Sunday, May 31, 2026
E-PAPER
Homeసోపతిపాలు ఆరోగ్యానికి మేలా? అపోహల మాయాజాలమా?

పాలు ఆరోగ్యానికి మేలా? అపోహల మాయాజాలమా?

- Advertisement -

ఉదయం ఇంట్లో మొదట వినిపించే మాటల్లో ”పాలు వేడి చేశావా?” అన్నది తప్పకుండా ఉంటుంది. చిన్నపిల్ల చేతిలో పాల గ్లాస్‌, పెద్దల చేతిలో టీ లేదా కాఫీ, పండుగరోజు పాయసం, అనారోగ్య సమయంలో వేడి పాలు.. మన జీవితంలో పాలు అంతగా కలిసిపోయాయి. ఆహారంగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి ప్రతీకగా కూడా పాలను చూస్తూ వచ్చాం.
(జూన్‌ 1 ప్రపంచ పాల దినోత్సవం.)

పాలు, పాల ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు పాలు ప్రశంసల మధ్యనే కాదు, వివాదాల మధ్య కూడా నిలిచాయి. ఒకవైపు ”పాలు సంపూర్ణ ఆహారం”, ”రోజూ పాలు తాగితే బలం వస్తుంది” అనే నమ్మకం. మరోవైపు ”పాలు ఆరోగ్యానికి హానికరం”, ”పాలు లేకుండానే జీవించవచ్చు”, ”ఇది ప్రకతిసిద్ధమైన ఆహారం కాదు” అనే వాదనలు. ఇలాంటి చర్చ సామాజిక మాధ్యమాల్లో మరింత తీవ్రమవుతోంది. ఈ రెండు అతి భావాల మధ్య నిజం ఎక్కడుంది? మన జీవితంలో పాలు ఎందుకు అంత ముఖ్యమయ్యాయి?

పాలు అంటే జీవశక్తి
పుట్టిన శిశువుకు తల్లిపాలు జీవనాధారం. ఆ అనుభవం నుంచే ”పాలు అంటే జీవశక్తి” అనే భావన మన సంస్కతిలో బలపడింది. తర్వాత ఆవుపాలు, గేదెపాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి.. ఇవన్నీ కుటుంబ ఆహారంలో భాగమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ జీవనాధారం. పట్టణాల్లో పాలు ఆరోగ్యానికి గుర్తుగా మారాయి. పిల్లలు బలంగా పెరగాలంటే పాలు, ఎముకలు దఢంగా ఉండాలంటే పాలు, వద్ధాప్యంలో కాల్షియం కోసం పాలు.. ఇలా ప్రతి వయసులో పాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. ఈ నమ్మకాల వెనుక శాస్త్రీయ ఆధారం ఉంది. కానీ అదే సమయంలో అతిశయోక్తులు కూడా చేరిపోయాయి.

పాలలో ఏముంది?
పాలలో శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. శరీర నిర్మాణానికి సహాయపడే మాంసకత్తులు, ఎముకలకు అవసరమైన కాల్షియం, నరాల ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని విటమిన్లు, శక్తినిచ్చే కొవ్వులు, సహజ చక్కెర, పిల్లల ఎదుగుదలలో, కండరాల సంరక్షణలో, ఎముకల ఆరోగ్యంలో పాలు కొంతవరకు ఉపయోగపడతాయి. అందుకే పాలను మంచి పోషకాహారంగా పరిగణిస్తారు.

పాలు ఒక్కటే సరిపోతాయా?
ఇక్కడే చాలా అపోహలు మొదలవుతాయి. జీవితంలోని మొదటి ఆరు నెలల్లో తల్లిపాలు శిశువుకు పూర్తిస్థాయి ఆహారం. కానీ ఆ తర్వాత ఒక్క పాలతో శరీరానికి కావలసిన అన్నీ అందవు. పిల్లలకు ఇనుము, పీచుపదార్థం, ఇతర విటమిన్లు కూడా అవసరం. అవి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పుల ద్వారా రావాలి. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తినకపోయినా ”పాలు తాగుతున్నాడు కదా” అని ఊరట పొందుతారు. కానీ ఒక్క పాలతో పూర్తి పోషణ సాధ్యం కాదు. అధికంగా పాలు తాగే పిల్లల్లో ఆకలి తగ్గి ఇతర ఆహారాలపై ఆసక్తి తగ్గిపోవచ్చు. దాంతో రక్తహీనత, మలబద్ధకం, అసమతుల పోషణ వంటి సమస్యలు రావచ్చు.

పెద్దవాళ్లు తప్పనిసరిగా పాలు తాగాలా?
ఇది అందరికీ ఒకేలా చెప్పలేని విషయం. పాలు తాగితే కాల్షియం, మాంసకత్తులు లభిస్తాయి. కొందరికి అది సులభమైన పోషకాహారం. కానీ పాలు తాగకపోయినా ఇతర ఆహారాల ద్వారా అవసరమైన పోషకాలు పొందవచ్చు. రాగులు, నువ్వులు, పప్పులు, ఆకుకూరలు, పెరుగు, చేపలు వంటి ఆహారాల్లో కూడా కాల్షియం ఉంటుంది. అంటే పాలు ఉపయోగకరమైనవి కావచ్చు. కానీ అవి తప్పనిసరి కాదు.

పాలు తాగితే కడుపు ఎందుకు ఉబ్బుతుంది?
చాలామందికి పాలు తాగిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్‌, విరేచనాలు వస్తుంటాయి. దీనికి కారణం పాలలోని సహజ చక్కెరను జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్‌ శరీరంలో తక్కువగా ఉండటం. ఇది వ్యాధి కాదు. అలాంటి వారికి పెరుగు, మజ్జిగ సులభంగా జీర్ణమవుతాయి. అందుకే ప్రతి ఒక్కరి శరీరం ఒకేలా స్పందించదు.

పాలు తాగితే కఫం పెరుగుతుందా?
జలుబు వచ్చినప్పుడు చాలామంది పాలు మానేస్తారు. ”కఫం గడ్డకడుతుంది” అంటారు. అయితే దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరికి పాలు తాగిన తర్వాత గొంతులో చిక్కదనం అనిపించవచ్చు. కానీ అది నిజమైన కఫం పెరుగుదల కావాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత అనుభవాలు వేరుగా ఉండొచ్చు. కానీ సాధారణంగా పాలు తాగడం వల్ల ప్రమాదకరంగా కఫం పెరుగుతుందని చెప్పలేం.

పూర్తి కొవ్వు పాలు మంచివా?
చిన్నపిల్లలకు కొంత కొవ్వు అవసరం. అందుకే పూర్తి కొవ్వు పాలు ఉపయోగపడవచ్చు. కానీ అధిక బరువు, గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు తక్కువ కొవ్వు ఉన్న పాలను ఎంచుకోవచ్చు. అంటే ఒకే రకం పాలు అందరికీ సరిపోవు.

భయం ఎంతవరకు నిజం?
ఇటీవలి కాలంలో ”ఆవులకు ఇంజెక్షన్లు ఇస్తున్నారు”, ”పాలలో హార్మోన్లు ఉన్నాయి”, ”పిల్లల్లో త్వరగా మార్పులు వస్తున్నాయి” అనే చర్చలు పెరిగాయి.
పాల దిగుబడి పెంచడానికి కొన్ని చోట్ల మందులు, హార్మోన్లు దుర్వినియోగం చేసిన ఘటనలు బయటపడ్డాయి. ముఖ్యంగా పాల విడుదలను వేగంగా చేయడానికి ఉపయోగించే మందుల గురించి అనుమానాలు వచ్చాయి. దాంతో ప్రజల్లో భయం కూడా పెరిగింది. ”పాలు తాగడం వల్లే పిల్లల్లో ముందుగానే యుక్తవయస్సు వస్తోంది” అని చాలామంది అనుకుంటున్నారు. కానీ దీనిని స్పష్టంగా నిరూపించే ఆధారాలు ఇంకా లేవు. పిల్లల్లో ఊబకాయం పెరగడం, తక్కువ శారీరక శ్రమ, అధిక కేలరీల ఆహారం, పర్యావరణ కాలుష్యం, జీవనశైలి మార్పులు.. ఇవన్నీ కూడా ప్రభావం చూపే అంశాలు. అయితే దీన్ని కారణంగా చూపి పాల నాణ్యతపై వచ్చే ప్రశ్నలను తేలికగా తీసుకోవడం కూడా సరైంది కాదు. ఆహార భద్రత, నాణ్యత పరీక్షలు, రైతుల అవగాహన.. ఇవన్నీ బలపడాల్సిన అవసరం ఉంది.

కల్తీ పాలు.. అసలు ప్రమాదం
మన దేశంలో అప్పుడప్పుడు కల్తీ పాల వార్తలు బయటపడుతుంటాయి. నీరు కలపడం నుంచి రసాయనాలు కలపడం వరకు కొన్ని ప్రమాదకర ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది నిజంగా ప్రజారోగ్య సమస్య. ప్రజల్లో భయం పెరగడానికి ఇది కూడా ఒక కారణం. పాలపై విశ్వాసం నిలవాలంటే నాణ్యత నియంత్రణ కఠినంగా ఉండాలి.

మొక్కల ఆధారిత పాలు
ఇటీవల బాదం, సోయా, ఓట్స్‌ వంటి పదార్థాలతో తయారయ్యే పానీయాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. కొందరు ఆరోగ్య కారణాలతో, మరికొందరు పర్యావరణ కారణాలతో వీటిని ఎంచుకుంటున్నారు. అయితే ఇవన్నీ పోషకపరంగా ఆవుపాలకు సమానమని అనుకోవడం తప్పు. కొన్ని పానీయాల్లో మాంసకత్తులు తక్కువగా ఉండొచ్చు. కొన్ని చక్కెర ఎక్కువగా కలిగి ఉండొచ్చు.
కాబట్టి పేర్లు చూసి కాదు, పోషక విలువలు చూసి నిర్ణయం తీసుకోవాలి. గ్రామీణ భారతానికి పాలు ఒక ఆధారం. పాడి పరిశ్రమ లక్షల కుటుంబాలకు ఆదాయ వనరు. ముఖ్యంగా చిన్న రైతులు, మహిళా సంఘాలు, గ్రామీణ కుటుంబాలకు ఇది ఆర్థిక బలం. మన దేశం ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఎదగడంలో లక్షల చిన్న కుటుంబాల కష్టం ఉంది. అందుకే పాలు కేవలం ఆరోగ్య అంశం మాత్రమే కాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో కూడా అనుసంధానమై ఉన్నాయి.

భయాల మధ్య శాస్త్రీయ దృష్టి అవసరం
ఈరోజు ఆహారం గురించి రెండు అతి భావాలు పెరుగుతున్నాయి. ఒకటి.. ”ఇది అద్భుత ఆహారం” అనే ప్రచారం. మరొకటి.. ”ఇది పూర్తిగా విషం” అనే భయం.
పాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. శాస్త్రం చెప్పేది మాత్రం వేరే విషయం. పాలు చాలామందికి ఉపయోగపడే పోషకాహారం కావచ్చు. కొందరికి సరిపోకపోవచ్చు. పాలు తాగకపోయినా ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే పాలను పూర్తిగా ప్రమాదకరంగా చిత్రీకరించడం కూడా సరైంది కాదు. ఆహారం విషయంలో వ్యక్తిగత అవసరాలు, వయసు, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి ఇవన్నీ ముఖ్యం. ప్రపంచ పాల దినోత్సవం మనకు గుర్తు చేసే అసలు విషయం ఇదే.. ఆహారం గురించి భయాలకంటే అవగాహన ముఖ్యం. ప్రచారాలకంటే శాస్త్రీయ దృష్టి అవసరం. అతి భావాలకంటే సమతుల ఆలోచన ఆరోగ్యకరం.

డా|| యం. రమాదేవి
ప్రొఫెసర్‌ డ హెడ్‌, ఫిజియాలజీ
గాంధీ మెడికల్‌ కాలేజ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -