ఇరాన్ – అమెరికా మధ్య కుదిరినట్లు చెబుతున్న మరో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై డిజిటల్ సంతకాలు జరిగాయని, శుక్రవారం నాడు జెనీవాలో ఇరు దేశాల నేతలు భౌతికంగా సంతకాలు చేస్తారని చెబుతున్నారు. నిశ్చితార్దం జరిగిన తరువాత ఆగిపోయిన వివాహాలను ఎన్నింటినో చూశాం. ఈ ఒప్పందం కూడా అలా కాకూడదని అందరం కోరుకుందాం. అయితే ఎనభై ఏండ్ల డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం చేస్తాడో తెలియదు గనుక సంతకాలు జరిగేంతవరకూ అనుమానమే. ఒప్పంద అంశాలపై పరస్పర విరుద్దమైన భాష్యాలు వెలువడుతుండటమే దీనికి కారణం. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉంది, గతంలో అది అంగీకరించిన అంశాలే దీనిలో ఉంటాయని చెబుతున్నారు. ఇరాన్ కంటే తన మీద పెరుగుతున్న వత్తిడితో డోనాల్డ్ ట్రంప్ సతమతం అవుతున్నాడు. ఈ పూర్వరంగంలో రానున్న రోజుల్లో పరిణామాలు, పర్యవసానాల గురించి చర్చలు మొదలయ్యాయి. బహుశా ఇప్పటి వరకు అనేక దేశాలు, కూటముల మధ్య ఒప్పందాలు జరిగాయి, అయితే ఇంతగా అనుమానాలు, సందేహాలు తలెత్తింది మరొకటి లేదు. యుద్దం అనగానే విపరీతమైన ఖర్చు, జనం మీద భారం పడుతుంది. ఇరాన్‌పై అమెరికా దాడి, అది ఎదుర్కొన్న ప్రతిఘటన, ఇతర ఖర్చుల గురించి ఇంతవరకు నిర్దిష్టమైన అంచనాలేవీ లేవు. అమెరికాకు రోజుకు 90 నుంచి 200 కోట్ల డాలర్లు అయినట్లు ఒక అంచనా కాగా అమెరికా రక్షణశాఖ 2,500 కోట్ల డాలర్లని చెప్పింది.
ఈ సంఖ్యను ఎవరూ నమ్మటం లేదు. ఇది తాత్కాలిక ఖర్చు మాత్రమే అని దీర్ఘకాలంలో లక్ష కోట్ల డాలర్లు అవతుందని హార్వర్డు విశ్వవిద్యాలయ నిపుణులు చెప్పారు. అమెరికాలో ప్రతి కుటుంబానికి ఒక్క చమురు ఖర్చే అదనంగా 450 డాలర్ల వంతున అయిందని ఒక అంచనా కాగా ఇతరాలను కూడా కలుపుకుంటే 63వేల నుంచి లక్ష కోట్ల వరకు జనాలకు చేతి చమురు వదులుతుందని మరొక అంచనా.ఈ లెక్కన డోనాల్డ్ ట్రంప్ పిచ్చిపనితో ప్రపంచం ఎంత నష్టపోయిందో ప్రస్తుతానికి ఊహించుకోవాలే తప్ప లెక్కలు చెప్పలేము. ఇక ఒప్పందం కుదిరింది అని చెప్పిన తరువాత వీటి సంగతేమిటి అంటూ అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాటిలో కొన్నింటిని చూద్దాం. ఒప్పందంపై సంతకాలు జరిగాయా అంటే సమాధానం లేదు, అయితే ఒప్పందం ఎలా ఉండాలో అంటే ఒక విధంగా ఇంటిని ఎలా నిర్మించాలో ముందుగా ఇంజనీరు రూపొందించే ప్లాన్ మాదిరి అవగాహన మీద సంతకాలు చేసినట్లు ట్రంప్, జెడివాన్స్ చెప్పాడు. ఒప్పంద ముసాయిదా పత్రాలను పరస్పరం మార్చుకున్నారు, వాటిలో కొన్నింటి అమలు ప్రారంభించి 60 రోజుల్లో అంతిమ ఒప్పందం ఖరారు చేసుకుంటారు. అయితే ఒప్పందం గురించి అనుకున్నాం గనుక భౌతికంగా సంతకాలు జరగక ముందే వెంటనే హార్ముజ్ జలసంధిని తెరుస్తారని ట్రంప్ చెప్పాడు, అయితే శుక్రవారం తరువాతే అని కూడా అదే పెద్దమనిషి చెప్పాడు.
అయితే ఒకటి రెండు నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జలసంధి నుంచి వచ్చాయని వార్తలు వెలువడ్డాయి. దాన్ని ఎలా తెరుస్తారన్నదాని మీద సందేహాలు. ఎలాంటి దారి సుంకం చెల్లించకుండా ప్రయాణిం చవచ్చని ట్రంప్ చెప్పాడు. అరవై రోజుల సంధి కాలంలో మాత్రమే ఎలాంటి రుసుమూ ఉండదని తరువాత తాము చేసిన ఏర్పాట్ల మేరకు రక్షణ, పర్యావరణ సుంకం వసూలు చేస్తామని ఇరాన్ చెప్పింది. అంటే జలసంధి మీద అదుపు తమదే అని చెప్పినట్లే. ఒప్పందంతో ఇరాన్ సాధించేదేమిటి ? కుదిరినట్లు చెబుతున్న అవగాహనకు వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నట్లు పశ్చిమదేశాల వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్ మీద ఆంక్షలు తొలుగుతాయి, విదేశాల్లో స్థంభింప చేసిన దాని నిధులను విడుదల చేస్తారు. అరవై రోజుల్లో తాము 24 బిలియన్ డాలర్లను పొందుతామని టెహరాన్ చెబితే కాదు పన్నెండు బిలియన్ డాలర్లు మాత్రమే అందుబాటులోకి వస్తాయని, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసేది లేదని ట్రంప్ చెప్పాడు.దీర్ఘకాలం పాటు యురేనియం శుద్ధి ఉండదని, నిల్వల తనిఖీకి అనుమతి, అణ్వాయుధాలను తయారు చేయబోమని అంగీకరిస్తేనే ఆర్థిక ఆంక్షలు తొలుగుతాయని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ చెప్పాడు. షరతులు ఉండవని ఇరాన్, కాదు ఉంటాయని అమెరికా చెబుతోంది.ఇరాన్ విడుదల చేసినట్లు చెబుతున్న 14 అంశాలను ఒక పత్రిక ప్రచురించగా అది తప్పుడు వార్త అని ట్రంప్ తోసిపుచ్చాడు.
రెండు రోజుల్లోగా విడుదల చేస్తామని అమెరికా అధికారులు సోమవారం నాడు చెప్పగా సంతకాలు చేసేంతవరకు బహిర్గతం కాదని ట్రంప్ ప్రకటించాడు.అప్పటి వరకు అది రహస్యమే అన్నాడు. ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమే అని ఇరాన్, మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ చెబుతున్నది.అయితే ఒప్పందం కుదిరింది అన్న తరువాత కూడా లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది, అక్కడి నుంచి తమ సేనలు వెనక్కు రావని నెతన్యాహు చెప్పాడు.తమ దేశ రక్షణకు గాను గాజా, లెబనాన్, సిరియాలో భద్రతా ప్రాంతాలను ఏర్పాటు చేసుకున్నామని అక్కడి నుంచి వైదొలిగేది లేదన్నాడు.లెబనాన్‌లో ఆరులక్షల మంది పౌరులను నివాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ తరిమివేసింది. గాజాలో మాదిరి అక్కడి నివాసాలన్నింటినీ ధ్వంసం చేస్తామని చెబుతున్నది. నెతన్యాహు జవాబుదారీతనంతో ఉండాలని, అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ లేదని గుర్తించాలని ట్రంప్ మంగళవారం నాడు వ్యాఖ్యానించాడు.అయితే ఇదంతా ఉత్తుత్తి బెదరింపే అని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరినా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ చిచ్చును ఆర్పేందుకు అమెరికా సిద్దంగా లేదు. అణుకార్యక్రమం మీద ఒప్పందం ఉంటుందా అంటే అవునని, కాదని భిన్న కథనాలు వెలువడుతున్నాయి.
అవగాహన ఒప్పందం ప్రకారం అరవై రోజుల పాటు కాల్పుల విరమణ మాత్రమే అమల్లో ఉంటుంది.ఈ వ్యవధిలో అణు కార్యక్రమంపై ఒప్పందానికి మార్గాన్ని సుగమం చేస్తారు. 2015లో ఇరాన్‌తో నాటు అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసుకున్న మాదిరి ఒప్పంద అంశాలతోనే మరోసారి జరగవచ్చని భావిస్తుండగా, దాన్నుంచి ఏకపక్షంగా వైదొలిగిన ట్రంప్ అంతకంటే మెరుగ్గా ఏం సాధిస్తాడనేది అసలు ప్రశ్న.అణు ఒప్పందం కుదరకపోతే తిరిగి దాడులను జరుపుతామని ట్రంప్ ప్రకటించాడు. అంతే కాదు తమ దళాలు జలసంధిలోనే ఉంటాయని, అందుకయ్యే ఖర్చులకు పశ్చిమాసియా దేశాల ఆదాయం నుంచి ఇరవై శాతం వసూలు చేస్తామని కూడా చెప్పాడు, అంటే తమ సేనలను కిరాయికి ఇస్తున్నట్లే సంకేతమిచ్చాడు.ఈ అంశాలన్నీ శుక్రవారం నాటికి ఒక స్పష్టతకు వస్తాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒప్పందం కోసం తొందరపడుతున్న ట్రంప్ అసలు తొలుత చెప్పిందేమిటి ? సాధించిందేమిటి ? ఇరాన్‌లో పాలకులను మారుస్తా అన్నాడు. ఇరాన్ అణుకార్యక్రమాన్ని, మిలిటరీని, క్షిపణుల తయారీ కార్యక్రమాన్ని నాశనం చేస్తానని చెప్పాడు. వీటిలో ఏ ఒక్కటీ సాధించలేకపోయాడు. తన పౌరులతో సహా అనేక దేశాల జనాలను అనేక ఇబ్బందులకు గురిచేశాడు. అమెరికా బలహీనతలు ఏమిటో ప్రపంచానికి తేటతెల్లం అయ్యేందుకు దోహదం చేశాడు.
ప్రపంచ వ్యవస్థలో అనేక నూతన పరిణామాలు, పర్యవసానాలకు నాంది వేసిన అమెరికా అధ్యక్షుడిగా చరిత్రకెక్కాడు. వ్యూహాత్మకంగా అమెరికా ఎంత దివాలాకోరుగా ఉందో వెల్లడి చేశాడు. దీని అర్ధం అది మిలిటరీ శక్తిని కోల్పోయిందని కాదు.వేలాది మందిని చంపి, అనేక దేశాల నానా ఇబ్బందులకు గురి చేసి, అనివార్య స్థితిలో స్వయంగా సృష్టించుకున్న ఇరాన్ ఊబి నుంచి బయటపడేందుకు పడిన అతగాడి తపనను ప్రపంచం చూసింది. అమెరికా ఏం చేసినా గుడ్డిగా అనుసరించేందుకు, సమర్ధించేందుకు కూడా మిత్రదేశాలుగా చెప్పుకున్నవేవీ సిద్దంగా లేవని రెండవ ప్రపంచ యుద్దం తరువాత తొలిసారిగా వెల్లడైంది. వారితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇరాన్‌పై దాడులకు పూనుకున్నాడు. ఆ పోరుతో తమకు సంబంధం లేదని, తమది కాదని పశ్చిమదేశాలు ప్రకటించాయి. కిందపడినా తనదే గెలుపన్నట్లుగా ఇరాన్ మీద విజయం సాధించానని పదే పదే ప్రకటించి వ్యక్తిగతంగా అభాసు పాలయ్యాడు.దేశీయంగా చూస్తే స్వంత జనాన్నే మోసం చేశాడు. రెండవసారి తనను గెలిపిస్తే విదేశాల్లో జోక్యం చేసుకోనని, దేశ ఆర్థిక సమస్యల మీదనే కేంద్రీకరిస్తానని చెప్పాడు, మరోసారి అమెరికాను అగ్రగామిగా చేస్తానన్నాడు. దానికి భిన్నంగా వ్యవహరించాడు.
ఇప్పుడు కుదిరిందని చెబుతున్న ఒప్పందంలోని అంశాలని దాడులతో నిమిత్తం లేకుండానే దౌత్య పద్దతుల్లో సాధించి ఉండే అవకాశం ఉందన్నది స్పష్టం. ఒప్పందం కుదుర్చుకొని ఒబామా ఇరాన్‌కు జీవితాన్ని ఇచ్చాడని ఆరోపించిన ట్రంప్ ఇప్పుడు కొత్తగా సాధించిన అంశాలేమిటని రానున్న రోజుల్లో అమెరికన్లు ప్రశ్నిస్తారనటం నిస్పందేహం. తాముగా అణుబాంబులను తయారు చేయబోమని తమ దివంగత నేత అయాతుల్లా ఖమేనీ సంవత్సరాల క్రితమే చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామని ఇరాన్ ఎప్పటి నుంచో చెబుతున్నది. పార్లమెంటు అనుమతి లేకుండా ట్రంప్ బాధ్యతారహితంగా ఇరాన్ మీద దాడులు ప్రారంభించి సమర్ధించు కొనేందుకు నానాపాట్లు పడ్డాడు. ఇతగాడి అతి తెలివితో అనివార్య మైన స్థితిలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఆయుధంగా మార్చుకొని అమెరికా ఆధిపత్యానికి గండికొట్టింది.ఇంతే కాదు, పశ్చిమాసియా, గల్ఫ్‌దేశాల్లో ఉన్న అమెరికా వైమానిక, సైనిక స్థావరాలను కూడా తొలిసారిగా తన లక్ష్యంగా చేసుకుంది, గురిచూసి కొట్టింది. ఈ క్రమంలో అమెరికాకు స్థానం కల్పిస్తే తమకు వచ్చే ముప్పు ఏమిటో కూడా ఆయా దేశాలకు స్పష్టం చేసింది. ఇరాన్‌పై దాడులను ఆపేందుకు గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వత్తిడి తక్కువేమీ కాదు. గతంలో ఎన్నిసార్లు దాడులు చేసినా, పదేండ్లపాటు ఇరాక్‌తో యుద్దం చేసినా అలాంటి ఆలోచన చేయలేదు.
పిల్లిని గదిలో బంధిస్తే పులిగా మారుతుందున్న లోకోక్తిని ఇరాన్ రుజువు చేసింది.అయితే అమెరికా బాధిత దేశాలన్నింటికీ ఇలాంటి అవకాశాలు రావు గానీ, ఇతర పద్దతులను తప్పకుండా అన్వేషిస్తాయి. నిజానికి తొలుత జలసంధిని దిగ్బంధిస్తే వచ్చే పరిణామాల గురించి ఇరాన్ నాయకత్వం భయపడింది.చివరకు జరిగేదేదో జరుగుతుంది చూద్దాం అని తెగించింది. బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కిచచ్చినట్లు చాలా తక్కువ ఖర్చుతో డ్రోన్లు, స్వల్పశ్రేణి క్షిపణులు, మందుగుండుతో నింపిన చిన్న పడవలు, మందుపాతరలతో నౌకలను స్థంభింప చేయవచ్చన్న ఆలోచన పని చేసింది.ఈ చర్య దౌత్యపరంగా కూడా ఇరాన్ పైచేయి సాధించటానికి తోడ్పడింది. అమెరికన్లు ఈ చిన్న అంశాన్ని పసిగట్టలేకపోయారు.తమ ఆంక్షలను ఉల్లంఘించిందనే పేరుతో ఏ ఒక్క నౌక మీద కూడా ఇరాన్ దాడులు చేయలేదు, అదే అమెరికన్లు ధిక్కారమును సైతుమా అన్నట్లు మన దేశం కోసం ప్రయాణించిన మూడు నౌకల మీద దాడులు చేసి ముగ్గుర మన పౌరుల ప్రాణాలు తీశారు.
ఇరాన్ ను దెబ్బతీసేందుకు అమెరికన్లు భారీ మొత్తాల్లో ఆయుధాలను ఉపయోగించారు. దాని దగ్గర ఉన్న నిల్వలు కరిగిపోవటంతో ఉక్రెయిన్‌కు ఉద్దేశించిన వాటిని ఇటువైపు మళ్లించారు. దక్షిణ కొరియాలో ఉన్నవాటిని కూడా తరలించారు. తిరిగి ఆయుధాలను సమకూర్చుకోవాలంటే సంవత్సరాలు పడుతుందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించిందంటే ట్రంప్ ఎంతకు తెగించాడో అర్ధం చేసుకోవచ్చు. అత్యాధునిక ఆయుధాలు ఉన్నా ఇరాన్ ను దెబ్బతీయలేకపోయాయి. అమెరికా మిలిటరీ బడ్జెట్‌తో పోలిస్తే కేవలం వందోవంతు మాత్రమే ఇరాన్ ఖర్చు చేస్తున్నది, దానికి వైమానిక దళం లేదు, ఉన్న నౌకా దళాన్ని అమెరికా దెబ్బతీసింది, అయినా ఇరాన్ ప్రతిఘటన యావత్ దేశాల మిలిటరీకి అనేక పాఠాలు నేర్పుతున్నది. ముందే చెప్పుకున్నట్లుగా అమెరికా మిత్రదేశాల నుంచి వేరు పడింది, మద్దతు ఇవ్వనందుకు ట్రంప్ ఐరోపా నేతలను ఎలా తూలనాడిందీ తెలిసిందే. ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి చెప్పే అమెరికాకు ఇరాన్ మీద దాడితో వాటిని ప్రస్తావించే నైతిక హక్కును దెబ్బతీసింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు !
ఎం కోటేశ్వరరావు
8331013288



