Tuesday, June 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆర్థిక వ్య(అ)వస్థ

ఆర్థిక వ్య(అ)వస్థ

- Advertisement -

“ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ”గా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రచార ఆర్భాటం చేస్తున్నా, అదే ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం మరో వాస్తవాన్ని బయటపెట్టాయి. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి, ముడి చమురు ధరల అనిశ్చితి, ఎరువుల వ్యయం పెరుగుదల, వర్షాభావం ముప్పు వంటి అంశాలపై ఆమె వ్యక్తం చేసిన ఆందోళన దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల తీవ్రతను తెలియజేస్తోంది. అంతకంటే ముఖ్యంగా విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించడం దేశీయ ఆర్థిక పునాదుల బలహీనతను పరోక్షంగా అంగీకరించినట్టే. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే విదేశీ పెట్టుబడుల కోసం ఇంత ఆత్రుత అవసరం ఉండదు. దేశీయ డిమాండ్, ప్రజల కొనుగోలు శక్తి, ఉపాధి అవకాశాలు, వ్యవసాయ ఉత్పత్తి, చిన్న పరిశ్రమల వృద్ధి ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారాలు. కానీ ప్రస్తుతం ఇవన్నీ ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయి. జీడీపీ వృద్ధి గణాంకాలు పెరుగుతున్నాయని చెబుతున్న ప్పటికీ ప్రజల జీవితాల్లో ఆ అభివృద్ధి కనిపించడం లేదు. నిరుద్యోగం పెరుగుతోంది. వేతనాల పెరుగుదల నిలిచి పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గుతోంది. మధ్యతరగతి కుటుంబాలు విద్య, వైద్యం, గృహ వ్యయాల భారంతో ఇబ్బందులు పడుతున్నాయి.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం గత పదేళ్లుగా కేంద్రం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలే. నోట్ల రద్దు, అవ్యవస్థిత జీఎస్‌టీ అమలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి నిర్ణయాలు పెద్ద వ్యాపార వర్గాలకు లాభం చేకూర్చినా, చిన్న పరిశ్రమలు, అసంఘటిత రంగం, స్వయం ఉపాధి రంగాలను తీవ్రంగా దెబ్బతీశాయి. కోట్లాది మంది ఆధారపడే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం కేంద్రం విదేశీ పెట్టుబడు లను అభివృద్ధికి ప్రధాన ఇంధనంగా చూపిస్తోంది. విదేశీ మూల ధనం అవసరం లేదని ఎవరూ చెప్పడం లేదు. కానీ దేశీయ ఆర్థిక శక్తిని పక్కనబెట్టి విదేశీ పెట్టుబడులపైనే ఆధారపడటం ప్రమాదకరం. విదేశీ కార్పొరేట్లు లాభాల కోసం వస్తాయి. లాభాలు కనిపించక పోతే వెనక్కి వెళ్లిపోతాయి. ప్రపంచ మార్కెట్‌లో చిన్న మార్పు వచ్చినా పెట్టుబడుల ప్రవాహం ఆగిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేశీయ ఉత్పత్తి, దేశీయ మార్కెట్, ప్రజల కొనుగోలు శక్తి బలహీనంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలోకి జారిపోతుంది. ఇక దేశంలో సంపద పంపిణీ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. కొద్దిమంది కార్పొరేట్ సమూహాల చేతుల్లో ఆర్థిక శక్తి కేంద్రీకృతమవుతోంది. పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్, గనులు, మౌలిక సదుపాయాలు, టెలికాం వంటి కీలక రంగాల్లో పెద్ద కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం పెరిగింది. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సమూహాల సంపద అపూర్వ స్థాయిలో పెరుగుతుంటే, మరోవైపు కోట్లాది మంది ప్రజలు ఉపాధి, ఆదాయం కోసం పోరాడుతున్నారు. ఈ అసమానతలు పెరుగుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థలో అంతర్గత బలహీనతలు కూడా పెరుగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తరచూ భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెబుతోంది. కానీ ప్రజలకు అసలు ప్రశ్న వేరేది. జీడీపీ పెరిగితే ఉద్యోగాలు పెరిగాయా? రైతుల ఆదాయం రెట్టింపైందా? యువతకు ఉపాధి లభించిందా? మహిళల ఉపాధి పరిస్థితి మెరుగుపడిందా? ఆకలి, పేదరికం తగ్గాయా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. గణాంకాల్లో కనిపించే అభివృద్ధి ప్రజల జీవితాల్లో కనిపించకపోతే ఆ గొప్పలు కాగితాలకే పరిమితం అవుతాయి. నిర్మలా సీతారామన్ ప్రస్తావించిన చమురు ధరలు, విదేశీ మారక నిల్వలు, వర్షాభావం వంటి అంశాలు నిజంగానే సవాళ్లే. కానీ వాటికంటే పెద్ద సవాలు దేశీయ డిమాండ్ బలహీనత. ప్రజల చేతుల్లో డబ్బు లేకపోతే మార్కెట్ కదలదు. మార్కెట్ కదలకపోతే పెట్టుబడులు రావు. పెట్టుబడులు లేకపోతే ఉపాధి పెరగదు. ఈ చక్రాన్ని విరగదీయకుండా విదేశీ మూలధనంపై ఆశలు పెట్టుకోవడం సమస్యకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఇప్పుడు దేశానికి అవసరమైంది కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు కాదు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధానాలు. వ్యవసాయానికి గిట్టుబాటు, చిన్న పరిశ్రమలకు రక్షణ, ప్రభుత్వ రంగ బలోపేతం, యువతకు ఉపాధి, ప్రజా పెట్టుబడుల విస్తరణ. అభివృద్ధి ఫలాలు కొద్దిమందికి కాకుండా సమాజంలోని మెజారిటీ ప్రజలకు చేరినప్పుడే ఆర్థిక వ్యవస్థ నిజంగా బలపడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -