Monday, February 16, 2026
E-PAPER
Homeజాతీయంనేడు ఏపీకి బిల్‌గేట్స్‌ రాక

నేడు ఏపీకి బిల్‌గేట్స్‌ రాక

- Advertisement -

పరిపాలనలో టెక్నాలజీ వినియోగంపై పరిశీలన
స్వర్ణాంధ్ర విజన్‌పై సీఎం ప్రెజెంటేషన్‌

అమరావతి : మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు, మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. తన ఫౌండేషన్‌ ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించనున్నారు. అలాగే రాజధాని పరిధిలోని ఉండవల్లిలో ఆధునిక పద్ధతుల్లోనూ, టెక్నాలజీ ఉపయోగించి సాగుచేస్తున్న కళ్లం నరేంద్రరెడ్డి నర్సరీ సమీపంలో ఎంపిక చేసిన పొలాలను పరిశీలించనున్నారు. ఆయన పొలం పక్కనే గేట్స్‌ పర్యటనకు వీలుగా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకుని అక్కడ నుండి నేరుగా సచివాలయానికి వెళ్తారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌.. గేట్స్‌తో చర్చించనున్నారు. అనంతరం ఆర్‌టిజిఎస్‌కు చేరుకుంటారు. ప్రభుత్వ పరిపాలనలో సాంకేతిక పద్ధతుల వినియోగంపై ఆర్‌టిజిఎస్‌ ద్వారా పరిశీలించనున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, రియల్‌టైం మానిటరింగ్‌ వంటి అంశాలను అక్కడ బిల్‌గేట్స్‌కు సీఎం, అధికారులు వివరించనున్నారు. ఇటీవల వాట్సాప్‌ ద్వారా నేరుగా అందిస్తున్న సేవలనూ తెలపనున్నారు. ముఖ్యంగా రాష్ట్రం ముందుకు తీసుకొచ్చిన స్వర్ణాంధ్ర విజన్‌-2047 పాలసీపై సిఎం చంద్రబాబు.. గేట్స్‌కు వివరించనున్నారు. అనంతరం పెనుమాక, ఉండవల్లి పరిధిలో సిఎం కార్యాలయానికి సమీపంలో ఉన్న పొలాల్లో ఆధునిక పద్ధతుల్లో నర్సరీ సాగు చేస్తున్న కళ్లం నరేంద్రరెడ్డి పొలానికి వెళతారు. అక్కడ నర్సరీ పెంపకంలో డ్రోన్స్‌, సాంకేతిక వినియోగం వంటి అంశాలను నేరుగా బిల్‌గేట్స్‌ పరిశీలించి తిరుగుపయనం అవుతారు. అక్కడ నర్సరీలో గేట్స్‌ ప్రత్యక్షంగా తిరిగేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. బిల్‌గేట్స్‌ రాక సందర్భంగా సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా తయారుచేశారు. అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును మందడం వరకూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.ఎడిసిఎల్‌, సిఆర్‌డిఎ అధికారులందరూ ఈ పనుల్లో నిమగమయ్యారు. ఏర్పాట్లపై కమిషనర్‌ కన్నబాబు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సెక్రటేరియట్‌, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, పెనుమాక పరిధిలో గేట్స్‌ సందర్శించనున్న పొలాన్ని పరిశీలించారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా గేట్స్‌ రాష్ట్రానికి రావడం ఇది మూడోసారి కావడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -