బెల్టు, టై, స్కూల్ బ్యాగ్, బూట్లతో కూడిన కిట్
ఈ ఏడాది విద్యార్థులకు
నాణ్యమైన సామగ్రి పంపిణీ
తొలిసారి ఇంటర్ విద్యార్థులకు బ్యాగులు, బెల్టులు, టై,
బూట్లు, సాక్సులు
విద్యారంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నజర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు ధరించే మన్నికైన యూనిఫామ్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా బ్రాండెడ్ షూలు, సాక్సులు, టైలు, బెల్టులను ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు కూడా అందించనున్నారు. ‘నాణ్యమైన దుస్తులను సరఫరా చేస్తేనే యూనిఫాంలు ఎక్కువ రోజులు మన్నుతాయి. అందుకే విద్యార్థులకు అందజేసే యూనిఫాంలకు సంబంధించి వస్త్రం సరఫరా మొదలు కుట్టు పని వరకు ప్రతి దశలోనూ నాణ్యతకు పెద్దపీట వేయాలి’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులకు మఫత్‌లాల్ వంటి పేరెన్నిక గల సంస్థ నుంచి యూనిఫాం వస్త్రాన్ని ఈ దఫా సేకరిస్తున్నారు. యూనిఫాంతోపాటు స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, టైలు, బెల్టులు, బెడ్డింగ్ సామగ్రి, ప్లేట్లు, గ్లాసులు, కటోరా ఇలా ప్రతి దానిలోనూ ప్రభుత్వం నాణ్యతకు పెద్ద పీట వేస్తోంది. ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలలకు, వివిధ గురుకులాలకు వేర్వేరుగా సామగ్రి కొనుగోలు చేసే విధానం ఉండేది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యార్థులకు మన్నికైన యూనిఫాం, ఇతర సామగ్రి అందజేసేందుకు రూ.687.78 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది.
స్వయం సహాయక సంఘాలకు కుట్టు పని
యూనిఫారాలు కుట్టు పనిని మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రోజుకు 75 వేల నుంచి లక్ష యూనిఫాంలు కుట్టే సామర్థ్యం ఆయా సంఘాలకు ఉన్నది. ఒక్కో యూనిఫాం కుట్టు పనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.75 చెల్లిస్తుంది. సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలు అందించనుంది. ఈ పనితో సంఘాల్లోని మహిళలకు సుమారు రూ.40 కోట్లకుపైగా ఆదాయం సమకూరనుంది.
ఇంటర్ విద్యార్థులకు సైతం
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఇంటర్మీడియట్ విద్యార్థులపైనా ప్రత్యేకంగా దృష్టిసారించింది. గతంలో ఎన్నడూలేని విధంగా తొలిసారి ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లోని సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు కాలేజీ బ్యాగులు, బెల్టులు, టైలు, నల్లటి బూట్లు, సాక్సులు అందజేయనుంది. విద్యార్థులకు యూనిఫాంతోపాటు అందజేసే బూట్లు, సాక్సులు, టైలు, బెల్టులు, గురుకుల్లాలోని విద్యార్థులకు అందజేసే దుప్పట్లు, ప్లేట్లు, గ్లాస్‌లు ప్రతి ఒక్కటి నాణ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ టెండర్లను ఆహ్వానించింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేస్తున్నది రూ.687.78 కోట్లు మాత్రమే. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల ఆర్డర్‌ను తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ (టీజీఎల్‌ఐపీసీ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ ఆర్డర్‌తో ఆ సంస్థ ఆర్థికంగా బలోపేతం కానుంది.
27 లక్షల మంది విద్యార్థులు…
2.97 కోట్ల మీటర్ల వస్త్రం
రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలకు సంబంధించి 2.97 కోట్ల మీటర్ల వస్త్రం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మఫత్‌లాల్ కంపెనీ 2.41 కోట్ల మీటర్లు, తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టీజీఎస్‌కో ) 55.32 లక్షల మీటర్ల వస్త్రాన్ని సరఫరా చేస్తున్నాయి. విద్యార్థినీ, విద్యార్థులకు లైట్ బ్లూ, డార్క్ బ్లూ, వైట్, ప్లెయిన్ మెరూన్, మెరూన్ చెక్స్ రంగుల్లో యూనిఫాంలు సిద్ధం చేస్తోంది. విద్యార్థినులకు స్కర్ట్, పంజాబీ డ్రెస్, చున్నీ సరఫరా చేయనుంది. డే స్కాలర్స్‌కు టాప్ లైట్ బ్లూ, లోవర్స్ డార్క్ బ్లూ, గురుకులాల్లోని విద్యార్థులకు టాప్‌లో మెరూన్ చెక్, లోవర్ మెరూన్ రంగులో యూనిఫాంలో ఉండనుంది.



