Tuesday, June 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం16 నుంచి 22 వరకు 
వానాకాలం సాగు సమస్యలపై ధర్నాలు

16 నుంచి 22 వరకు 
వానాకాలం సాగు సమస్యలపై ధర్నాలు

- Advertisement -

పోస్టర్‌ ఆవిష్కరణలో రైతు సంఘం 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వానాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాగర్‌‌తో పాటు ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్‌ ‌శోభన్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శులు లెల్లెల బాలకృష్ణ, ఉడత రవీందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. సాగు పనులు మొదలైనా ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం అందకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన రైతు భరోసా నిధులను తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. పెండింగ్‌లో ఉన్న వానాకాలం, యాసంగి పంటల బోనస్ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. మార్కెట్లో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలను అరికట్టాలనీ, నాసిరకం విత్తనాలతో రైతులను ముంచుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పొటాష్, భాస్వరం, కాంప్లెక్స్ ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. ‘యూరియా యాప్’ రద్దు చేసి, రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో, తగినంతగా సరఫరా చేయాలని విన్నవించారు. విద్యుత్ రంగంలో రైతాంగానికి నష్టం చేకూర్చే ‘రైతు డిస్కాం’ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజన, గిరిజనేతర రైతులకు సాగు హక్కు పత్రాలు ఇవ్వాలనీ, అటవీ అధికారుల పేరిట జరుగుతున్న వేధింపులను తక్షణమే ఆపాలని డిమాండ్‌ ‌చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అర్హులైన రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలనీ, అదేవిధంగా, కౌలు రైతులకు ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకుని రుణార్హత కార్డులు అందజేయాలనీ కోరారు. తమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో రాజకీయాలకతీతంగా రైతులందరూ జయప్రదం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -