Monday, February 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆగని ఇజ్రాయిల్‌ రక్తదాహం

ఆగని ఇజ్రాయిల్‌ రక్తదాహం

- Advertisement -

గాజాలో పది మంది పాలస్తీనియన్లు మృతి
దక్షిణ లెబనాన్‌ పైనా దాడి

రఫా : గాజాపై ఇజ్రాయిల్‌ అమానవీయ, దారుణ దాడులు ఆగడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కఠిన చర్యలకు దిగుతోంది. ఇజ్రాయిల్‌ దళాలు చేపట్టిన తాజా దాడుల్లో పది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అక్టోబర్‌లో అమెరికా మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ తర్వాత ఇది మరొక ఉల్లంఘనగా గాజా వైద్య వర్గాలు తెలిపాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ‘ఎల్లో లైన్‌’ అవతల ఈ దాడి జరిగింది. ఉత్తర గాజాలోని అల్‌-ఫలూజా ప్రాంతంలో నిరాశ్రయులైన ప్రజల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌పై ఇజ్రాయిల్‌ దళాలు దాడి చేశాయి. దీంతో అక్కడ మిగిలిన నలుగురు పాలస్తీనియన్లు మరణించారని అల్‌-షిఫా హాస్పిటల్‌ వర్గాలు తెలిపాయి. గతేడాది అక్టోబర్‌ 10న యూఎస్‌ మధ్యవర్తిత్వంతో గాజా, ఇజ్రాయిల్‌ల మధ్య ‘కాల్పుల విరమణ’ ఒప్పందం జరిగిన విషయం విదితమే. అప్పటినుంచి 1,500 కంటే ఎక్కువ సార్లు ఇజ్రాయిల్‌ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

దీంతో కనీసం 591 మంది మరణించారు. 1,590 మంది గాయపడ్డారు. పాలస్తీనియన్లను దాదాపు రోజువారీగా చంపడంతో పాటు, ఇజ్రాయిల్‌ ఆహారం, మందులు, వైద్య సామాగ్రి, ఆశ్రయ సామగ్రి, ఇతర అవసరాలను గాజాలోకి ప్రవేశించకుండా తీవ్రంగా పరిమితం చేసింది. ఇక్కడ దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు విపత్కర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది నిరాశ్రయులు కావడం గమనార్హం. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌ అక్టోబర్‌ 8, 2023న గాజాపై యుద్ధాన్ని ప్రారంభించిన విషయం విదితమే. ఇప్పటి వరకు ఇజ్రాయిల్‌ దళాలు 72,032 మందికి పైగా పాలస్తీనియన్లను చంపినట్టు సమాచారం. దాదాపు 171,661 మందిని గాయపరిచింది. ఆ భూభాగంలోని 90 శాతం మౌలిక సదుపాయాలను నాశనం చేసింది. కాగా ఇజ్రాయిల్‌ దాడులతో అతలాకుతలమైన గాజాను పునర్నిర్మించడానికి 70 బిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన విషయం విదితమే.

దక్షిణ లెబనాన్‌పై దాడి
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ సైన్యం ఆదివారం దాడులకు దిగింది. హిజ్బుల్లా సాయుధ సమూహం ఉపయోగించే గిడ్డంగులను లక్ష్యంగా చేసుకున్నదని అధికారులు తెలిపారు. లెబనాన్‌లో, ఇజ్రాయిల్‌ సైన్యం శత్రుత్వాన్ని ఆపడానికి అంగీకరించినప్పటి నుంచి ఏడాదిలో 10,000 కంటే ఎక్కువ వైమానిక , భూ దాడులను ప్రారంభించిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ‘కాల్పుల విరమణ’ ఒప్పందం తర్వాత ఇజ్రాయిల్‌ దాడుల్లో కనీసం 108 మంది పౌరులు మరణించారని ధ్రువీకరించినట్టు సంస్థ హక్కుల కార్యాలయం గత నవంబర్‌లో తెలిపింది. వీరిలో కనీసం 21 మంది మహిళలు, 16 మంది పిల్లలు ఉన్నారని వివరించింది. ఆ సమయంలో కనీసం 11 మంది లెబనాన్‌ పౌరులను కూడా ఇజ్రాయిల్‌ దళాలు అపహరించాయని కార్యాలయం వెల్లడించడం ఇజ్రాయిల్‌ దారుణ చర్యలకు అద్దం పడుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -