Thursday, June 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమెట్రో పాలీ‘ట్రిక్స్‌’

మెట్రో పాలీ‘ట్రిక్స్‌’

- Advertisement -

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లో మెట్రో రవాణా వ్యవస్థ రాజకీయాలకు చిరునామాగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి మధ్య మీడియా మాధ్యమంగా ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నది. మెట్రో ఫేజ్‌-2ను అడ్డుకుంటున్నారనీ సీఎం, డీపీఆరే సక్రమంగా ఇవ్వలేదని కేంద్రమంత్రి బాహాటంగా విమర్శించుకోవడం, లేఖల మీద లేఖలు రాసుకోవడం ట్రయాంగిల్‌ డ్రామాకు తెరలేపినట్లయింది. ఇక్కడ ఇద్దరి టార్గెట్‌ ఒకటే. మున్సిపల్‌ ఎన్నికలన్నది జగమెరిగిన సత్యం. సందట్లో సడేమియాలా బీఆర్‌ఎస్‌ సైతం అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలకు దిగడం అవకాశవాదంతో వ్యవహరిస్తున్నట్టుగానే ఉంది. ఎవరికి ఎలా వీలుంటే అలా అడ్డగోలు విమర్శలు చేసుకుంటూ, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడమే తప్ప, సమస్య పరిష్కరించే చిత్తశుద్ధి కొరవడిందన్నది వాస్తవం.అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలున్న నగరం హైదరాబాద్‌. కానీ ఇక్కడ సమస్యలు అనేకం. ఓవైపు ట్రాఫిక్‌ ‌సమస్య తీవ్రమైంది. మరోవైపు ఒక్క భారీవర్షం వస్తే చాలు నగరం అతలాకుతలమై డ్రైనేజీలు పొంగి రోడ్లను ముం చెత్తుతున్న పరిస్థితి ఉంది. గంటలతరబడి ట్రాఫిక్‌ ‌జామ్‌‌లతో వాహన దారులు ఇబ్బందులు పడటం సర్వ సాధారణంగా మారింది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్టయినా లేదు.

గత సర్కార్‌ ‌మెట్రోకు పునాది వేసినా, ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా దానిని విస్తరించాలని సంకల్పించినా అంతవరకు మంచి విషయమే. అయితే ఫేజ్‌-2కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)‌ను కేంద్రానికి రాష్ట్ర సర్కార్‌ పంపింది. మొదటి ఫేజ్‌ను ఎల్‌అండ్‌‌టీ రూ. 15 వేల కోట్లకు కొనుగోలు చేసింది. కొత్తగా ఫేజ్‌ 2కు ఎన్‌‌ఓసీతోపాటు ఆర్థిక సాయం, ఇండియన్‌ ‌రైల్వే ఫైనాన్సియల్‌ ‌కార్పొ రేషన్‌(ఐఆర్‌ఎఫ్‌‌సీ) నుంచి రుణం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ఇక్కడే అసలు కుట్ర రాజకీయం మొదలైంది. మెట్రోతోపాటు రాష్ట్ర అవసరాల కోసం ప్రధానిని కలవడం, కేంద్ర మంత్రులకు వినతిపత్రాల ఇచ్చు కుంటూ పోవడం రాష్ట్ర సర్కార్‌ ప్రయత్నంగా ఉన్నది. అయితే ఢిల్లీలో తిష్టవేసిన కిషన్‌‌రెడ్డి, సీఎం పోయినకాడికళ్లా వెళ్లి రుణంతోపాటు ఏదీ ఇవ్వొద్దంటూ చెబుతున్నాడని రేవంత్‌‌రెడ్డి బహిరంగంగా విమర్శించడం పలు అనుమానాలకు తావిచ్చినట్టయింది. అందులో భాగంగానే మెట్రో ఫేజు 2కు బీజేపీ సర్కారు గ్రీన్‌‌సిగ్నల్‌ ఇవ్వలేదని తెలుస్తోంది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌‌తోపాటూ కూటమి రాష్ట్రాలకూ ఇచ్చి తెలంగాణకు మొండిచేయి చూపడం ముమ్మాటికీ వివక్ష‍ే అవుతుంది. అలాగే ఐఎఫ్‌ఆర్‌‌సీ నుంచి రూ.13,600 కోట్లు రాకుండా కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, మనోహర్‌‌లాల్‌ ‌ఖట్టర్‌‌పై కిషన్‌‌రెడ్డి ఒత్తిడి తెచ్చాడని ఆరోపణ.

గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లన్నీ బీజేపీకి బదిలీ చేసిన తరుణంలో కిషన్‌‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌మాట వింటూ అభివృద్ధికి సహకరించడం లేదనేది సీఎం ఆరోపణ. అయితే మెట్రోకు యాభై శాతం నిధులివ్వడానికి ఇప్పటికే కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని కిషన్‌‌రెడ్డి చెప్పినా, చేతలు మాత్రం సున్నా. ఇదంతా ఇక పార్శ్యం. మరో వైపు నిధులు, ప్రాజెక్టులు ఇవ్వకపోతే గొంతు పెంచి, కలిసివచ్చే వారితో ముందుకు వెళ్ళటానికి రేవంత్‌‌రెడ్డి కూడా సంశయిస్తున్నారు. ఆకాశంలో మెరుపులా మీడియాలో ఆరోపణలు, విమర్శలు చేసి వదిలేస్తున్నారు. నిక్కచ్చిగా నిలదీస్తూ, నిఖార్సుగా నిధులు, ప్రాజెక్టుల కోసం వెంటపడటం లేదు. పెద్దన్న మాత్రం తమ్ముడి వినతులను చెత్తబుట్టలో పడేస్తున్నారు. బీజేపీ ఆలస్యం మూలంగా మెట్రో నిర్మాణ వ్యయం కాస్త రూ.15 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెరిగింది. యాభై శాతం నిధులు ఇవ్వకున్నా పరవాలేదు. ఎన్‌‌వోసీ ఇచ్చి ఐఆర్‌ఎఫ్‌‌సి నుంచి రూ.40 వేల కోట్ల రుణం వచ్చేలా చేయాలని సీఎం పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్రం పెడచెవిన పెడుతుండటం అవకాశవాదానికి నిదర్శనం. ఏది ఏమైనా హైదరాబాద్‌ ‌నగర ప్రజలు ట్రాఫిక్‌ ‌కష్టాలు తీరాలంటే మెట్రో విస్తరణ తప్పనిసరి. ఒక వేళ రేవంత్‌‌రెడ్డి చెప్పినట్టు మెట్రోను ఎవరైనా అడ్డుకుంటే, గతంలో పట్టం కట్టిన ప్రజలే, ఆనక వచ్చే ఎన్నికల్లో అథ:పాతాళానికి తోక్కేయడం ఖాయం. స్వార్థ రాజకీయలను పక్కనపెట్టి ఇప్పటికైనా మెట్రోకు సంబంధించి అన్ని అనుమతులను తీసుకురావడం కేంద్రమంత్రిగా కిషన్‌‌రెడ్డి బాధ్యత, అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విన్నపాలతో సరిపెట్టకుండా అన్ని పార్టీలతో అఖిలపక్ష‍ సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలి. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి, కేంద్రంపై ఒత్తిడికి పోరుబాట పట్టాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -