సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్త
ముగిసిన
ఏఐసీడబ్ల్యూఎఫ్ వర్కింగ్
కమిటీ సమావేశాలు
బొగ్గు రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడాన్ని నిరసిస్తూ తీర్మానాలు
నవతెలంగాణ – గోదావరిఖని
ప్రయివేటీకరణతో ప్రభుత్వ రంగాలు నిర్వీర్యమవుతు న్నాయని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్త అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రెండు రోజులుగా జరుగుతున్న ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసీడబ్ల్యూఎఫ్) వర్కింగ్ కమిటీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్త సింగరేణి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జాతీయ సంపద అయిన బొగ్గును లాభార్జనే ధ్యేయంగా పెట్టుబడిదారులకు వేలంపాటలు, ఎండీఓ రెవిన్యూటరీ, నేషనల్ పైప్‌లైన్ వంటి పేర్లతో అప్పజెప్పుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ, కార్పొరేట్ పెట్టుబడుల వల్ల చేజిక్కించుకున్న బొగ్గు బ్లాక్‌ల్లో కార్మికులతో కారుచౌకగా శ్రమ దోపిడీ చేయించుకుంటూ, వారి ఇష్టానుసారంగా ప్రకృతికి నష్టం చేసే అవకాశం ఉందని అన్నారు. పోటీ మార్కెట్‌లో ప్రయివేటు వారితో పోటీపడి ప్రభుత్వరంగ సంస్థను నిలబెట్టుకోవడం యాజమాన్యాలకు పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. కొత్త గనులు కేటాయించకుండా ఉత్పత్తి కావాలని ఒత్తిడి చేయడం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవడమే కాకుండా, విద్యుత్ సంస్థలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టడం వల్ల ప్రజలపై భారం పడుతుందని తెలిపారు.
ప్రయివేటు పెట్టుబడిదారులు అతి తక్కువ వేతనాలతో కార్మికులతో శ్రమ చేయించుకుంటూ తక్కువ ధరకే బొగ్గును అమ్మడం వల్ల ప్రభుత్వ సంస్థలు నష్టాలను చవిచూడాల్సి వస్తుందనీ, దీనివల్ల కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని హెచ్చరించారు. తాత్కాలిక ఉద్యోగులను బానిసత్వంలోకి నెట్టే చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు. వీటిని ఎదుర్కోవాలంటే కార్మికులు చైతన్యవంతమై పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సింగరేణి పరిశ్రమ రక్షణకు కొన్ని తీర్మానాలు చేశారు. మైన్‌లెవెల్ స్థాయి నుంచి ఏరియా లెవెల్‌తోపాటు పైస్థాయి వరకు కార్మికులను చైతన్యం చేసి ఆందోళనల్లో భాగస్వాములను చేయాలనీ, బొగ్గు బ్లాక్‌లను ప్రభుత్వ రంగ సంస్థకే కేటాయించాలనీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు ఇవ్వాల్సిన రూ.50వేల కోట్ల పైచిలుకు బకాయిలు వెంటనే ఇవ్వాలనీ, సొంతింటి పథకం, ఫిక్స్ పై ఇన్‌కమ్ ట్యాక్స్ రీయింబర్స్ మెంట్ , మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, అధ్యక్షులు మంద నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి ముత్యంరావు, నాయకులు సాయిరెడ్డి, మెండ శ్రీనివాస్, మేదర్ సారయ్య, విజయగిరి శ్రీనివాస్, కుంట ప్రవీణ్, వంగల శివరాంరెడ్డి, జెల్ల గజేంద్ర, శ్రీనివాస్, జంగపల్లి మల్లేష్, ముల్కాల శ్రీకాంత్, సానం రవి, సతీష్ కుమార్, ఉరుసు సందీప్, పెద్దపల్లి శశి కిరణ్, దినేష్ గుప్తా, ఈశ్వర్ సాగర్ పాల్గొన్నారు.



