Tuesday, June 16, 2026
E-PAPER
Homeమానవివారి మానాన వారిని వదిలేయండి

వారి మానాన వారిని వదిలేయండి

- Advertisement -

పిల్లల పెంపకం అనేది అన్నిటికన్నా పెద్ద బాధ్యత అనేది అందరూ అంగీకరించే విషయం. అయితే పిల్లల పెంపకానికి ఫిక్స్డ్​ పద్ధతి అంటూ ఏదీ లేదు అంటారు మానసికవేత్తలు. అంతేకాదు వారి మానాన వారిని వదిలేయడమే సరైన పెంపకం అంటున్నారు. ఇంకా నేటి పిల్లల పెంపకలంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుం దాం….

పిల్లలు రేపటి భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ఏదీ నేర్చుకోరు. తోటివారు చేసే పనులను గమనిస్తూ, వాటిని వెంటనే తాము కూడా చేయాలనుకుంటారు. అలా చేయడం ద్వారానే నేర్చుకుంటారు. ప్రత్యేకంగా నేర్చుకోవడం అనేది పెద్దవారిలో కనిపిస్తుంది. కానీ పిల్లల్లో ఉండదు. పనులు చేయడమే వారి దృష్టిలో నేర్చుకోవడం.
భిన్నంగా ఉండడం వల్ల: భాష కావచ్చు, మరేదైనా పని కావచ్చు, ఇంకేదైనా విషయం కావచ్చు.. పిల్లలు ముందుగా మొత్తం చూస్తారు. ఆ తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు పిల్లలు మాట్లాడే పద్ధతిని గమనించవచ్చు. అర్థంపర్థం లేని మాటలు గలగలా మాట్లాడుతుంటారు. ఆ తర్వాతనే చిన్న చిన్న పదాలుగా, ముక్కలుగా మాట్లాడడం నేర్చుకుంటారు. కానీ.. స్కూల్లో టీచర్లు, ఇంట్లో పెద్దవాళ్లు ఇందుకు భిన్నంగా నేర్పిస్తున్నందు వల్లనే వారికి నేర్చుకోవడంపై ఇంట్రస్ట్ తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.
తప్పులు చేస్తూనే : పిల్లలు చేసే అతి ముఖ్యమైన పని తప్పులు చేయడం. అలా తప్పులు చేయడం ద్వారానే కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆ తర్వాత వారికి వారే సరిచేసుకుంటారు. కానీ దాదాపుగా తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలు ఏ మాత్రం తప్పు చేయకూడదనే ఉద్దేశ్యంతో, కష్టాలు పడకూడదనే ఆరాటంతో.. అసలు పిల్లలకు తప్పులు చేసే అవకాశమే ఇవ్వడం లేదు. నిజానికి వారి మానాన వారిని వదిలేస్తే, తమ తప్పులను తామే గ్రహించి, ఇంకా మెరుగ్గా చేస్తారట.
పూర్తిగా నిజం కాదు: ఇంట్లో పెద్దవాళ్లను చూసే పిల్లలు నేర్చుకుంటారు, కాబట్టి వారికి రోల్ మోడల్​గా ఉండాలని చెబుతుంటారు. ఇది కొంత వరకు నిజమేకానీ, పూర్తిగా నిజం కాదట. పిల్లలు తమకన్నా కాస్త ఎక్కువ వయసున్న పిల్లలను చూసే ఎక్కువగా నేర్చుకుంటారు. ఆ ఎక్కువ వయసున్న పిల్లలు కూడా తప్పులు చేయడం.. వారూ తమలాంటి వారేనని పిల్లలు భావించడమే కారణం. ఇంట్లో అమ్మానాన్నలు, ఇతర పెద్దలు చేసే పనులన్నీ పర్ఫెక్ట్‌గా ఉండడం వల్ల.. తాము అలా చేయలేమని భావించి చాలాసార్లు ప్రయత్నించడమే మానేస్తారట!
ఊహల్లోనే : ఊహల్లో బతకడం పిల్లలకు చాలా ఇష్టం. చేతిలో స్టీరింగ్ లేకపోయినా కారు నడుపుతున్నట్లు రయ్య్… మంటూ నోటితో శబ్దం చేయడానికి కారణం అదే. లేని మీసాలను తిప్పడం.. ఆటల్లో బొమ్మలతో మాట్లాడుకోవడం ఇవన్నీ పిల్లలు విహరించే ఫ్యాంటసీ ప్రపంచానికి ఉదాహరణలు. ఇలా నటించడం ద్వారానే నిజ జీవితంలో చేయడానికి అవసరమైన ఎన్నో విషయాలను నేర్చుకుంటారు.
అడిగితేనే చెప్పండి: అతి ముఖ్యమైన విషయం ఏమంటే.. పిల్లలకు క్లాస్​ పీకడం! పిల్లలు తమంతట తాముగా వచ్చి, ఏదైనా సందేహం అడిగితేనే దాన్ని వివరించాలట. అలా వాళ్లు అడగకుండా మనమే బలవంతంగా నేర్పించడానికి ప్రయత్నిస్తే.. ‘అది నీకు చేతకాదు’ అని పరోక్షంగా వారికి చెప్పినట్లే. అందుకే ఇంట్లోని పెద్దలు, స్కూల్లోని టీచర్లు గుర్తించి పిల్లలు సొంతంగా నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి. వారి అభ్యసనాన్ని గౌరవించాలి .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -