ఈ ఆర్ వో అదనపు కలెక్టర్ వి. విక్టర్
నవతెలంగాణ-మద్నూర్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ కు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ ఈ ఆర్ వో అదనపు కలెక్టర్ వి. విక్టర్ రాజకీయ పార్టీల నాయకులకు కోరారు. జుక్కల్ నియోజకవర్గ పరిధిలో ఓటరు జాబితా సవరణపై అవగాహన కల్పించేందుకు బుధవారం మద్నూర్ మండల కేంద్రంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వి. విక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా తయారీ ప్రతి ఒక్కరి బాధ్యతని, అర్హులైన ఓటర్ల నమోదు, అనర్హుల తొలగింపు, పేర్లు, చిరునామాల సవరణ వంటి అంశాల్లో బి ఎల్ ఓ లకు ఈ ఆర్ వో కార్యాలయానికి పార్టీల బి ఎల్ ఏ సహకరించాలన్నారు.
ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని, ఈ నెల 25 నుండి వచ్చే నెల జూలై 24 వరకు ఇంటింటికి బి ఎల్ ఓ లు వెళ్ళి ఎన్యూమరేషన్ ఫారం లు ఓటర్ లకు అందిస్తారని తెలిపారు. బూత్ స్థాయిలో పార్టీ ప్రతినిధులు ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, ఎస్ ఐ ఆర్ మ్యాపింగ్ పై ప్రజలకు సహాయం చేస్తూ, ఓటర్ల జాబితా పై ఫిర్యాదులు, అభ్యంతరాలను సకాలంలో సమర్పించాలని కోరారు. ఎటువంటి లోపాలు లేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు, పార్టీల మధ్య సమన్వయం అవసరమన్నారు.
ప్రతి పార్టీ బూత్‌కు ఇద్దరూ మంది బి ఎల్ ఏ లను నియమించాలని సూచించారు. క్లెయిమ్స్, అబ్జెక్షన్ల సమర్పణలో ఆలస్యం చేయొద్దని, నిర్ణీత గడువులోగా దరఖాస్తులు ఇవ్వాలని ఆదేశించారు. ఎస్ ఐ ఆర్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు నివృత్తి చేసి అవగాహన కల్పించారు. అంతకు ముందు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎస్ ఐ ఆర్ హెల్ప్ డెస్క్ ను అదనపు కలెక్టర్ వి విక్టర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సమావేశంలో జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బి ఎల్ ఏ లు 8 మండలాల తహసీల్దార్ లు ముజీబ్, రంజిత్, మారుతి, మహేందర్, భుజంగ రావు, నాయబ్ తహసీల్దార్ లు హేమలత, రామకృష్ణ, రెవెన్యూ అధికారులు హన్మండ్లు , మురళి, రవి తదితరులు పాల్గొన్నారు.



