సర్పంచుల సంఘం మండలాధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్
నవతెలంగాణ-మిడ్జిల్
ఒక చిత్రం వేయి పదాలతో సమానం అంటారు. కాల చక్రంలో కలిసిపోయే క్షణాలను, జ్ఞాపకాలను భవిష్యత్తు తరాలకు సజీవంగా అందించే అద్భుత కళ ఫోటోగ్రఫీ సొంతం. ఒక్క క్లిక్‌తో చరిత్రను బంధించే శిల్పులు ఫోటోగ్రాఫర్లు అని సర్పంచుల సంఘం మండలాధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో శంకర్ మాట్లాడుతూ..సమాజంలో జరుగుతున్న పరిణామాలను, పోగొట్టుకున్న బంధాలను, కనుమరుగవుతున్న ఆచారాలు, సంప్రదాయాలు, పాత టెక్నాలజీ, ఇప్పటి ఏఐ విప్లవంతో పాటు రోజురోజుకు రూపాంతరం చెందుతున్న ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ఫోటోగ్రాఫర్ల శ్రమను ప్రజలు మర్చిపోలేరని చెప్పారు.
ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు లూయిస్ డాగురే, జోసెఫ్ నైస్‌ఫోర్ నీప్స్ కలిసి 1837లో డాగురియోటైప్ అనే ఫోటోగ్రఫీ ప్రక్రియను కనుగొన్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం దీనిని 1839 ఆగస్టు 19న ప్రపంచానికి ఉచితంగా పరిచయం చేసింది. ఆ రోజుకు గుర్తుగానే ప్రతి ఏటా ఆగస్టు 19ని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. శుభకార్యాలైనా, విపత్తులు సంభవించిన క్లిష్ట పరిస్థితులైనా ఫోటోగ్రాఫర్లు ప్రాణాలకు తెగించి పని చేస్తుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు మూబిన్, ప్రధాన కార్యదర్శి బాలు,కోశా ధికారి కళ్యాణ్ చక్రవర్తి, కుటుంబ భరోసా ఇన్చార్జి నాగరాజు, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, సురేష, కృష్ణ గౌడ్, మాకుసుధ్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.


