భర్త కళ్ల ముందే రోటవేటర్‌కు బలైన భార్య..
ముగ్గురు చిన్నారులను అనాథలుగా చేసిన విషాదం
నవతెలంగాణ – మిరుదొడ్డి
అయ్యో విధీ..! ఎంతటి దారుణం ఇది..! ఉదయం వరకు భర్తతో నవ్వుతూ మాట్లాడిన భార్య, క్షణాల్లో నిర్జీవంగా మారిపోతుందని ఎవరైనా ఊహించగలరా.. వ్యవసాయ పనుల్లో నిత్యం కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ రైతు కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం సిద్దిపేట జిల్లాను శోకసంద్రంలో ముంచెత్తింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న తడ్కాపల్లికి చెందిన మంతూరి నరేష్ – విజయ (35) దంపతులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు.

వానాకాలం సాగు పనులు ప్రారంభం కావడంతో సోమవారం తమ పొలంలో ట్రాక్టర్‌కు రోటవేటర్ అమర్చి దుక్కి దున్నుతున్నారు. భర్త ట్రాక్టర్ నడుపుతుండగా, భార్య విజయ అతని పక్కనే కూర్చొని కబుర్లు చెబుతూ వెళ్తోంది. భార్య ఒక్కసారిగా ట్రాక్టర్ మీద నుంచి కిందపడిపోవడంతో నరేష్ ఉలిక్కిపడ్డాడు. వెంటనే ట్రాక్టర్ ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తన కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో నరేష్ రోదనలు ఆకాశాన్నంటాయి. భార్యను కాపాడలేకపోయాననే ఆవేదన అతడిని కుంగదీసింది. ఇంకా విషాదకరమైన విషయం ఏమిటంటే విజయకు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అమ్మ కోసం ఎదురుచూస్తున్న ఆ పిల్లలకు ఇకపై ఆమె తిరిగి రాదు. వారి జీవితాల్లో తీరని శూన్యం మిగిలిపోయింది. భర్తకు జీవిత భాగస్వామిని, పిల్లలకు తల్లిని, కుటుంబానికి ఆధారాన్ని ఈ ప్రమాదం కబళించింది. తల్లి కోసం ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ (11), హిరణ్య (8), రాజు (4) లను చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో ఎవరిని పలకరించినా కన్నీళ్లు కనిపిస్తున్నాయి. నిన్నటివరకు అందరితో కలిసిమెలిసి తిరిగిన విజయ ఇలా దుర్మరణం చెందడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో చిన్న తడ్కాపల్లి గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.




