బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ – నక్కలగుట్ట
ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా బీఆర్‌ఎస్ రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి హైడ్రా చర్యలను ఎండగడుతున్నామని, ఇది కార్యకర్తల సహకారంతోనే చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అధ్యక్షతన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం, బూత్ లెవెల్ ఏజెంట్, ఎస్‌ఐఆర్‌పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల పిల్లల కోసం 500 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, యూనిఫార్మ్స్, పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా సామాజిక రుగ్మత ముఖ్యంగా బాల్యవివాహాలు తగ్గాయని అన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ కావడం వల్ల బాలింత మరణాలు తగ్గాయని, వెయ్యి గురుకులాల ద్వారా బాల కార్మికుల వ్యవస్థ తగ్గిందని, చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలు ద్వారా ఉపాధి కల్పించామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికలు మరమ్మతులు, రైతుబంధు, రైతు బీమా, ఎరువులు, 24 గంటల విద్యుత్తు.. ఇలా ఒక విజన్‌తో పనిచేయడం వల్ల రైతు జీవితంలో వెలుగు వచ్చిందని, సర్వ మతాలను సమాన దృష్టితో చూశామని అన్నారు. అనంతరం వినయ భాస్కర్ మాట్లాడుతూ… తమ పార్టీ కార్యాలయం జనతా గ్యారేజ్ లాగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మారిందని అన్నారు. రెండున్నర సంవత్సరాల నుంచి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతిపక్ష పార్టీగా, ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని తెలిపారు. అధికార పార్టీ పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని, భూ కబ్జాలపై అధికారులు స్పందించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, హైడ్రా చర్యలను ఎండగడుతున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



