– జిల్లాలోనే అత్యధిక విద్యార్థులతో పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ కు ప్రత్యేక గుర్తింపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని నారంవారిగూడెం గ్రామంలో గల పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) ఎంపీయూపీఎస్ లో బుధవారం సంప్రదాయబద్ధంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలోనే నిర్వహిస్తున్న ప్రీ-ప్రైమరీ విభాగం ఆధ్వర్యంలో ఐదో సంవత్సరంలో ప్రవేశించిన 25 మంది చిన్నారులకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తట్టుకోళ్ళ బసవమ్మ చేత అక్షరాభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలోనే 200 మందికి పైగా విద్యార్థులు ఉన్న ఎంపీయూపీఎస్ గా ఈ పాఠశాల రికార్డు సృష్టించిందన్నారు. 2023 – 24 విద్యా సంవత్సరంలో పీఎం శ్రీ పాఠశాలగా ఎంపికైన తర్వాత విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. యూకేజీ నుంచి 8వ తరగతి వరకు బోధన కొనసాగుతోందని, ఉపాధ్యాయుల కృషితో ప్రభుత్వ పాఠశాలలోనే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యాబోధన, సౌకర్యాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
పాఠశాలలో ప్రస్తుతం ముగ్గురు ఎస్‌జీటీలు, ఐదుగురు ఎస్‌ఏలు విధులు నిర్వహిస్తున్నారని, మరో ఇద్దరు ఉపాధ్యాయులు నియమితులైతే పూర్తి కేడర్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. భవన సముదాయం ఉన్నప్పటికీ 10 తరగతి గదులు అవసరం కాగా ప్రస్తుతం ఆరు గదులు మాత్రమే ఉన్నాయని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో నాలుగు గదులు అత్యవసరమని వివరించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు బీఎస్ రెడ్డి, ఎల్ రేణుక, కొచ్చర్లపాటి శ్రీనివాస్, ఎం.డబ్ల్యూ. ఆశిక్ ఆలం, ఎస్. రవిబాబు, బి. మంగమ్మ, రజని, కవితతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యాసంవత్సరం విద్యార్థుల చేరికలు
2023 – 24 87
2024 – 25 132
2025 – 26 177
2026 – 27 201



