల్ని మనమే కాపాడుకోవడం. మాతృభాష మన గుర్తింపుకు మూలం, మన సంస్కృతికి ప్రాణం, మన భవిష్యత్తుకు పునాది. మాతృభాష బతికితేనే జాతి బతుకుతుంది. భాష సజీవంగా ఉంటేనే సమాజం సృజనాత్మకంగా వికసిస్తుంది. నేటి తరం చేతుల్లోనే రేపటి భాష భవితవ్యము ఉంది. మనం ఈ రోజు మాతృభాషకు ఇచ్చే గౌరవమే, రేపటి తరాలకి మనం అందించే అమూల్య వారసత్వం. అందుకే ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో మాతృభాషను ఆచరణలో పెట్టాలి, ప్రేమించాలి, పరిరక్షించాలి.
మాతృభాషను ప్రేమిద్దాం…
సజీవంగా నిలుపుదాం…
తరతరాలకు అందిద్దాం…
అదే మన భాషా వారసత్వం పట్ల మన కర్తవ్యం.

డా||బామండ్ల రాజు, 9966669313

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -